పుట:హరివంశము.pdf/503

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉత్తరభాగము - ఆ. 8.

455

వ. ప్రసన్నుండ వగు మనిన నారదుండును నయ్యసురోత్తముఁ బ్రసాదయోగ్యుం
     గా నుదాహరింప నభయం బిచ్చి యచ్యుతుండు.254
క. నిను లెస్సవానిఁగాఁ గను, వినినాఁడం గాన బాణువిభవము సర్వం
     బును నీ కిచ్చితిఁ జిరజీ, వనసౌఖ్యము నొందు మసురవర యని నెమ్మిన్.255
వ. అతనిం బిలిచి కుమారునకుం గన్యకకు నభిషేకంబులు నలంకారంబులు నర్హజనం
     బులచేతం జేయించి వివాహవేదిపై నయ్యిరువుర నునిచిన సమయంబున.256
సీ. వరమునిసహితుఁ డై వనజాసనుఁడు వచ్చె నమరసమేతుఁ డై యనిమిషేంద్రు,
     డే తెంచె నప్పరోన్వితు లై గంధర్వు లరుగుదెంచిరి పరిస్ఫురితలీల
     నాటలుఁ బాటలు నలరంగఁ దతవితతాది వాద్యములు హృద్యముగఁ జెలఁగఁ
     గైసేసి శచిలోనుగాఁగల దేవపురంధ్రివర్గములు పేరటము సేయ
తే. దివిజమంత్రి ఋత్విజుఁడయి దివిజవహ్ని, యందువిధియు క్తముగ వేల్చి హర్ష మెసఁగఁ
     గరసరోరుహగ్రహణమంగళము సాంగ, ముగ నొనర్చె దంపతుల కింపులు దలిర్ప.257
వ. అట్లు వివాహంబు సంపన్నంబు గావించి గోవిందుం డయ్యిరువురం దోడ్కొని
     రుద్రుండును రుద్రాణియు నున్నయెడకుం జని మ్రొక్కించిన నయ్యాదిమగృహిణీ
     గృహస్థు లా నూతనమిథునంబు నాదరించి యభినందించిరి శైలనందన యయ్య
     సురరాజనందనకు బ్రద్యుమ్ననందనునకు వాహనంబుగా బాణవాహనం బగు
     బర్హిపుంగవు నిచ్చె నవ్విధంబునకుం బ్రీతుండై పీతాంబరుండు.258
క. భవుని భవానిని వీడ్కొని, [1]దివిజేంద్రుని దివిజగణము దివిజజ్యేష్ఠున్
     సవినయముగ వీడ్కొలుపుచుఁ, బవనాశనదమను నెక్కి పయనం బయ్యెన్.259
తే. అపుడు హరిఁ జేరి కుంభాండుఁ డధిప వరుణు, పాల నున్నవి బాణునిపసులు వాని
     పాలు ద్రావిన సత్త్వసంపన్ను లఖిల, దుర్జయత్వవిభూతి నొందుదురు వినుము.260

శ్రీకృష్ణుఁడు బాణుని గోధనంబుకొఱకు వరుణునితో యుద్ధంబు చేయఁబోవుట

వ. అవి దేవరసొమ్ము గావించుకొనుట లెస్స యనుటయు నవ్విధంబునకుం జిత్తగించి
     యట్ల చేయుద మని యతని నిలిపి మయూరాధిరూఢు లగు కన్యాకుమారుల
     మున్నిడుకొని వెన్నుం డన్నయుం గొడుకును దన్ను నుభయభాగంబులం
     గదియం గదలి గరుడాత్మకం బగు యానం బనూనవేగంబున గొనిపోవ నతి
     దూరం బరిగి.261
క. చరమాంబుధితీరవనాం, తరముల బహువర్ణచిత్రితము లై లీలన్
     జరియించు గోగణంబులఁ, జరితార్థుఁ డనేకలక్షసంఖ్యలఁ గనియెన్. 262
వ. ఇట్లు గాంచి.263
ఆ. పసులఁ బిల్చు నేర్పు పసిపాపనాఁటనుం, డియును దనకు నైజ మయిన తెఱఁగు
     గానఁ బసులఁ బిలువఁగా నుత్సహించి వి, హంగగమనుఁ డడరి యడ్డ మేఁగె.264

  1. దివిజశేష్ఠు దివిజేంద్రు దివిజగణములన్