పుట:హరివంశము.pdf/66

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

18

హరివంశము


క.

తార పిదికికొనఁ జాలి కు, బేరుని వత్సముగ విడిచి పిదికిరి యక్షుల్
ధీరమతు లామ[1]పాత్ర ను, దారాంతర్ధానశక్తి తగుదుగ్ధముగన్.

141


తే.

రజతనాభుఁడు దోఁగ్ధగా రాక్షసులు పి, శాచములు నృకపాలభాజనములందుఁ
గనిరి నరరుధిరాఖ్యదుగ్ధము సుమాలి, వత్సమై పెంపొనర్పఁగ వసుధఁ బిదికి.

142


క.

వాసుకి పిదికెడువాఁడుగ, భాసితఫణ[2]పాత్ర గరళబహుదుగ్ధము లు
ల్లాసమునఁ గ్రేపు తక్షకుఁ, డై సమకొనఁ గొనిరి దారుణార్భతభుజగుల్.

143


క.

[3]మేరుగిరి దోగ్ధగా నీ, హారనగముఁ గ్రేపుఁ జేసి యద్రులు పిదికెన్
భూరిశిలాపాత్రికలన్, గోరి మహౌషధులు రత్నకోటులు నుర్విన్.

144


క.

వృక్షములు లతలు గొనియెన్, బ్లక్షము గ్రేపుగఁ బలాశపాత్రికలన్ [4]బాల్
ప్రక్షతిఁ బునఃప్రరోహత, నక్షత సాలంబు దోగ్ధయై తిలకింపన్.

145


వ.

ఇవ్విధంబున సకలచరాచరభూతంబులు నాత్మీయవాంఛితంబులు శాశ్వతంబు
లుగాఁ బడసి పరమానందంబునం బొదలం ద్రైలోక్యకామదోహినియై ధాత్రి
యు విధాత్రియుఁ బావనియు ననుభవ్య[5]నామంబులం బ్రాజ్ఞవర్ణితియై వసుం
ధరాదేవి పృథునిశాసనంబున నిలిచి యతనికిఁ బుత్రియై [6]పృథ్వి యనుపేరం బరఁగి
మధుకైటభమేదోమేదుర యగుటఁ దొల్లియు మేదిని యనుపెరిమెయఁ గనియె.
సంత [7]ననేకసస్యశోభితయు ననేక[8]వసురత్నాకరయు నపరిమితపురగ్రామప్రతి
స్థానగరిష్ఠయు నవిరతప్రాణిసముదయసంకీర్ణయునై యతిశయిల్లె. నీదృశప్రభావ
నిత్యధన్యుం డైన యవ్వైన్యుండు రాజన్యులకు నాద్యుం డనవద్యుం డయి
వెలింగి భువనపూజ్యుం డయి [9]సామ్రాజ్యంబునఁ బ్రాజ్యసుఖం బనుభవించె నని
చెప్పి వైశంపాయనుండు.

146


సీ.

సకలభూతములకు సంభావనీయుఁడు పృథుచక్రవర్తి ప్రస్ఫీతకీర్తి
వేదవేదాంగపవిత్రవర్తను [10]లైనవిప్రులకును నీతివిక్రమములఁ
బరఁగు రాజులకును బశుపాలనాకృషివాణిజ్యరతు లైన వైశ్యులకును
ద్రైవర్ణికార్చనాతత్పరు లగుశూద్రులకు నమస్కార్యుం డలంఘ్యగుణుఁడు


తే.

వృత్తిదాత యాదిమధర్మవృద్ధికరుఁడు, శూరవర్యుండు గావున శూరులకును
మాన్యుఁ డాజికి జనుచోట వైన్యుఁ దలఁచి, భటులు గెలుతు రనాయాసభంగిఁ బగఱ.

147


క.

ఈపృథుచరితము జనులకుఁ, బాపహరము భూరిపుణ్యఫలదము నిత్య
శ్రీపుత్రపౌత్రవర్ధన, మోపి పఠించినను వినిన నొసఁగున్ ముక్తిన్.

148


వైశంపాయనుఁడు జనమేజయునకు మన్వంతరంబుల నెఱిఁగించుట

వ.

అనిన విని జనమేజయుండు మన్వంతరంబుల తెఱం గడిగిన వైశంపాయనుం
డిట్లనియె.

149
  1. పాత్రి
  2. పాతి
  3. మేరువు దోగ్ధయుఁగా
  4. బల్
  5. సంజ్ఞలం బ్రాగ్వర్ణిత యై
  6. పృథ్వియనన్
  7. సస్యశోభిని
  8. సురత్నాలంకృతయు
  9. పూజ్యం బగు సామ్రాజ్యసుఖం
  10. లగు