పుట:హాస్యవల్లరి.pdf/151

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గుసగుస పెళ్ళి

“ఏమీ ఫర్వాలేదు, నీకేమీ తగాదా రాదులే, ఏమన్నా శృతిమించివస్తే నీ ప్రాణానికి మా ప్రాణం అడ్డువేస్తాం మాది పూచీ, ఇక్కడ పరాయివాళ్లు ఎవళ్ళూ లేరులే,” అని మేం ఎంతో భరోసా యిచ్చిం తరువాత కుంభయ్య శాస్త్రి తన అనుభవం ఈరీతిగా మాతో చెప్పాడు.

అయ్యా! మనవి చేసుకుంటాను పెద్దలూ, బంధువులూ, వెల్లడీ, లేని వివాహాలు ఎన్ని వందలవుతున్నాయని మీ ఊహ! డబ్బుఖర్చు తగ్గుతోందికదా అని వీట్లకి మోజు ఎక్కువవుతోంది. వీట్లకి ముహూర్తపు పట్టింపులు లేవు. అసలు రాజ్యాంగపు జబర్దస్త్రీలకి పంచాంగపు మూహూర్తాలు పాటించవలసిన అవసరం లేదు. ఏది వీలుగా ఉంటే అదే సుముహూర్తం. ఛస్తారా ఏమిటి ధర్మచ్యుతి అయేటప్పుడు!

నిన్న రాత్రి మా నాన్న నాలుగు పెళ్ళిళ్లు వరసని చేయించడానికి బజానా కాదు సొమ్మంతా పుచ్చేసుకున్నాడు. మూడు చేయించడానికి తనికి వీలుందని అంచనా వేసుకున్నాడు. నాలుగోది నన్ను వెళ్ళి చేయించమన్నాడు. పెళ్ళి చేయించడం అంటే ఇదేమన్నా కూర్చుని వస్తువు చేయించడం లాంటిదా! నాకు పెళ్ళి చేయించడం రాదు. చాలా రావు అందులో అదోటి ! తమకే తెలుసు. అయినాగానీ వెళ్ళాను. చూసిచూసి ఈ కాలంలో రూపాయలు పోగొట్టుకోనా మరీ!

ఆడపెళ్లివార్ని నే నెరగను.మగపెళ్లివార్ని అసలే ఎరగను. వాళ్ల పేర్లు గోత్రాలు వగైరా నాకేమీ తెలియదు. రాత్రి ఒంటిగంటకి ఈ ఊళ్లో రైలు దిగినట్టు ఒంటెద్దుబళ్లమీద వాళ్లు పెద్దింటివారి దొడ్డిదగ్గరి కొచ్చారు. ఆ యింటివారంతా మూడోకాలం నిద్రలో ఉన్నారు. ఏర్పాటు ప్రకారం వారిదోడ్లో రహస్యంగా రాత్రిళ్లు వివాహాలు అనేకం పిట్టకి తెలియకుండా అయిపోతుంటాయి. నేనూ అక్కడికి వెళ్లాను. ఒక బండీలోంచి ఒకపిల్లా తల్లిదండ్రులు ఇద్దరు వితంతువులూ దిగారు. రెండు పెద్దగోనీ సంచులుకూడా వాళ్ళు మెల్లిగా కిందికి సాయంపట్టారు. రెండో బండిలోంచి ఒక కుర్రాడూ తల్లిదండ్రులూ మరిద్దరూ దంపతులు దిగారు. వాళ్లు కొన్ని పెట్టెలు చప్పుడనేది లేకుండా దింపారు. అంతా లోపల జేరాం. వీళ్లతో ఒక చాకలీ వాళ్లతో ఒక నౌఖరూ వచ్చారు. వాళ్ల చేతికి ఒక బూర ఇచ్చి, కర్మవశం చేత ఏపోలీసులేనా, కిట్టనివాళ్ళె వళ్ళేనా, పసికట్టి వస్తూన్నట్టాయినా అది ఊదితే మేం లోపల మా జాగర్త మేం పడతాం అని వాళ్ళతో చెప్పి వాళ్ళని బయట నిలేశాం. నా బిచాణా నేను ఒక పక్కని పెట్టాను. 'బిచాణా ఎందుకయ్యోయ్?” అని మీరు ప్రశ్నించ గల్రు. ఎవడేనా తణిఖీకొస్తే నేను అమాంతంగా అది పరిచేసి గాఢంగా నిద్రపోతూన్నట్టు కనపడ్డానికి. జీలకర్రా బెల్లం ఉన్నాయా అని నేను ఒక వితంతువుని అడిగాను, సిద్ధంగానే ఉన్నాయని ఆవిడ అంది, పెళ్ళి అంటే నాకు తెలిసింది. అంతే, మంగళ సూత్రాలు నాచేతికిచ్చారు. అవాంతరం ఎదేనావస్తే నేను వాటిని బుగ్గని పెట్టుకోవలసి ఉంటుందని వాళ్ళు తీర్మానం చేశారు. ఏదో ఏడుస్తాను, మంగళాస్నానాలు కానిమని నేను వాళ్ళని తొందరచేశాను. “కాసిని వేణ్ణిళ్ళేనా లేక

భమిడిపాటి కామేశ్వరరావు రచనలు - 1

141

హాస్యవల్లరి