పుట:హాస్యవల్లరి.pdf/167

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రా - ఏట్లో వాళ్ళమాట ! ఎవరున్నారూ, మా పొరుగువాటాలో అద్దెకుంటూన్న పీనుగులు!

ప్ర - పేర్లు!

రా - వాడి పేరు గుండయ్య, భార్య మిరియమ్మ.

ప్ర - ఓహో! ఉమ్మడిస్థలం గురించిన కుస్తీలా! ఆ మిరియమ్మా

మీ కూచమ్మగారూ పట్టింపులు పోతూంటారు గావును!

రా - అంతటితో కుదిరిందా! హాలూ దొడ్డీ ఉమ్మడి, నా వాటా తూర్పుది, వాడి వాటా పడమటిది, మధ్యహాలులో చెరిసహానికి గీత గీసుకున్నాం. కాని, ఆ చచ్చినాడు రాత్రి మమ్మల్ని కునకనిచ్చి ఆగీత మావాటాకేసి జరిపేస్తూంటాడు. కానీ, వాడిగీత ప్రకారం వాడికి అవుతుందని ఊరుకుంటిని గాదా, ఊరుకుంటూన్న కొద్దీ వాడికి నోరెగిసిపోతోంది, పోటీ బిగిసిపోతోంది.

ప్రశ్న - అసలు కమామీషు ఏమిటి?

రా - అసలా? వాళ్ళు గొప్పవాళ్ళనీ మేం అల్పులంఅనీ; వాళ్ళు ఉద్యోగులనీ, మేం కాదనీ! వాళ్ళు డబ్బున్నవాళ్ళనీ మేం లేని వాళ్ళంఅనీ! ఏముందీ! గుండయ్యకి కొడుకు ఓడున్నాడు. వాడు అచ్చంగా బూడిద గుమ్మడికాయలా వుంటాడు. మొహం కొండముచ్చు మొహం, ముక్కు చిచ్చుబుడ్డి, అం, తోటి కుమారస్వామీ తమరికి ఉన్నాట్టా మాకులేట్టా, అందుకని నేనూ మా ఆవిడా ఉడికిపోయి, వెళ్ళి, మా చెల్లెలి గారి అబ్బాయిని తెచ్చుగున్నాంట తమరిమీద పోటీకోసం! ఈమాట పట్టుగుని మమ్మల్ని అడ్డమైన వాళ్ళ దగ్గిరా నిరసన! వాళ్ళొచ్చి నాతో చెప్పరనే గావును ఈ బోడిగాడి ఉద్దేశం! -

ప్ర - మీరు అక్కడికి వెళ్ళింతరవాతే, వాళ్ళకి పిల్లాడున్నాడు అని తెలిసింతరవాతే, ఒక పిల్లాణ్ణి మీరుకూడా తీసి తెచ్చుగున్నారు గావును!

రా - సడె! మేం మా చెల్లాయిగారి అబ్బాయిని అనేకమాట్లు, ఈ గుండయ్యకి కొడుకుకుంక పుట్టకపూర్వమే ఆపేక్షకొద్దీ తీసి తెచ్చుకునే వాళ్ళం. నీచులికిగాని పోటీ మా కెందుకు ఉంటుందీ! గుండయ్య అంతటితో ఊరుకోవచ్చా, తన కుర్రవెధవకి తోపుడుబండీ ఓటికొన్నాడు. కొన్న మూడోనాడు, మా ఆవిడ, - చెడిబతిగావా బతిగిచెడ్డావా అన్నట్టు, స్వతహా అయినింటి బిడ్డగనక - నాతో “తీరా మనం పిల్లవాణ్ణి ఓణ్ణి తీసి తెచ్చినవాళ్ళం అవనే అయాంగందా! ఊళ్ళో వాళ్ళ కుర్రవెధవ లందరికీ తోపుడు బళ్లు ఊరేగుతూన్నప్పుడు మనం అంత చెడిపోయామా, అంతకీచాలమా, అంతా చెయ్యమా? పాడు రకాలకిగాని మనబోటి గాళ్ళకి పోటీబుద్ది ఎందు కుంటుంది గనక! మనం తీసికట్టు అని ఋజువు చెయ్యడానికేట వాళ్ళు బండీ కొన్నది! ఈపిల్లాడికి మాత్రం బండిమీద మక్కువ ఉండనే ఉండదా, కుర్రనాగమ్మ విప్పిచెప్పుకోలేడుగాని! మీరుకూడా వీడికి ఓటి అల్లాంటిదే కొని గౌరవం నిలబెట్టండి” అని సన్న సన్నంగా సమంజసంగా నా భార్య చెబుతూంటే ఆవిడమాట వినకపోడం అనేది మహాపాతకం అనిపించింది. కాని, బులబాటం చల్లారిం తరవాత, తీరా బండిమీది వ్యామోహం రెండుపూటల్లో గతిస్తే, కొన్న బండీ మళ్లీ ఏం జేసుగోం? అని, నేను ఆలోచించుగుని, ఓబండీ 'టెంపొరీ' గా తెత్తాంగదా అని మర్నాడు చీకటడ్డ తరవాత ఓ వడ్లాబత్తుడింటికెళ్ళి, అక్కడికి మరమ్మతు నిమిత్తం వచ్చిన ఓ బండీ చూసి, బదులుచేసి తెచ్చిన ఓ పావలా వాడిచేతిలో పడేసి, మర్నాడు సాయింత్రానికి అది మళ్ళీ అప్పగించేసే షరతుకి ఇంటికి తోసిగెళ్ళాను. పొద్దున్నే మాపిల్లాణ్ణి అందులో కూచోపెట్టి

భమిడిపాటి కామేశ్వరరావు రచనలు - 1

157

హాస్యవల్లరి