పుట:హాస్యవల్లరి.pdf/150

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అతని నెత్తెక్కి తాండవిస్తున్నాయి - ఇంత ఘటం లేదు ఇల్లెక్కి పిండికొట్టిందని కాదూ, దోమసామెతా! అతను ఇందాకటి దోమని ఒక్కదాన్నే పట్టుగున్నాడు. అది అతనికి అందకుండా దూలందగ్గిరికి ఎగిరింది. అతను ఎగర్లేక ఊరుకుని, ఈ మాటు చెప్పులు కొనుక్కునేప్పుడు దోమవేటలో కూడా ఉపయోగపడేలాగు స్ప్రింగ్ చెప్పులు కొనుక్కోవాలను కున్నాడు. దానికేసే చూస్తూ, కిందకూర్చుని పుస్తకం విప్పి ఎదురుగుండా పెట్టుగున్నాడు. ఏమరుపాటుగా దాని గమనం కనిపెట్టే ఊహతో బుర్రవంచి చదవడం అభినయించాడు. కాని, అది ఏ వేపుకి ఎప్పుడు ఉడాయిస్తుందో అని పక్క బెదురుతోనే ఉన్నాడు. పాపం, అది కదిలి, దిగి, అతని చుట్టూ ఒక్క పెద్ద సున్నా చుట్టి, పుస్తకం మీద ఒక వేపున వాలింది. అతనికి కొంచెం విజయం దక్కేలాగ కనపడింది. 'నా అంతవాణ్ణి నువ్వు నెగ్గుతావా! అయిందిలే నీ పని!' అని అత ననుకున్నాడు. మళ్లీ, 'పిచ్చిగమీద బ్రహ్మాస్త్రం' అన్నట్టు 'దీనిమీదా నా శౌర్యం, పోనీ దీన్ని క్షమిద్దాం' అనుకున్నాడు. ఇంతలో పాడైపోయిన వేళ్లమాట జ్ఞాపకంవచ్చింది. ఇక పుస్తకం ఠప్పున మూసెయ్యడం తడువు, దోమ పైసలా అన్న మాటే అనుకున్నాడు. అయితేం పుస్తకం యొక్క రెండు అట్టలూ పుచ్చుగోడానికి వెళ్లడంలో కుడిచెయ్యి ఎడందానికంటే ఏ అరలిప్తో ముందు వెళ్లడం వల్లగావును పుస్తకం కొంచెం కదిలి, దోమ మళ్లీ దారెట్టింది. ఠపేలు మని శబ్దం అయేసరికి కునికిపాట్లు పడేవాళ్లు తెరలోవాళ్లూ ఏ బాంబు పేలిందో ఏ తుపాకీ పెట్టి ఇతను కొట్టుగున్నాడో అని కంగారు పడి ఇతణ్ణి పట్టుగోడానికి వెళ్ళారు. అతడు మాత్రం చేతులు జోడించి, నిలబడి, కళ్ళు మూసుగుని ఈ క్రింది మాటలు పఠించగా తక్కిన వాళ్ళు నిర్ఘాంతపడి విన్నారు.

"శ్రీమన్మహాదోమ! నీకుట్టడం మండ నేనోడిపోయాను, నెగ్గింది నువ్వేను ఓ దోమ రాజా యటంచుం నినున్ పెద్దచేతుం, బలే, భేషు, వా, యంచు కర్ల పేయంబులౌ నీగానముల్ వర్ణనల్‌సేతు, నిన్ గూర్చి హారతుల్ వెల్డింతు, సాయంత్ర మీనామ సంకీర్తనల్ జేసి నీదివ్య చారిత్రముల్ పాడి ఏ బాడిలో నీవు మున్ పుట్టితేనేమి నీ అస్రపత్వంబు రాత్రించరత్వంబునం జేసి నిన్ గూడ దైతేయ వర్గంబునం జేర్చి ఆబ్రహ్మ యంబ్రహ్మ మాకంటే మీజాతి పై జాతిగా జేసెకాబోలు! ఆమధ్య ఈ మధ్య రాజ్యాలు చేసే మహా చక్రవర్తుల్ని రాజాధిరాజుల్ని సింహాసనం మీంచి మానవుల్ దింపారు. పంపారు, చంపారు! కాని యేమానవుల్‌గాని నిన్ నెగ్గుటల్ విన్నడవ్, కన్పడవ్!! నీకొక్క కైవారముంజేతు, నీ కోప మింకన్ తమాయించు, నీ వెట్లు వాంఛించెదో యట్టెనారక్తంబు తోడి నీరెక్కలన్ సిక్తంబు గావించుకోగాని అంతంరక్తంబు పీల్చేసి పైపెచ్చు నా ఒంటి మీదన్ మలేరియావంటివౌ వ్యాధులం దెచ్చి పాతేసి పోబోకుమీ, నీకు చాలాను పుణ్యంబు లుండవ్, ఇదే స్వీకరించాలి నాదండమున్ ననున్ నెగ్గి నీ ప్రజ్ఞ చూచే ప్రపంచానికిన్ జాటినా వికన్ నన్ను మన్నించి రక్షించు శ్రీ దోమరాజా! నమస్తే నమస్తే నమః!

- ఆగస్టు 1938

భమిడిపాటి కామేశ్వరరావు రచనలు - 1

140

హాస్యవల్లరి