పుట:హాస్యవల్లరి.pdf/168

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఇంకా మా వాటాలోనే ఇటూ అటూ తిప్పుతూంటేనూ, గుండయ్య గాడు పిరికిపందలాగ వెనకాలే - వీడికాళ్లు పడిపోనూ - వచ్చి, - వీడి వేళ్ళు అంటించా - అంటుగునేట్టు ఒక్క చరువు నన్ను చరిచి, పిల్లాణ్ణి కింద పడగొట్టి, బండీ లాక్కు చక్కాపోయాడు, అల్లరవుతుందని అప్పట్లో వాణ్ణి నేను కొట్టలేదు. న్యాయతహా చెప్పుచ్చుగు కొట్టవలిసింది. ఇహ వడ్లాబత్తుడితో ఏం చెప్పనురా బాబూ అనుకుంటూ వాడిదగ్గిర కెళ్ళేసరికి ఆ రాలుగాయి శనిగాడు నీలుగుతూ. 'సిత్తం' అది గుండయ్య గారిదేనండి. మరమ్మతుకోసం అంపారు' అన్నాడు!! ఇది గుండయ్యపనే అయి ఉంటుంది, వీడికొమ్ములు ఎల్లా కొట్టెయ్యడమా, నేను తనంతవాణ్ణే అని వీడికి పాఠం చెప్పడం ఎల్లానా, నా గౌరవం నిలుపుగోడం ఎల్లానా అని నాకు అనిపిస్తూ ఉండేది.

ఎల్లనో పోనీ అయింది దిగమింగి సరిపెట్టుగుందాం అని యత్నిస్తూండగానే, మిరియమ్మ ఓచీర కొంది. అందులో విశేషం ఏమీలేదు. దానికి అంచుమాత్రం పచ్చగా నదరగాఉంది. ఆచీర సింగారించుగుని, మెడ టెక్కించడం, తాళ ప్రకారం నడుస్తూన్నట్టు నడవడం, ఒయ్యారం ఒలక పొయ్యడం, ఉమ్మడి హాల్లోకి రావడం, మా ఆవిణ్ణి వచ్చి కూచోమనడం, అర్థంలేని కబుర్లెట్టడం! ఎందుకూ! మహా అక్కడికి చీరకొంది కాదూ ఎల్లాగైతేం, వెధవచీరా! - నోరు తిన్నగా రాదు నాకు ఏమనుకున్నారోగాని - ఆ సింగారం అంతా ప్రకటించుగోడానికి! ఆమాత్రం మేం కొనుక్కోలేం అనే దాని ఊహా! మా ఆవిడ మిరియమ్మ గర్వం చూసి క్షమించి కిమ్మనకుండా ఊరుకుంది. ఇంకోత్తి అయితే అచ్చంగా అల్లాంటి చీర నుంచున్నపాట్న తెస్తావా కంఠానికి ఉరోసుగోమన్నావా అని ముగుణ్ణి ఱంపాన్ని బట్టి రాసేసేదే. కాని, మావాళ్ళు అల్లాచెయ్యక, రెండోవాళ్ళకి బాధలేకుండా, అన్నం మాత్రం మానేసి బొట్టు చెరిపేసుగుని అతిశ్రావ్యంగా లయ యుక్తంగా రాగాలు పెట్టారు. ఇలాగంటియిల్లాలి కంటినీరు కారితే సముద్రాలు ఏకం అవుతాయని భయంవేసి, చటుక్కున నా ఉంగరం తాకట్టెట్టి రాత్రికి రాత్రి వెళ్ళి నేనూ అల్లాంటిచీరే గాలించి పట్టుగుని తెచ్చి మా ఆవిడికిచ్చి, అది ఆవిడ ధరించి తూర్పు తెల్లారకుండా ఉమ్మడిహాల్లో ఎత్తుపీట వేసుగుని కూర్చుని, మిరియమ్మని పిలిచి ఆవిడతో సోదివేస్తే, అప్పుడు మిరియమ్మకి మాతక్కువ ఏముందో తన ఎక్కువ ఏం చచ్చిందో బోధపడి సిగ్గురావచ్చు గనుక, అల్లా కానిమ్మని మా ఆవిడతో చెప్పాను. కాని ఉదయాన్నే నన్ను లేవగొట్టి మా ఆవిడ దుఃఖించడం మొదలెట్టింది. ఏమంటే నే తెచ్చినచీర అంచుకంటె మిరియమ్మ చీర అంచు, రంగులో, ఒత్తుగా ఉందిట. నిజమే అయిఉంటుంది. రాత్రి నాకు ఆనదు. ఇంతేగదా అనేసి ఆలస్యం కానీకుండా నిలువు కాళ్ళమీదపచ్చసిరా తీసి తెచ్చి మా చీర అంచుమీద ఓ 'కోటింగు' వేశాం. దాంతోటి మిరియమ్మ జలుబు వదిలిపోయిందనుకున్నాం. కాని, మిరియమ్మ మర్నాడు ఓ యాభైయ్యెట్టి బణాత్ చీరకొంది. మా ఆవిడ తక్షణం తనకి గౌరవహాని కలగడం కనిపెట్టి, వెఱ్ఱిబాగుల్ది గనక ఎంతోంత చిన్నబుచ్చుగునే, తన పాత నాగరమూ పట్టిడా కరిగించి సొమ్ము తెప్పించి, అదెట్టి శుద్దబణాత్ కొని, మిరియమ్మ కంటె ముందు కట్టేసుగుని ఉమ్మడి హాల్లో కూచుంది.

ప్రశ్న - కొంత పోటీభావం మీలో లేదంటావా!

రా - ఏడిసినట్టే ఉంది. ఇదా నీతీర్పు! అసలువాళ్ళు ఎప్పుడు ఏం పనిచేసినా తమరి నిమిత్తం కాదు, పక్కనున్న మా దరిద్రం, మా అల్పత్వం, మా అధమత్వం, మా అజ్ఞానం

భమిడిపాటి కామేశ్వరరావు రచనలు - 1

158

హాస్యవల్లరి