పుట:హరివంశము.pdf/502

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

454

హరివంశము

క. విను నాభక్తుల కాపద, లును శోకంబులును లేవు లోకంబున నెం
     దును నేను బ్రసన్నుఁడ నయి, యనుపమసర్వార్థదాయి నంచితచరితా.244
ఆ. భక్తరక్ష నాకుఁ బని వార లడిగిన, నెద్ది యైన నిత్తు నింత నిజమ
     సిద్ధదేహుఁడవు ప్రసిద్ధుండవై యొప్పు, మింక జగములందు నేపు మిగిలి.245
వ. అని పలికి యద్దేవుండు దేవతలును మునులును దివంబుననుండి కనుంగొను
     చుండ సపరివారంబుగా నచ్చోట నంతర్ధానంబు నొందె నటఁ గృష్ణుండు.246
క. నారదుఁడు వచ్చి ప్రియ మిం, పారఁగఁ గాంచుటయుఁ బ్రీతుఁ డై మునివర వే
     వే రౌక్మిణేయసుతునకు, గారవమునఁ జేయవలయుఁ గల్యాణంబున్.247
వ. ద్వారకానగరంబున నతనిం గానక పడిన పాటు గ్రమ్మఱం దత్సందర్శనప్రమోద
     శోభనంబు శోభిల్లం జూచినయప్పుడుగదా నామనంబు సమాధానంబు నొందుట
     యనిన నయ్యోగీంద్రుండు కన్యాంతఃపురంబున నతని యునికి యెఱింగించి
     యందులకుం దోడ్కొని చను సమయంబునం జిత్రరేఖ యెదురుగా వచ్చె న
     య్యింతి ముంగలిగా వారలందఱుం దన్మందిరంబు బ్రవేశించి వాహనంబులవలన
     నవతీర్ణు లై రప్పుడు.248
క. గరుడాలోకనమాత్రన, యురగము లనిరుద్ధు విడిచి యుర్వీస్థలికిన్
     సురిఁగి తొలఁగి చని యెప్పటి, శరంబులై యుండె నక్కజం బగు భంగిన్.249
వ. వాసుదేవుండును సమ్మోదసంభ్రమంబునం జని మనుమనిం గౌఁగిలించిన నద్దేవు
     దివ్యాంగస్పర్శనంబున నక్కుమారుదేహంబు నిర్వ్రణంబును విగతపీడనంబును
     బ్రభూతసర్వహర్షోత్సవంబును నై యొప్పె బలదేవప్రద్యుమ్నులు నతని గాఢపరి
     రంభణంబుల సంభావించిరి నారదవైనతేయపూర్వు లైన యమువ్వురకుం గ్రమం
     బున నమస్కరించి యా ఋష్యకేతుండు తదాశీర్వాదంబుల నభివర్ధితుం డయ్యెఁ
     జిత్రరేఖాప్రభృతిసఖీజనంబులపనుపున నుషాసుందరియు నంతంత నమ్మహాభా
     గులకుం బ్రియభక్తిలజ్జారమణీయం బగు సాంజలిప్రణామం బొనరించిన దీవించి
     రిట్లు సముచితాచారంబులు నడిచిన యనంతరంబ.250
క. నారదుఁడు గృష్ణువదనాం, భోరుహమునఁ జూడ్కి నిలిపి పురుషోత్తమ యి
     ద్ధారంభుఁడ వై తింకఁ గు, మారున కొనరింపు ముచితమంగళ మిచటన్.251
వ. శోభనతిథినక్షత్రం బగు కాలంబున నభిమతం బగు లగ్నంబు సమాసన్నం బైనది
     తడయ నేల యను నవసరంబున సర్వవైవాహికద్రవ్యంబులు నలవరించుకొని
     కుంభాండుం డరుగుదెంచి యంతంతఁ గృతాంజలి యై నిలిచి.252
క. శరణాగతరక్షకుఁడవు, కరుణాకరుఁడవు త్రిలోకకల్యాణుఁడ వీ
     శ్వరుఁడవు గావున నిన్నే, శరణము చొచ్చితి ముకుంద సర్వార్తిహరా.253