పుట:హాస్యవల్లరి.pdf/149

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చుట్టం రావడం, అతనికి దోమ తెర సప్లైకాకపోడం జరిగితే, అతడు యథాశక్తిగా వేట నేర్చుగుతీరాలి. దోమలూ నల్లులూ కొత్త మనుషుల్ని నిమిషంలో పోలుస్తాయి. కుక్కల్లాగా అవి కూడా పసికడతాయేమో! రోజూ మనం కూర్చుంటూన్న పడక కుర్చీమీది నల్లులు మన్నికుట్టవ్, అంటే మనం స్వంతరక్తం ధారపోసి వాటిని పెంచుతున్నాం కనక మన యందు విశ్వాసం, అని కొందరన్నారు. రక్తం మన్దేగనక, రక్తస్పర్శ ఉండబట్టి పీడన మాన్తాయని కొందరన్నారు. కాని, పరాయివాడు వచ్చి, 'అమ్మయ్య' అంటూ సర్దుకోబోయేసరికి వాడికి వెంటనే అర్ఘ్యమిస్తాయి. దోమలధోరణి అల్లాంటిదే అప్పు డాపరాయివాడు 'మీరు ఈ బాధఎల్లా భరిస్తున్నారండి' అంటాడు. 'అబ్బే, నన్నేమీ చెయ్యవండి!, అంటాం మనం.

ఒకసారి ఒకబస్తీ స్నేహితుడింటికి ఆరుగురు వెళ్ళారు, ఇద్దరికి దోమ తెర సప్లై అయింది. కడం నలుగురూ మర్యాద కోసం ఇవతల చిక్కడ్డారు. చుట్టుపక్కల అడివి ఎదేనా రేగిందో ఏమో ఆరోజున దోమల పటాలాలు చాలా వచ్చాయట. వస్తునే తెర ఇవతల చిక్కడ్డ నలుగుర్నీ తణిఖీ ప్రారంభించాయి. కూచోనివ్వవ్, నుంచోనివ్వవ్, వెన్ను వాల్చనివ్వవ్, కునుకోనిస్తాయీ!! వీళ్లల్లో చిన్నప్పణ్ణించీ ఉక్కు రోషగాడు ఒకడున్నాడు. అతణ్ణి కొన్నొచ్చి కేటాయింపుగా పట్టుగున్నాయి. ఎవ్వర్నేనా దోమలు ఆవహిస్తే ఓపట్టాన్ని వదలవ్ - నడిచినా, పరిగెత్తినా, వాహనం ఎక్కినా సరే వదలవ్! గంగలో దిగాలిగాని గత్యంతరం లేదు. రోకలి పుచ్చుగు దంచినట్టు పడిలేస్తూ అతని నెత్తిమీద ఓ ఇరవైయ్యో ముప్పైయ్యో సమావేశించి, మనిషిని దిగదుడుపుకింద కట్టి ప్రదక్షిణాలు ప్రారంభించాయి. అతడు పళ్లు బిగించి వాటి కేసి చూస్తూ వీలైనంత వడిగా ఇటూ అటూ పరుగు ప్రారంభించాడు. దోమతెరలో వాళ్ళు కళ్లు మూసుగునే ఉండి, “అబ్బా! ఏముటోయ్!అల్లరీ! పరాయి సౌఖ్యం బొత్తిగా కిట్టదేమిటోయ్, నీకూ!' అని కేకేశారు. దాంతో అతని రోషానికి కారం రాసినట్టుయింది. 'సరే లెండోయ్' అని, అతను కూర్చుని పుస్తకం తీసి చదవడం

మొదలెట్టాడు. కీనీడని జేరి దోమలు అతని వీపు లగాయిస్తున్నాయి. కడం వాళ్ళు, 'దీపం ఊదేస్తే దోమలు తగ్గుతాయి, దీపం తీసెయ్,” అన్నారు. ఎల్లాఅయితేం అతడు చదువుకోడానికి వీల్లేకుండా దీపం దిగదీశారు. గదంతా చీకటి వెల్తురూ ఎదీకాకుండా అయి, అతనికి కేవలం సంధెత్తినట్టయింది. ఈ దోసందులో ఒకదోమ రైంయ్యిమని గానం చేస్తూ విమానంలాగ అతని చెవిమీదుగా పోయి, అతని ముక్కుమీద వాలింది. అతను ఆసమయంలో తన కాలిమీద వాలబోతున్న మరొక దోమని గమనిస్తున్నాడు. తక్షణం ముక్కు మీదిది కుట్టింది. దాన్ని సాగదీసి కొట్టబోయేసరికి, తన ముక్కు ఊడిపడేటంత దెబ్బ ఛెళ్లున తనకే తగలగా, ఆదోమ మెత్తగా లేచి కటాకటీగా చక్కాపోయింది. అది ఎగిరి ఎక్కడ కెడుతుందో అని దాన్నే చూస్తూ అతడు నడవడంలో గదంతా ముసుగు ముసుగు ఉంది కాదా! - పడుకున్నవాళ్ల కంఠాలు తొక్కాడు 'నిన్ను తగలెయ్యోయ్' అంటూ వాళ్ళు కేకలూ తిట్లతో లేచి దీపం హెచ్చుచేశారు. అది గోడమీద వాలింది. మెల్లిగా శబ్దం చెయ్యకుండా, మాట్లాడవద్దని కడంవాళ్ళకి సంజ్ఞలు చేస్తూ, అతడు వెళ్లి దాన్ని ఒక్క చెంపకాయ తీశాడు. అతి సున్నితంగా దారితీసి దోమ పారిపోయింది. అతనికి దోమతోపాటు వేళ్ళుకూడా స్వాధీనం కాకుండా పోయాయి. 'అబ్బబ్బ' అని బాధపడుతూ కూడా అతడు దాన్ని వదల్లేదు. ఈలోపుగా బోలెడు దోమలు

భమిడిపాటి కామేశ్వరరావు రచనలు - 1

139

హాస్యవల్లరి