పుట:హాస్యవల్లరి.pdf/141

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నే - ఆగితే నయమా? అసలు నువ్వు ఇంటికి వెళ్లే దారిలోనే నువ్వులూ బెల్లం కొనుక్కుని వెళ్లడం మరీ నయం ! లేకపోతే, ఇంకా ఆగుతాట్ట, మతి లేక!

రా - అల్లాయితే, ఇచ్చెయ్యమంటారా? ఇది అడివిరా!

జా' - అందుకని ఎవడూ రాడు. నయం కాదూ!

రా - వీళ్లు మంచివాళ్లేనా?

జా - ఓరి వెర్రిముండావాడా! అన్నీ విని మళ్ళీ మొదటికొస్తావేంరా! నీకు నచ్చచెప్పలేక చచ్చిపోతున్నాం! వీళ్ల మంచి ఇంకా నీకు బోధపడలేదుట్రా! మీవియ్యంకుడు కేసి చూస్తేనే తెలిసిపోతుంది ఆయన ఎంత భారీమనిషో! అల్లుడు నిన్ను ఎదిరించడు, అసలు నిన్ను పల్లెత్తేనా ఏమీ అనడు. అతడు ఎంత శాంతశూరుడో నువ్వు ఇందాకా చూడనే చూశావ్, బహుమతీ ఇవ్వనే ఇచ్చావ్!

ఆపళంగా అంట్లుమానేసి చెల్లమ్మగారు, కోరడు దరికి వచ్చి మా మాటలు ఆలకించడం మొదలెట్టింది. ఆ సంగతి జానికిరామయ్యా నేనూ కూడా కీగంట గమనించి పని జరిగేట్టుందని అనుకున్నాం.

రా - ఇంత పిసినిగొట్టు పీనుగు కొంపలో పిల్లని గిరవటెయ్య మంటారురా! చచ్చినా పరాయివాళ్లకి, రెండు ఝాములప్పుడేనా రెండు మెతుకులు విదపని చట్రం?

జా - నిదానించు! అందుకనే, పిల్లని ఇస్తే ఇక్కడే ఇవ్వాలి. ప్రాణంకంటే అధికంగా డబ్బు జాగ్రత్త చేసి నీ వియ్యంకుడు నీ అల్లుడికి ఇస్తాడన్న మాట!

నే - మరోమాట వినొరీ! స్తోత్రం చెయ్యడానికి నే నేమీ బట్రాజుని గాను. అబద్దం ఆడవలసిన కర్మం నాకేమీ లేదు. ఎదరైతేం చాటునైతేం ఏమాట కామాటే చెప్పుగోవాలీ! ఇల్లాంటి వియ్యపరాలు వెయ్యేళ్ళు తల్లకిందులా బొటనవేలు మీద తపస్సు చేస్తే దొరుకుతుందిట్రా, మరో చోట! ఈవిడ కేవలం ఆ అరుంథతి! ఈ మహాలక్ష్మిని చూస్తే అన్నం నీళ్లు కావాలిట్రా వెఱ్ఱివాడా!

జా - ఇహ చెప్పలేమురా! నువ్వూ ఆ పంతులు గారూ గనక వియ్యమందితే, ఆయొక్క శివ కేశవులు వియ్యమందినట్టే! పైన నీ యిష్టం వాళ్లిష్టం. మేం ఎల్లానూ మధ్య వాళ్లమే! కాదుట్రా సీతారామయ్యా?

నే - కాకపోడేం!

అంతటితో చెల్లమ్మగారు పెరటిదార్ని ఇంట్లోకి ఒక్కగంతేసింది, అంటచేతులు కడుక్కోకుండానే.

ఈ సమయంలో అక్కడ జరిగిన సంగతిగురించి అచ్చయ్యావాళ్లూ చెప్పినమీదట మాకు తరవాత తెలిసింది. ఆ పంది ప్రతీగదిలోకి దూరి పంతుల్ని కూడా తిప్పిందిట. ఇల్లాకొంత చెడుగుడు లోపల అయింతరవాత, అచ్చయ్యా వాళ్ళూ కూడా లోపలికి వెళ్ళారట. అప్పటికి పంది పడకటింట్లో కెళ్ళి పందిరిపట్టిమంచంకింద అల్లరి చిల్లరిగా పడేసి ఉన్న సామాను కొద్ది సవరణలతో సంస్కరించి, తన యొక్క అవతారజన్మలో సముద్రంలోంచి భూమిని ఎత్తి దంష్ట్రాగ్ర మందు కాపాడినట్టు, ఇప్పుడుకూడా గదిలో ఏర్పడ్డ బురదలోంచి మంచాన్ని ఎత్తేసి ముట్టెచివర రక్షించి, తద్వారా “పందిరిమంచం” అనేమాట కొంతవరకు సార్లకపరిచి, ఇవతలికి వస్తోందిట. అప్పుడు పంతులుకి కాలుకొచ్చి, అతడు చీపురు కట్ట ఓటి పట్టుకుని, “ఇదంతా వీడిమూలాన్నే, వీడి దుంప తెగ!” అని

భమిడిపాటి కామేశ్వరరావు రచనలు - 1

131

హాస్యవల్లరి