పుట:హరివంశము.pdf/64

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

16

హరివంశము


గొలువం జొచ్చి రట్టిసేవవలన నతనిచిత్తం బెఱింగి మాకు నెల్లనాఁటికి శాశ్వ
తంబులై నడుచు జీవనంబులు గావింపవలయు నని యభ్యర్థించిన నట్ల కాక యని
యొడంబడి.

123


పృథుచక్రవర్తికి భూదేవికి నైన సంవాదప్రకారము

సీ. ఆరాజపుంగవుం డతిరౌద్ర మగుశరాసనమును సందీప్తసాయకములు
గైకొని ప్రజలకుఁ గామితవస్తువు లెల్లకాలంబును నిచ్చుచుండుఁ
గాత యివ్వసుమతి యీతెఱం గొనరింపకున్న వ్రక్కలుగఁ జేయుదు ననంగ
వెఱుచి గోరూపయై పఱచె మేదిని యమ్మహాయోగబలదుర్జయాత్ముఁ డలుక


తే.

వెనుకొనంగ నాయమయును వనజభవుని, నెలవులోనుగజగములన్నియును దూఱి
తూఱి యెచ్చోటు సొచ్చినఁదోనతగులు, వైన్యుఁ గనుఁగొని తనుఁ గాచువారు లేమి.

124


వ.

అతని శరణంబు సొచ్చి వినయవినమితోత్తమాంగ యై యి ట్లనియె.

125


చ.

అధిప ప్రజాభిపోషణము నర్థి నొనర్పఁదలంచితేని మ
ద్వధ మొనరించి [1]నీ వెటుల ధన్యత నొందెడువాఁడ వొప్ప ద
వ్విధము చరాచరాత్మకము [2]విశ్వము నేను ధరింతు నాకు దు
ర్విధి [3]యొలయంగ నింతయును వేచెడి[4]పోవుట నీవ చూడుమా.

126


క.

అన్నంబు నాయధీనం, బన్నము లేకున్న నిలుచునయ్య యొడ ళ్ళీ
సన్నపుఁదలఁ పుడిగి సుసం, పన్న మగునుపాయ మొకటి పాటింపు తగన్.

127


తే.

విను ముపాయపూర్వక మగువిపులయత్న, మరయ [5]సర్వార్థసాధక మఖిలజీవు
లందు వనిత లవధ్య[6]ల యగుట నన్నుఁ, గావు నామాట విని కార్యగతికిఁ జొరుము.

128


క.

[7]అనుడు జననాథుఁ డిట్లనుఁ, దనకై యొరులకయి బహువిధప్రాణులఁ జం
పినఁ గీడగు నొకటిఁ దునిమి, మనుచు [8]టరుదె దేవి జీవమండలిఁ జెపుమా.

129


ఉ.

కావున మత్ప్రయోజనము గై కొని చేయనినిన్నుఁ ద్రుంచి యే
నీవివిధప్రజావితతి నెక్కటి దాల్చి [9]సమగ్రజీవన
శ్రీ వెలయించి నామహిమ సిద్ధముగా నఖిలంబునందు సం
భావన [10]మొందఁజేసెద నభంగుర మిప్పని సాగరాంబరా.

130


వ.

నీవు సర్వార్థసమర్థ మగుట యెఱుంగనే నన్ను నిట్లు గారింపం దలంచి యిమ్మెయికి
మేకొనవు గాక యది యట్లుండా నా[11]కోర్కియు సిద్ధించునట్లు గావించి మదీయ
దుహిత వై యెల్లలోకంబులం బ్రఖ్యాతి గలిగించుకొని బ్రతుకు మిట్లు
చేసెదవేని నిన్ను గుఱిచి కైకొనిన యీరౌద్రసాయకం బుపసంహరించెద ననిన
నద్దేవి యొక్కింత చింతించి యతని నాలోకించి.

131
  1. యే యకట ధన్యత
  2. వేడుక
  3. యెనయంగ
  4. పోవచె నీవు
  5. సకలార్థ
  6. లట్లగుట
  7. అనుడు జననాయకుండను
  8. టురదె
  9. సమస్త
  10. నొంద
  11. కోర్కె