పుట:హాస్యవల్లరి.pdf/176

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

హడిలి, బెదిరి, ఎగిరి, మేఘాలమీద లేచిపోయాయి. నాగలి అక్కడే ఉండనిచ్చి పొగరుమోతులు కాని ఎడ్లనే తోలుకురమ్మని పనసయ్య పాలేరుతో అన్నాడు. వాడూ వెళ్ళి రెండు ఎడ్లని - బక్క చచ్చి ఉసూరుమంటూ కళ్ళల్లో ప్రాణాలు పెట్టుగున్న వాటిని - తోసుగొచ్చాడు. వాట్లకీ నాగలికీ పసుపు రాయించి వాటిని కట్టి, కర్రు నేలకి ఆనించి, నాగలిపిడి పనసయ్యకి అందించి, ముల్లుకర్రకూడా అతడి చేతికిచ్చి పాలేరు తప్పుగుని పనసయ్యకి గొడుగుపట్టాడు. ఎడంచేత్తో నాగలి అదిమి “ధర్మానికేజయం, అనగా నాకే!" అని కేకేసి, పనసయ్య ఎడ్లని కర్రచ్చుగుని పక్కమ్మట తగిలించాడు. అవి కించిత్తూ చలించలేదు. తక్షణం అతడు రెండింటినీ ముల్లుపుచ్చుగుని రక్తంవచ్చేలాగ - రక్తం ఉంది గనక వచ్చింది - గుచ్చాడు, అవి రొండూకూడా పడుకున్నాయి. ఇంకా కొట్టినా గుచ్చినా అవి నిద్దరకూడా పోతాయేమో అని పనసయ్య నిదానించాడు, పనసయ్య (తన పాలేరుతో) “మరి అటకాయించ మనవోయ్, పౌరుషం ఉంటేనూ!” అని గిరజాలూ, మీసాలూ రెండు చేతులా దువ్వి చూపించాడు. వనమయ్య ఆ పాలేరు కేసే చూస్తూ, “అసలు దున్నమనవోయ్, పశుత్వం నిలబడితేనూ” అని కనుబొమలూ, క్రాపింగూ రెండుచేతులా దువ్వి చూపించాడు. పనసయ్య పాలేళ్ళలో ఒక తెలివిగలవాడు చరచరా పరిగెట్టి చిట్టుబుట్టా, తెలకపిండీ పట్టుగు చక్కావచ్చి ఎడ్లకి చూపించాడు. ఎడ్లులేచి విద్దెంచేసి నడక కూడా ప్రకటించాయి. పనసయ్య నాగలి చాలాతేల్చి పట్టుగున్నా కొంచెం గడ్డ విరిగింది. పనసయ్య పార్టీ వాళ్ళంతా కరతాళధ్వనులు చేసి ఈలలు వేశారు. వనమయ్యకి ఆగ్రహం, ఆవేశం ఇనుమడించాయి. అతడు హుంకరించి, మజ్జిగ తాగి, తల్లికి మొక్కి పెళ్ళాం యిచ్చిన హారతీ, స్నేహితులు వేసిన కర్పూరదండా ఆఘ్రాణించి, ఠీవిగా నడిచి డేకుతూన్న ఎడ్ల ఎదటికి వెళ్ళి, ఈలోపుగానే మిక్కిలి చకచకా తన పాలేళ్ళు అక్కడ పరిచిన పరుపు సమీపించి “ధర్మానికే జయం , అనగా నాకే!” ముక్తసరుగా ఉపన్యసించి ఒంటరిగాడైనప్పటికీ అమితమైన ధైర్యమూ, అమానుషమైన సాహసమూ వెలిబుచ్చుతూ దానిమీద పరుండి అరక సాగకుండా అడ్డుతగిలాడు. వనమయ్య పక్షంవాళ్ళు ఎగిరి, గంతులేసి, పక్కవాళ్ళని బాది, రుమాళ్ళూ తలపాగాలూ పైకి ఎగరేసి ఎవళ్ళవి వాళ్లు సంపాదించుగునేసరికి నానాబాధా పడ్డారు. ఎడ్లేనా తొక్కెయ్యచ్చు, నాగలేనా చీరెయ్యచ్చు, పనసయ్యేనా గుచ్చెయ్యచ్చు అనే నిరాశలో పడిపోయి, వనమయ్య చూస్తూనే ప్రాణం ఉగ్గబట్టి, పైకిమాత్రం నవ్వు మొఖం పెట్టి, కర్రబారి పోయాడు. ఇంతలో దగ్గిర దగ్గిర జనం “ఎముకలులా ఉన్నాయేం? దున్నగానే బయట పడుతున్నట్టున్నాయి” అంటూ వెనక్కి తగ్గి ఇంటికి దారెట్టడం సాగించారు. వనమయ్య ఆ కాస్తచూపూ లేకుండా ధైర్యంగా కళ్ళు మూసేసుగున్నాడు. పనసయ్యకి వణుకుపుట్టింది. కాని ఏర్పాటు ప్రకారం పనసయ్య మనుష్యులు నలుగురు ఓబల్ల చెక్క తెచ్చి పక్కని ఉంచి దానిమీదికి అతిమృదువుగా వనమయ్యని పరుపుపళంగా ఎక్కించి, నడకలో తడబడినా, పడెయ్యకుండా సాయంపట్టి కాలవగట్టుమీద అతని యింటి ఎదట పెట్టారు. ఓ పాలేరు వనమయ్య మొహంమీద నీళ్ళు కొట్టాడు. వెంటనే అతడు లేచి పరుపు తడిసిపోతోందని వాణ్ణి తన్నబోయాడు గాని తూలిపోయాడు. కొడుకు పాట్లకి తల్లి కళ్లు ఒత్తుగుంది. కాని అతని పెళ్ళాం ఓ రోకలి పుచ్చుకుని నాగలివేపుకి రాబోయింది. పనసయ్యకి పై ప్రాణం పైనే ఎగిరిపోయింది. అతడు చాలా అర్జెంటుగా బయటికి వెళ్ళి వస్తానని చెప్పి నాగలి ఓ పాలేరుకి అప్పగించాడు, ఇంతలో ఎడ్లు పడకేశాయి. పనసయ్య

భమిడిపాటి కామేశ్వరరావు రచనలు - 1

166

హాస్యవల్లరి