పుట:హాస్యవల్లరి.pdf/154

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పురుషులైతేసరి, గోత్రం పట్టింపులేదని బుకాయిద్దాం అంటే, నాకు ధైర్యం చాల్లేదు. "అయితే మరి నాకు సెలవు. ఉంటాను.” అన్నాను నేను పెళ్ళికొడుకు తండ్రి అమాంతంగా నా రొంటినున్న మంగళ సూత్రాలు - అక్కడుండడం ఎప్పుడు చూశాడో ముండావాడు-ఊడలాగి పుచ్చుకున్నాడు. ఒక వితంతువు కళ్యాణం రావాలమ్మా! కళ్యాణం రావాలీ! నేను కళ్లారా చూద్దాం అని ఇబ్బందైనాసరే చూరికిబుట్టెడు తలంబ్రాల బియ్యం మూటకట్టి తెచ్చాను. పాపిష్టికళ్ళకి ప్రాప్తం లేదు.” అని దుఖ్ఖించింది. అంతా లేచి కళ్ళు నులుముకుంటూ తలోమాటా ఆడారు. ఈ సందులో, కన్యాప్రదాత నన్ను పక్కకి లాక్కెళ్ళి “మీకు ప్రమాణపూర్తిగా చెయించడం వచ్చా!” అని అడిగాడు. “రామ రామ! నాకు రాదండి” అని లబ్బున మొత్తుగున్నాను. వెంటనే ఆయన ఒక పదిరూపాయల కాగితం నా మీద పారేశాడు. పారేస్తూ, “నయమే!

మీకే అసలు మంత్రాలన్నీ వచ్చి ఉంటే ఈ పాటికి చావవలిసొచ్చేది” అని నన్ను పొగిడాడు. తరవాత అతను 'నా రూపాయిలు ఇవ్వకుండా వీధులోకాలెట్టావంటే, రెండోకాలుఉండదు. జాగర్త!' అని వియ్యంకుణ్ణి - ఇహను అల్లా అనకూడదు - గనక ఆ రెండోవాణ్ణి నిలేశాడు. వాడు 'చాల్లే! జీలకర్రా బెల్లం మినహాయింపుగా వివాహం. వివాహంతాలూకు హైరానా, యావత్తూ అయింతరవాత ఇప్పుడెల్లా కట్నాం వెనక్కియ్యడం?” అన్నాడు. 'ఓరి నీతాడు తెంపా, అల్లాయితే దూట బిళ్ళల్లాంటి రూపాయిలు లాగేస్తావుట్రా' అని పెళ్ళికూతురుతండ్రి పందిరిగడ గుంజి దొరకపుచ్చుకున్నాడు. ఆమట్టుగా పందిరికి వేళ్ళాడగట్టిన హరికేన్ లాంతరు ఊగిసలాడి దిబ్బుమంది. ఆచీకట్లో నేను నా బిచాణా పోగుచేసుగుని ఇవతలపడి, ఇల్లుచేరేదాకా వెనకచూపు లేకుండా అదేపరుగు!

ఒక వేళ గోత్రాలు సరిపడి, అది ఖాయంగా పెళ్ళే అయిఉండి, తరవాత మొగుడూ పెళ్ళాలకి తగాదాలొచ్చి, మొగుడు పెళ్ళాన్ని వొదిలేస్తానని బెదిరించడంతో ఆ పిల్ల తన పెళ్ళామే కాదని అంటే, అప్పుడు అసలు నిజంగా పెళ్ళి జరిగిందా అనే సంగతి గురించి సాక్ష్యం కావలిసొచ్చినా, నేనుయుగం తిరిగినా సాక్ష్యం ఇచ్చిఉండను. నాకు పెళ్ళి చేయించడం రాదని మీరు సాక్ష్యం, అందుకే ఈసంగతి నేను తమతో మనవిచేసుగున్నాను.

అని చెప్పి, కుంభయ్యశాస్త్రి, సంగతి ముగించాడు, " అందరంగం

- సెప్టెంబరు, 1938

భమిడిపాటి కామేశ్వరరావు రచనలు - 1

144

హాస్యవల్లరి