పుట:హాస్యవల్లరి.pdf/143

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అక్కణ్ణించి చూస్కోండి మాదశ. కాళ్లు కడుక్కోడానికి వేణీళ్లు ఇచ్చారు. జానకి రామయ్య ఓ చుట్ట కావాలన్నాడు. పంతులు ఇంట్లోకి వెళ్ళి ఓ అరవీశెడు పొగాకు బొండం తెచ్చి అతనికి ఇచ్చి, “పెళ్ళి మనుగుడుపులుకి వచ్చినప్పుడు మీరు ఓ చట్టో అరచట్టో పొగాకు వేసుగు వెడుదురుగాని” అన్నాడు నిమిషంలో అందరికీ వేణీళ్ల స్నానాలు, అచ్చయ్య మాత్రం మొట్టమొదట బుర్రకి కొంత నూనె పులిమి, అది వదలడానికి కాసిన కుంకుళ్లు తెమ్మని, ఆపులుసుతో తల రుద్దుకునేటప్పుడు ఆమురికి వంటిమీద పడడం వల్ల వంటి జిడ్లు వదలడానికి సున్నిపండి తెమ్మని మొత్తం మీద రెండు మూడు తలంట్లంత స్నానం చేశాడు. చెల్లమ్మ గారు శుభమల్లే సంబంధం కలిసిరావడం వల్ల తద్దినంలో దిగడం కూడదని గ్రహించి గావును, వంటకి రానని కబురంపి, మాకు వంట చెయ్యడానికి మడి కట్టుగుంది. మాకు అగరు నూనె, అత్తరూ వగైరాలు ఇచ్చారు. మాలో కొంతమంది మళ్లీ మళ్లీ అల్లాంటి తరుణం దొరకదేమో అని ఈ సీసాలు బోర్లించి పాదాలకి కూడా రాచేసుగున్నారు, ఒకళ్ళిద్దరు కొంత లోపలికి కూడా పుచ్చుకున్నారు - లోపల సమేతూ సువాసనకలగడానికి, ఇల్లంతా ఘుమఘుమలాడు తూండగా మమ్మల్ని మళ్ళు గట్టుకోమన్నారు. మేం లేవబోతూన్నాం. వీధి గుమ్మంలోకి వీధి గుమ్మంలోకి గుర్రం వచ్చింది. గిరజాలాయన దిగాడు. గుమ్మంలోకి రాగానే మా బృందం కంటబడేసరికి ఆయన నిశ్చేష్టుడయ్యాడు. సువాసన తగలేసరికి ఆయనికి మతోయింది. లోపలికి వెళ్ళి సంగతి గ్రహించాడు. అతడు మళ్ళీ ఇవతలికి వచ్చి ఊరుకోక ఓ చిన్న పేచీ వేశాడు. “తమర్ని గురించి అమ్మా నాన్నా చెప్పారండి. అందులో అమ్మ మహ పట్టుపడుతోంది. సంబంధం విషయం బాగానే ఉంది. కాని ఒకటి తమరు ఆలోచించ లేదు. 'కతికితే అతకదు' అని శాస్త్రం. తమరు ముందుగానే ఇక్కడ భోంచెయ్యడం జయకరం గాదు” అన్నాడు. నోటి దగ్గిర అన్నంలాగి పారెయ్యడానికి వీడెక్కడ పోగయాడ్రా పేచీరాయుడు అని మాలో ప్రతీవాడికీ అనిపించింది. పాపం! మా పుణ్యం బాగుండబట్టి, సంబంధం సంగతి జ్ఞాపకం ఉంచుకుని, అచ్చయ్య వగైరాలు లోగడ గిరజాలాయనమీద చేసిన ప్రతిజ్ఞలు ఉపసంహరించుగున్నారేగాని, చెయ్యిచేసుగోలేదు. నేను కొంచెం సకిలించి సంగతి అందుకుని, “ఫరవా లేదండి, మూడుముళ్లూ పడక పూర్వం కన్యాప్రదాత ఒకడూ మాత్రం మీ యింట్లో కతకకూడదు గాని, కడం వాళ్ళకి తప్పులేదు” అన్నాను. ఈ మాట రామయ్యకి మిరపకాయి రాచినట్టుంది. “అల్లాయితే, ఆమూగవాజమ్మకి నాపిల్లని ఇవ్వనేయివ్వను. అంటూ వాడు భాటంగా కోప్పడం మొదలెట్టాడు, అప్పుడే తన ఒక్కడి కూడూ పడిపోతోందని. రంగం చెడేట్టుందని మాకు భయం వేసింది. పంతులు చిరునవ్వునవ్వి “ఇంతా చేసి మా చిన్నవాడు మూగాడని చూస్తున్నారా ఏమిటి? ఇంతేటండీ తమ గ్రహింపూ! వాడు మొదట కాశీ వెళ్లాడు. తరవాత రామేశ్వర యాత్రచేశాడు. చేసి, ఇంటికివస్తూనే మళ్లీ కాశీ వెడతానన్నాడు. వెళ్ళాలిట! కొంచెం కాలూ చెయ్యీ కూడ దీసుగుని వెళ్లవలసిందని వాణ్ణి మేం కోరాం. వాడు కోపించి, మళ్లీ కాశీ చూసేవరకూ నేను మాటేఆణ్ణు” అని భీష్మించి, అది లాగయతు అల్లా మూగాడల్లా నటిస్తున్నాడు. ఆదోసెడు తలంబ్రాలు వాడి నెత్తిని పడగానే కాశీ వెళ్లిచక్కారమ్మంటాను, వచ్చి బృహస్పతిలా మాట్లాడతాడు తీరిపోతుంది. సరా?” అన్నాడు. జానికిరామయ్య ఈ లోపులో ఆలోచించిగుని, " అయ్యా! వంట ఎక్కడ చేశారు?” 'దొడ్లో పొయ్యిమీద' అని పంతులు చెప్పాడు. "అల్లాయితే, దొడ్లో వంట ఇంట్లో తినడానికి

భమిడిపాటి కామేశ్వరరావు రచనలు - 1

133

హాస్యవల్లరి