పుట:హరివంశము.pdf/65

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పూర్వభాగము - ఆ. 1.

17


క.

గోరూప నైననా కిం, పారఁగఁ గ్రేపుల ఘటించి యయ్యైవస్తు
క్షీరములు పిదికికొనుటకుఁ, గోరి పనుపు వివిధభూతకోట్లను వరుసన్.

132


వ.

అ ట్లయిన నెల్లవారికి వలయువాని నెల్ల నోలి నొసంగ నోపుదు. నిది నీకుఁ
బరమోపాయంబు. మఱియొక్కటి గలదు నిమ్నోన్నతభాగంబులవలన సమంబు
గా కున్న నాయాకారంబు చక్క నగునట్లుగా జూడు మనిన నట్లకాక యని
వైన్యుండు కార్మికకోటిం గొని [1]శిలలు ప్రోవు సేసి శిలోచ్చయంబులు గావించి
యెల్లచోట్లు సవరమై యుండ నొనర్చి నగరగ్రామాదులు రచియింపం బనిచెఁ.
దొల్లి నివాసంబులు సస్యంబులు గోరక్ష వాణిజ్యంబు లనునవి లేవు. కేవల వన
సంచరణంబునఁ గందమూలఫలంబులు భరంపడి ఘటియించి యుపయోగింతురు.
పృథుమహీపాలుపాలనంబు మొదలుగా సమస్తవస్తుసిద్ధి గలిగె నని విందు.
మవ్విధంబున ననన్యసామాన్యసమాచరణధుర్యుం డయిన యప్పురుషవర్యుండు.

133


సీ.

[2]స్వాయంభువుం డనఁ జనుమనుప్రవరుని వత్సంబుగాఁ జేసి వఱలు తనకు
హస్తంబు పాత్రమై యతిశయిల్లఁగ మహీధేనువుఁ బిదికి ధాత్రీజనులకు
సకలవర్గములును సర్వయుగంబుల వృధగాక ఫలియించువిధము గాఁగ
నొనరింప లోకు లభ్యుదయసమేతులై వర్తిల్లి రతఁ డెల్లవలనఁ గలుగు


తే.

భువనవాసులఁ బిలిచి మీ రవికలముగ, వలయునవి వేఱువేఱ మీవలను మెఱయ
నిద్ధరాదోగ్ధ్రిఁ గ్రేపుల నెలమిఁ జేసి, [3]పిదికికొనుఁ డని పనిచె [4]సమ్మదము మిగుల.

134


వ.

వారు నతని యత్నంబు గొనియాడి యట్లు సేసి [5]రందు.

135


క.

సోముఁడు వత్సముగా సు, త్రామగురుఁడు [6]దోహకుఁడుగఁ దగ నఖిలచ్ఛం
దోమయపాత్రం బిదికి ర, నామయులగుమునులు బ్రహ్మ మను దుగ్ధంబున్.

136


క.

సురలు గొనిరి కాంచనవి, స్ఫురదజ[7]పాత్రమున బలరిపుని వత్సముగా
మరిగించి సవిత దోగ్ధగ, నరుదగు [8]తేజంబు దుగ్ధమై సిద్ధింపన్.

137


క.

పితృకోటి [9]పిదికె వైవ, స్వతకాలురు గ్రేపుఁ బిదుకువాఁడును గా రా
జతపాత్రంబున దుగ్ధం, [10]బతులాస్పదమై యెలర్ప నవనీసురభిన్.

138


క.

ఆయసపాత్రంబున ఘన, మాయాదుగ్ధంబు గొని రమర్త్యవిరోధుల్
పాయక విరోచనుఁడు గ్రే, పై యొప్పు [11]ద్విమూర్ధుఁ డనుసురారి పిదుకఁగన్.

139


క.

వసురుచి పిదుకఁగఁ బాత్రము, బిసరుహముగఁ జిత్రరథుఁడు పెయ్యగఁ గొని రిం
పెసఁగ[12]న్ గాన క్షీరం, బసమున గంధర్వవరులు నమరాంగనలున్.

140
  1. నేలలు
  2. స్వారోచిషుం డన
  3. పితికి
  4. సమ్మతము
  5. రంత
  6. దోహనుఁడు
  7. పాత్రిక
  8. మార్జంబు
  9. చిదికి, కిడిరి
  10. బతులన్వధ యై
  11. విమూఢయను
  12. సుగంధ