పుట:హరివంశము.pdf/54

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

6

హరివంశము


ఉ.

నన్నయభట్టతిక్కకవినాథులు చూపిన త్రోవ పావనం
బెన్నఁ బరాశరాత్మజమునీంద్రుని వాఙ్మయ మాదిదేవుఁడౌ
వెన్నునివృత్త మీవు కడు వేడుకతో విను నాయకుండ వి
ట్లెన్నియొ సంఘటించె మదభీప్సితసిద్ధికి రాజపుంగవా.

42


క.

కావునఁ జెప్పెదఁ గల్యా, ణావహమహనీయరచన హరివంశము స
ద్భావమున నవధరింపుము, భూవినుతగుణాభిరామ ప్రోలయవేమా.

43


వ.

అని యమ్మహీనాయకుఁ గృతినాయకత్వంబున కభిముఖుంగా నొనర్చి జగద
ర్చితం బగుప్రబంధంబు నిర్మింప నుపక్రమించితి. నవ్విధం బె ట్లనిన.

44


కథాప్రారంభము

సీ.

[1]సౌమ్యంబు జగదేకరమ్యంబు నగునైమిశారణ్యమునఁ బుణ్యయజనశీలు
రైయున్న యాశౌనకాదిసన్మునులు [2]ప్రసిద్ధు వేదవ్యాసశిష్యు ననఘు
రోమహర్షణపుత్రు రుచిరవాగ్విభపు నుగ్రశ్రవసుం డనుకథకవర్యు
నర్థిఁ బూజించి మహాభారతాఖ్యాన మఖిలంబు వరుసతో నతనివలన


తే.

విని [3]మనంబులు సమ్మోదవనధి నోల, లాడుచుండంగ వెండియు నంత తృప్తి
సనక నూతనకౌతుకసంప్రయుక్త, హర్షరభసులై యిట్లని రతనితోడ.

45


శా.

వ్యాసప్రోక్తము భారతాగమము నీ వత్యంతహృద్యోక్తివి
న్యాసం బొప్పఁగ విస్తరింపఁగఁ గడున్ హర్షించె వీనుల్ సము
ల్లాసోద్భాసిని యయ్యె బుద్ధి శ్రుతితుల్యం [4]బద్భుతార్థోదయ
శ్రీసంభావిత మిప్పురాణము ప్రశంసిపంగ నిట్లొప్పునే.

46


ఉ.

ఇమ్మహితేతిహాసమున నెందును నబ్బరతాన్వయప్రసం
గమునఁ బూర్వభూపతులకర్మవిశేషములున్ గుణప్రకా
రములు దేవదైత్యమునిరాక్షసయక్షఖగాదిపుణ్యవృ
త్తమ్ములు ధర్మనిశ్చయ విధమ్ములు పె క్కెఱిఁగించి తింపుగన్.

47


ఉ.

కౌరవపాండవప్రభవగౌరవలీలలు నీవు చెప్పఁ దీ
పారెడుభంగి వింటిమి గుణాకర యింక జగత్త్రయంబునన్
ధీరులు శూరులున్ విభవదీప్తులు నా నుతిగన్నయాయదు
క్ష్మారమణాన్వయోత్తములచందములున్ విన వేడుకయ్యెడున్.

48


వ.

తదీయజన్మచరిత్రప్రపంచంబు సమస్తంబును విస్తరప్రశస్తంబుగా నుపన్యసింప
వలయు ననిన నక్కథకుండు ప్రముదితహృదయుండై వారలం గనుంగొని మీరు
వినంగోరిన యీయర్థంబు జనమేజయజననాయకునకు వైశంపాయనుండు చెప్పి

  1. కామ్యంబు
  2. ప్రసిద్ధుఁడౌ వ్యాసుని
  3. మనంబున సంతోష
  4. బద్భుతాపాదన; బద్భుతాపాదక