పుట:హాస్యవల్లరి.pdf/142

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అచ్చయ్యని కొట్టొచ్చాడట. వాడు ఇట్టీ తప్పించుగుని, ఆయన్ని చచ్చేట్టు ఒక్కతోపు తోశాడట. ఆయన పెళపెళ విరుచుగుని పంది మీద చెట్టులా పడిపోయాడట. అదికూడా కింది పడిపోయి అతణ్ణి కరవబోగా, మావాళ్లు నవ్వుతూ దాని అదరకాయించి అవతలికి కొట్టేశారట. ఇంతలో, పంతులు లేచి, ఓకత్తిపీట దొరకపుచ్చుకుని అచ్యయ్యని నరికెయ్యడానికి వీధులోకి రాబోతున్నాడట.

చెల్లమ్మగారు ఇంట్లోకి వస్తూనే "రామచిలకోయ్! నీ మరిదికి పెళ్లివారు వచ్చారేవ్!” అని కేకేసిందిట, అప్పుడు ఓ చీకటిగదిలోంచి ఒక అమ్మాయి ఇవతలికి వచ్చి, “మామగార్ని ఎవరో కొడుతున్నారు! రండత్తా!” అందిట,

ఇంతలో మేం చెట్టునీడనించి అరుగుమీదికి వదల బోయేసరికి, ఓబయ్యా కామయ్యా వీధిని ఎగబడి అదే:పోత పోతున్నారు. అచ్చయ్య కొంతదూరాన్ని ఖణాయించి నిలబడ్డాడు. పంతులు కత్తిపీట బాణకర్రలా తిప్పుతూ ఇంట్లోంచి వస్తున్నాడు.

పం - ఇప్పుడు రండిరా!మీ మొహాలు మండా!

చెల్లమ్మ - (ఇంట్లోంచి గుమ్మంలోకి వచ్చి) ఇదిగో, మిమ్మల్నే! ఇల్లా రండి? వినిపించుగోరేం! మీమాటే! మీతో ఓ మాట చెప్పాలి మంచిది! ఇల్లారారేం?

పం - కాస్సేపుండు! సొద! ఇవతల పనిమీద ఉంటూంటేనే! కళ్లేమయినాయి?

చె - (పళ్ళు బిగించి సంజ్ఞలు చేసి, నెగ్గి, ఆయన తనదగ్గరికి వచ్చిన తరవాత ఉండండి, ఏమీటా ఆగ్రహం! వచ్చిన వారెవరో చూసుకోడం ఉందా, చూసుగోడం లేకుండానే ఇదవుతారా మీ ఇదవడం మీరును! మన సుందరానికి మంచి ఎదిగిన (అని మెల్లిగా అతని చెవులో కొంత మాట్లాడింది)

ఈ మంత్రం పంతులికి కూడా పట్టిచ్చింది. అతడు వడి తగ్గించి కొంచెం సద్దుకున్నాడు. కత్తిపీట తిప్పడం మానేశాడు గాని అది అసలు పారెయ్యలేదు. “అల్లాచెప్పూ! నాకూ మొదణ్ణించీ అనిపుస్తూనే ఉంది - ఇది వియ్యాలారి హాస్యం కాదు గదా - అని, ఇప్పటికి బోధపడింది.” అంటూ ముసిముసి నవ్వు తెచ్చుకుని మమ్మల్ని “బాబూ, రండి రండి. అరుగు మీద దయ చెయ్యండి. సంగతులు క్రమేపీ గాని తెలియవు” అని హెచ్చరించాడు. ఓబయ్య కామయ్య పొరుగూరు అవడంచేత జంకి కేకకి అందకుండా పోయారు. వాళ్ళని కూడా పిలవడానికి వాళ్ళ వెనకాల పంతులు కత్తిపీటతో సహా దౌడు ప్రారంభించాడు. అతని వెనకాలే అచ్చయ్యా సాగాడు. ఓబయ్య కామయ్యలు పరిగెత్తలేక పొలిమేరదగ్గిర ఆగి ఎదురుతిరిగి పంతులుతో దెబ్బలాటికి సిద్ధంగా నుంచున్నారు. పంతులు వెళ్ళి వాళ్లు రావలిసిందని వాళ్లని కాళ్లట్టుగుని బతిమాలుకోడానికి ఒంగున్న సమయంలో అచ్చయ్య పిల్లిలా వెనకాలే వెళ్లి, ఆయన వాళ్ల కాళ్లు నరకపోతున్నాడనుకుని, ఆయన నడ్డిమీద ఒకటిచ్చుగున్నాడు. ఆయన మొర్రో అని, అచ్చయ్య కేసి తిరిగి, “అయ్యా! వియ్యాలారి హాస్యం మరిచారు. తమరుకూడా వచ్చి నా యిల్లు పావనం చెయ్యండి.” అని బతిమాలుకున్నాడట. వాళ్ల ముగ్గురికీ ఆశ్చర్యం వేసిందిట. వాళ్లూ “ఇదేమిట్రోయ్” అనుకుంటూ వచ్చారు. జానికి రామయ్య నేనూ వాళ్లకి సంజ్ఞలు చేశాం. వాళ్లు పూర్తిగా గ్రహించలేదు. ఆపళంగా జానికిరామయ్య వాళ్లతో “ఏమర్రోయ్! సంబంధం తేలకుండా ఉన్నప్పుడు జరిగినవాటికి బొడ్డుతుమ్మాలు. మన రామయ్య కూతురు సంబంధానికి పంతులుగారు ఒప్పుకున్నారు. ఇక మనమూ వారు ఒకటి, వారు సిద్ధంగా ఉన్నారు. మనదే అలస్యం!” అని కాస్త తెలిగించి చెప్పేశాడు.

భమిడిపాటి కామేశ్వరరావు రచనలు - 1

132

హాస్యవల్లరి