పుట:హరివంశము.pdf/52

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

4

హరివంశము


తే.

జేసెఁ జేయుచునున్నాఁడు సేయనున్న, వాఁడు పునరుక్తకృతిశుభావలుల నెల్ల
[1]ననఁగ శ్రీవేమవిభునకు నలరుపేర్మి, వశమె వర్ణింపఁ దద్భాగ్యవైభవంబు.

19


ఉ.

చుట్టు నిజప్రభాపరిధిసోఁకున సర్వదివేలుశైలముల్
గట్టిపసిండి యై తనకుఁ గాంచనభూధ్రము లొప్పఁ బాత్ర మై
[2]చుట్టము లెల్ల నాత్మసమశోభితసంపద నొంద నొప్పెఁ దాఁ
జుట్టపుమేరు వన్వినుతి సొంపున వేమనరేంద్రుఁ డున్నతిన్.

20


చ.

కులజలరాశిచంద్రుఁ డగుకోమటిప్రోలనయు న్నితంబినీ
తిలకము పుణ్యురాలు పతిదేవత యన్నమయుం గృతార్థతా
కలితులు [3]వీరు వేమవిభుఁ గానఁగఁ గాంచిన[4]పుణ్య మెట్టి దే
కొలఁదుల నెన్నిజన్మములఁ గూర్చిరొ నాఁ [5]బొదలెన్ జనస్తుతుల్.

21


సీ.

పంట[6]కులస్వామి ప్రఖ్యాతుఁ డౌర వేమయపితామహుఁ డనుమాన్యతయును
ధూతకలంకుండు దొడ్డయ సైన్యనాయకుఁడు మాతామహుం డనువినుతియు
నాదిరాజన్యతుల్యాచారనిధి మాచవిభుఁడు పూర్వజుఁ డను విశ్రుతియును
శ్రీయుతుల్ [7]పోతయ చిట్టయ నాగయ ప్రభులు మాతులు రను భవ్యతయును


తే.

దనమహత్త్వంబు భూషింపఁ దాను వారి, పేరు వెలయింపఁజాలు గంభీరమహిమ
నాత్మగుణముల నొదవించు నన్వయైక, పావనుఁడు వేమజనపతి గేవలుండె.

22


తే.

తనకు నద్దంకి తగురాజధానిగాఁ బ, రాక్రమంబున బహుభూము లాక్రమించి
యనుజతనుజబాంధవమిత్రజనుల కిచ్చె, నెదురె యెవ్వారు వేమభూమీశ్వరునకు.

23


క.

దైతేయారికి మాఱుట, చేతులక్రియ నొప్పి రెందుఁ జేదోడై వి
ఖ్యాతులు [8]తమ్ములు వేమ, క్ష్మాతలపతి కన్నవిభుఁడు వల్లప్రభుఁడున్.

24


వ.

అయ్యిరువురయందును.

25


ఉ.

అన్న చమూవరుండు సకలార్థసమన్వితుఁ డన్నదానసం
పన్నుఁ డభిన్నబాహుబలభాసి భవాంఘ్రిసరోజపూజనా
సన్నుతితత్పరాత్ముఁ డవసన్నవిరోధి ప్రసన్నభావుఁ డ
భ్యున్నతిశాలి [9]కీలితశుభోదయుఁ డూర్జితుఁ డయ్యె నెయ్యెడన్.

26


వ.

తదనంతర[10]ప్రభుండు.

27


శా.

బాహాదర్పమునం బ్రతీపధరణీపాలావలిం దోలి యు
త్సాహోదగ్రుఁడు మోటుపల్లి గొని సప్తద్వీపపర్వస్తుసం
దోహంబున్ దన కిచ్చు నెచ్చెలి సముద్రుం [11]బ్రీతిఁ బోషించుచున్
మాహాత్మ్యంబు వహించె మల్ల[12]రధినీనాథుండు గాఢోద్ధతిన్.

28
  1. అనిన...నలరె
  2. చుట్టము నెల్ల నాత్మసమశోభితభంగిఁ దనర్పనొప్పెఁ
  3. ధీరు
  4. పుణ్య మెద్ది నే....
  5. బొదలున్
  6. జన
  7. మాతయ
  8. వెలసిరి
  9. శీలిత
  10. ప్రభవుండు
  11. బ్రీతుఁ గావించుచున్
  12. ధరణీ