పుట:హాస్యవల్లరి.pdf/147

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

దోమరాజా!

దోమలమాట చెబుతా! పక్షికిలాగ రెక్కలు రెండూ ఏనుక్కిమల్లే తొండంఒకటి భగవంతుడు కట్టబెట్టాడూ! పండితులంతా విధంచెడి ఏకమై ఏనుగుతో జోడించి సమాసించారూ! వృత్తి రహిత దీపా లొచ్చి వహ్ని శలభ న్యాయాన్ని రద్దుచేస్తున్నాయీ! మునిసిపాలిటీలు జనం యొక్క నీటి యిబ్బంది గమనించి జనానికి ఇన్నినీళ్ళు వదులుకుని, తద్వారా పగటివేళ కూడా పని కలిపించాయీ! ఇవతల వాళ్లకి - దాని మొహం ఈడ్చా - చెముడనేది ఉందో లేదో కాస్త కనుక్కోడమేనా లేకుండా అడ్డంపడి చెవులు కొరకడం సహజంగా చేతవునూ! ఇహ,

దోమలు మిడిసి పడ్డాయీ అంటే, వింతేమిటి వడ్డూర్యమేమిటి నా మొహం! ఇంత కమామీషు ఉంటూన్నప్పుడు వాటిని మిడిసేనా పడకుండా చావమన్నారా ఏమిటి! వాటి ప్రయోజకత్వానికి సాయం అవి ఏమూలో పడి ఉండకూడదూ అని కొందరు కోప్పడేది. కాని అది వ్యర్థకోపం, ములాధారంగా ఉండే పదార్థాలు వ్యాపకం కాకామానవు. పోనీ అందుకు ఒప్పుగోవచ్చుగాని, రాత్రింబగళ్లు నిద్రలేకుండా (ఆహారం లేకేం రోగం, బోలెడుంది!) వీటిని అనవసర సంచార ప్రచారాలు సాగించమని ఏడ్చినవా డెవడయ్యా, అని కొందరి ప్రశ్న కాని, ఏం చెప్పగలం? ఎవరికి ఎంతముట్టాలో అంతా ముడి తేగాని ఊరుకోరుమరి, మానవజాతి తమరికి బాకీ ఉన్నతిట్లూ చంపపెట్లూ అణాపైసల్తో వసూలు చేసుగోవాలని దోమల ఏడుపు గావును! అదీకాక, చేతుల్ని రెక్కలు అనికూడా పిలుస్తూంటారని గావును మానవులే ఎగిరిపడేవాళ్లుంటూన్నప్పుడు దోమలు ఆగుతాయా, వాటిని ఎవరైన ఆపగల్తుమా! అన్నట్టు, మానవుల్ని చెవులట్టుగుని ఆడించగలం గదా అని ఈ దోమలకి ఎంతగర్వం అనుకున్నారు, అవి రేవెట్టి రొదగా చెబుతూన్నా మనం వాటిని విసిరికొడతాంగాని! ఇంకోటిట! అవతల శివుణ్ణీ ఇవతల దోమల్నీ పెట్టి తూస్తేటా, ముల్లు దోమలవేపే చూపుతుందిట! ఎందుకంటేటా శివుడు పుణ్యాత్ములకి మాత్రం, కాశీమరణం లభించినవారికి మాత్రం, కుడిచెవిలో మాత్రం, తారకోపదేశం తీరుబడిని బట్టి చేస్తేచేస్తాడట, లేకపోతే లేదుట! కాని, దోమలో! చివరికి దురాత్ములైనా సరే, అకాశీ అయినాసరే, మరణం లభించకపోయినాసరే, కుడి ఎడమా లేకుండా, చెవి అయినాసరే కాకపోయినాసరే, రాత్రి రెండోఝాం వేళ యినాసరే-అవసరాన్ని బట్టి అప్పట్లో మరీ భారీగా అఠ్ఠ తారకోపదేశం కాకపోతే లెక్కేమిటన్నాను-తారకం అంటేలాగు గీరకోపదేశం చేస్తేగాని సర్దణిగి ఊరుకోవుట!! పోని ఇదంతాకూడా సత్యమేనని ఒప్పుగుని ఇదవుదాం అంటే మన్ని అవెక్కడ ఊరుకోనిస్తాయీ, వెఱ్ఱిమాటా! దోమలకి గాంధర్వంలో ప్రవేశం ఉండడంవల్ల మానవులకు మరీ చావొచ్చిపడింది. అయ్యా, నమ్ముతారో లేదో, ఎల్లాగైతేం మహా ఆఖండగానం తమదేఅంటూ అవి ప్రకటించుగునే ప్రత్యేకపు బడాయి ఎన్ని పుట్లనుకున్నారు, వీటి బడాయి తంపటేయ్యా! దోమలకి పుట్టుకతోటే తాండవం ఉందిగనక, దోమగానాన్ని ఏదో మామూలు పక్షిగానం కింద జమకట్టిపారెయ్యక, మాంచి యక్షగానంలాంటి నాటకవిశేషం అని, జనం ఒప్పుగుతీరక ఏంజేస్తారో చూస్తాంగా అని కొందరు దోమగాన విమర్శకులు వెనక హంగుచేసి వీట్లకి హుషారీ ఇస్తున్నారు. పోనీ,

భమిడిపాటి కామేశ్వరరావు రచనలు - 1

137

హాస్యవల్లరి