పుట:హాస్యవల్లరి.pdf/177

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తనయింటి గోడదగ్గిరికి జేరుకుని 'అమ్మయ్య' అనుకుని, ఎడ్లకి తెలకపిండి పెట్టి లేవగొట్టమని ఇద్దర్ని పంపించాడు. ఎన్నివీశెల తెలకపిండి పెట్టినా, అవేం యెడ్లోగాని, తలకాయకూడా నేలమీదే సాచి తిన్నాయి గాని లేవడానికి సంకల్పమేనా ఉన్నట్టు కనిపించలేదు. పనసయ్యకి మరోమార్గం తోచక, ఆ బల్ల చెక్క పట్రమ్మని దాని మీదికే ఒక్కొక్క ఎద్దుని ఎక్కించి వనమయ్యని జేరవేసినట్టే వాటినిగూడా జేరవెయ్యమని మరోనలుగుర్ని పంపించాడు. విజయసూచకంగా ఉండే నిమిత్తం నాగలి పట్టుగున్నవాణ్ణి అల్లానే పట్టుగు ఉండమని చెప్పడానికి మరోణ్ణి పంపి తను ఇంట్లోకి వెళ్లాడు. వెంటనే అతని వెధవ అక్క అతనికి దిష్టితీసేసింది. అంతా వెళ్లిపోయారు.

అదిలగాయితు ఆభూమి తప్పకుండా శ్మశానమే అయిఉండి ఉండాలనే భావంతో వనమయ్య పనసయ్యలు దాల్లో చదరపు అంగుళమూకూడా దున్నలేదు, వాడలేదు, తొక్కలేదు. కాని మునసబు కరణాలు ఆ భూమి ఆయేడు సాగు అయినట్టు పైవారికి తెలియచెయ్యడంవల్ల వెన్నావారికి ఆరురెట్లు అపరాధంపన్ను కట్టారు. ఆ దెబ్బతో వెన్నావారికి అక్కడ పొలం ఉన్నట్టు బోధపడింది. వాళ్ళూ తంటాలుపడి పైవాళ్ళనిచూసి, అవసరప్రకారం సంతోషపూర్వకంగా లంచాలుపోసి, బ్రహ్మాండంమీద అది రుద్రభూమేగాని తమదికానేకాదని లెఖ్కల్లో నమోదు చేయించేవరకూ నిద్రాహారాలు లేకుండా శ్రమపడ్డారు. ఆ భూమి అరణ్యంలాగ మళ్ళీ దుబ్బువేసింది. నాటికి నేటికి ఆక్షేత్రంలో సంగ్రామము మాత్రం మరోటి ఏదీ జరగలేదు, ఏగ్రామం వాళ్ళూ చూడరానూ లేదు. వనమయ్య పనసయ్యలు మాత్రం కొద్దికాలంలో కూడబలుక్కుని అక్కణ్ణించి కాపరాలు ఎత్తేశారు.

- జూలై, 1941

భమిడిపాటి కామేశ్వరరావు రచనలు - 1

167

హాస్యవల్లరి