పుట:హాస్యవల్లరి.pdf/169

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వెల్లడి చెయ్యడానికే అని మాకు తెలుసు, వాళ్ళ “నవిజం” మీకేం తెలుసూ! నాకు నీలక్ష్యంగాని, గుండయ్య లక్ష్యంగాని, మరో మెడమీద తలున్నవాడి లక్ష్యం గానిలేదు. నా గౌరవానికి భంగం వస్తూన్నప్పుడు నాకు అన్నం వడ్డించే వాణ్ణయినా సరే పొడిచేస్తాను. అవసరాన్ని బట్టి నేను దేవుణ్ణికూడా లక్ష్యం చెయ్యను. సమయం వచ్చేసరికి అసలు నాఅంత తల్లకిందులు ముండావాడు ఉండబోడు. ఇంతలో గుండయ్యగాడు ఓ కుక్కపిల్లని కొన్నాడు. దొంగభయం దొట్ర భయం ఉండదు. భైరవం అవతరాల్లో చేరుతుందన్నారు. ఓ కుక్కపిల్ల ఉండడం మనికిమంచిది' అని నా అర్ధాంగి. నాకు అప్పటికి పదిరోజుల క్రితంనించీ సకారణంగా నూరిపోస్తూంటే వాడెప్పుడో వినేసి చేసినపనే అది. మా ఆవిడ మాటల్లోఉండే యాధార్థ్యం మరి తోసెయ్యలేక, మర్నాడు నేను కుంభయ్యగారి కుక్కపిల్లని ఓమాటు అరువిమ్మని అడిగి, గొలుసు పళంగా తీసుగొచ్చి, మా స్తంభానికి ఇల్లా కట్టేస్తూంటే, ఆ కుక్కపిల్లకి ఏం అనుమానం తగిలిందో, లటక్ మని నాకాలు పట్టుకుంది. 'బాబో, రావే రావే' అని మా యింట్లో వాళ్ళని ధైర్యంకోసం కేకేశాను. గుండయ్యకుంక ఇంట్లోలేడు. వాడికుక్కపిల్ల ఏమనుకుందో దానితాడు తెంపుగుని వచ్చి నేతెచ్చిన కుక్క పిల్లమీద పడబోయి - అది తప్పించుకోగా - నారొండో కాలు వడేసి పట్టుగుంది. ఇంట్లో మూల జేరేసిఉన్న మన్యపుకర్ర తెచ్చి మా ఆవిడ ఉమ్మడిగా, దంచి తిరగేసింది, నా కాలికి కొంచెం దెబ్బ తగిలినా నేను లెక్కచెయ్యలేదుగాని, కుంభయ్య కుక్కపిల్ల కుయ్యో మొర్రోయని మొరుగుతూ గిరగిరా తిరిగి పడుకుంది. గుండయ్య కుక్కపిల్ల దెబ్బ తగిల్నట్టేలేదు. అప్పుడు నేను లోపలికెళ్ళి చేంతాడు తెచ్చి దాన్ని కాళ్ళ మీద ప్రాణావశిష్టంగా ఉతికి మళ్ళీ మా వాటాలో అడుగు పెట్టడానికి వీల్లేకుండా ఏర్పాటు చేసేశాను. మిరియమ్మ ఏడుచుగుంటూ ఇదంతా గుండయ్యతో చెప్పుగుంది.

ప్రశ్న - కుంభయ్య తన కుక్కపిల్ల కోసం పేచీ పెట్టలేదూ?

రా - ఎందుకూ! అది చావందే! ఊరికే పడింది. గంజోసి లేవదీశాం. అక్కణ్ణించి గుండయ్య మొహం చూడకూడదు అన్నంత అసహ్యం నాకూ మా ఆవిడికీ కూడా పట్టుగుంది. అదిలగాయతు, నిద్రాహారాలు మానుకుని ఆ వెధవ ఏ కొత్తవస్తువు ఇంట్లోకి తెచ్చుగుని బడాయి కొడుతూనో కొట్టకుండానో ప్రకటిస్తూంటే మూడు మూర్తులా అల్లాంటిదే నేనూ తక్షణమే తల తాకట్టెట్టయినా సరే తెచ్చి నా యింట్లో పడేసి, “ఏమిట్రా నీ గొప్పా! ఎవడికి భయంరా ఇక్కడా! నేను తక్కువ తిన్నానుట్రా! చూస్కో రా!” అని నేననుకుంటున్నానని వాడికి బోధపడేటట్టు చేసేవాణ్ణి. మిరియమ్మ చెవలికి గరిగమ్మల్లాంటి లోలకులు చెయించింది. మేమూ చెయించాం. ఆవిడకాళ్ళకి చక్కిలాలు చెయించింది. మేమూ చెయించాం. ఆవిడి వెండిగ్లాసు కొంది, మేం మా పల్లెటూరిలో స్థలం అమ్మేశా - లేకపోతే వీళ్ళపొగరు అణిగి ప్రపంచం బాగుపడేట్టు కనపడలేదు. ఆ డబ్బొచ్చింది. మేమూ వెండిగ్లాసు కొన్నాం - అల్లాంటి పలకల వెండిగ్లాసే. ఆవిడ పోటీకోసం ఇరవైకాసులెట్టి ఒడ్డాణాం చెయించింది. మేం రహస్యంగా గిలుటుది కొన్నాం. ఆవిడ గంగాళం కొంది. మేమూ కొన్నాం. ఆవిడ దాసీదానికి కుడికన్ను గుడ్డి. కుడికన్ను అల్లానే ఉన్నవాళ్లు ఆ ఊళ్ళో దొరక్క మేమూ దాన్నే పెట్టుగున్నాం. గుండయ్యగాడు ఫిడేలు కొని మొదలెట్టాడు. నేనూ కొని వాయించడం మొదలెట్టగానే అది వినడానికి వాడికి చెవుల్లేక తను వాయించడమే మానేశాడు. వాడు లెక్చరు ఇచ్చాడు. నేనూ లెక్చరు ఇచ్చినట్టు ఒక విలేఖరికి రెండు

భమిడిపాటి కామేశ్వరరావు రచనలు - 1

159

హాస్యవల్లరి