పుట:హాస్యవల్లరి.pdf/148

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విమర్శలు ఏం జెయ్యగలవ్, ఏ ఒకదానికీ స్థిరత్వంగాని, ఏం రెండింటికీ సమత్వంగాని, ఏ మూడింటికీ సాపత్యంగాని ఉండకపోడం సహజంగదా అని, గాన ప్రియులైనా రాయల్లా మాట్టాడ కూరుకోకూడదూ, మనం బతిగిపోదుం!! వాళ్ళు ఈ విషయంలో మరీ పుణ్యం కట్టుగున్నారు. దోమగానం మిక్కిలి ఉత్కృష్టం అని వారు చచ్చు తెగేసి చెప్పి దాన్ని ఊహూ తెగపొగుడుతూండడం అల్లా ఉండగా, పైపెచ్చు ప్రతినిత్యమూ దోమనామస్మరణేనా చేస్తే పరానికేనా నయం అని తమలో తమరు ఒక రహస్య తీర్మానం చేసుగున్నారు. అందుకనే, ఈ రహస్యం తెలిసిన వాళ్లంతా పాడేటప్పుడు తానంవగైరా మిష కల్పించుగునీ, ఉత్తపుణ్యానికికూడా, “తద్దదోంద, దోందోంద దోంద, దో ఒ ఒ ఒ ఒ దొ ఓ ఒ ఓం దోం” అంటూ స్పష్టంగా దోమాంకిత నాదం వినపడనిస్తారు. ఈ సంగతి మరి దోమలు ఏ రేడియోలో పసికట్టాయో మరీ పేట్రేగిపోయి, గాయకులే తమ గానం మెచ్చింతరవాత మనుషుల లెక్కేమిటని చెప్పేసి, మానవులు కోరకపోయినాసరే, వద్దు పొమ్మన్నాసరే, మానకుండా, మానవులకి ఠోలీయేనా టిక్కట్టు ఖర్చులేని గానకళ దేశ కాలపాత్ర వివక్షతలు లేకుండా విరివిగా ప్రసాదిస్తున్నాయి.

ఇంత అసంఖ్యాకంగా సృష్టింపబడ్డ జంతువు వ్యర్థం అయిఉండదు, దీని ప్రయోజనం ఏమిటా అని కొందరు దీర్ఘాలోచనలో ఉన్నారు. వెనక పాంకరిచిన ఒక మనిషిని దోమలు మూగేసరికి అతడు నిద్దర్నించి లేచి కూచున్నట్టు కూచున్నాడట. దీనిసైజు వెనకటికంటే పెరిగిందనిన్నీ కేవలం పిచ్చిగంత పరిమాణం కొద్దికాలంలోనే పొందుతుందనిన్నీ కొందరు సూచించి ఏ ఆహారం - రక్తంకాక - దానికి సప్లైచేస్తే అది యింకా విజృంభిస్తుందో చూస్తున్నారు. బస్తీలన్నింటిలోనూ ఈ జంతువు దండిగా పుట్టి పెరగడానికి సక్రమమైన ఏర్పాట్లు చేస్తుంటారు. అంచేత ఓబస్తీకీ మరోబస్తీకీ చేతిబంతి, కాలిబంతి, వాలిబంతి, కర్రబంతి, తడకబంతిపోటీలు జరిగించినట్లే దోమబంతిపోటీలు పెట్టాలని కొందరు సెలవిచ్చారు. బస్తీ దోమ, మురుగుదోమ, నాటుదోమ, లంకదోమ, మడదోమ వగైరా దోమవిశేషాలపట్టీలు తయారుచేసి పంపిస్తే వాటిల్లో మిక్కిలి పొడుగుపట్టీకి గొప్ప బహుమతి ఇస్తాం అని ఒక పత్రికలో ప్రకటించడం వల్ల, ఆ పత్రిక పత్రికంతా సమూలంగా అమ్ముడైపోయింది. కోడిపందాలులాగ దోమపందాలు కూడా వెనకే ఉన్నట్టు ఒక శాసనంలో ఉన్న భాషకి తన అర్థమనిన్నీ తక్కిన అర్థాలు తీసేవాళ్ళకి ఆలోచన నిండుకుందనిన్నీ ఒకరు అనుకుంటున్నారు. కిటికీవగైరాలకి కటకటాలు వేయించడం నిద్దరికి పడ్డ కళేబరాల్ని దోమలు బయటికి మోసెయ్యకుండా ఉండడానికే అని ఒకాయన ఈ మధ్య నొక్కి వాదించి ఇంగ్లీషులో ఆగ్రహించాడు. ఎగిరే స్వభావం ఈ జంతువుకి ఉంది కనక, కొద్దికాలం దీన్ని తరిఫీయతుగాని చేస్తే, ఖర్చు లేని విమానం - 'కీ' యిస్తే పరిగెత్తే శకటం లాంటిది - తయారు కాకపోతుందా అని ఒక జపానీయుడు ఏక తలపోస్తున్నాడట! వేటలు అనేవి హిందు సాంప్రదాయంలో చాలా ఉన్నాయనిన్నీ, దోమవేటలోకూడా అరితేరి ఖండాంతరాల్లో మెప్పులుపొందిన హిందూ రాజకుమారులు

ఉండేవారనిన్నీ చదువుకున్న వాళ్లు చెబుతూంటారు. వెనకే, తత్తుల్యులు ఇప్పుడూ ఉండచ్చు, దోమతెర్లు కట్టుగున్నవాళ్ళు, లోపల జేరి, ఒకటీ అరా దోమలనిమిత్తం రాష్ట్ర కలహంలో ఉంటూంటే, తెరలుకట్టుగోడానికి తడిలేనివాళ్ళు లోకక్షేమం నిమిత్తం మహాదోమ సంగ్రామంలో పనికొచ్చే బహిరంగపు దోమవేట అభ్యసిస్తూంటారు. పల్లెటూర్నించి బస్తీకి

భమిడిపాటి కామేశ్వరరావు రచనలు - 1

138

హాస్యవల్లరి