పుట:హరివంశము.pdf/493

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉత్తరభాగము - ఆ. 8.

445

ఉ. జృంభకబాణమున్ భుజవిజృంభణ మొప్పఁగ నేసె నేసినన్
     శంభుని కావులింతలును జాడ్యము నిద్రయుఁ బొంది శౌర్యసం
     రంభము మాన్చె విల్లును శరంబును జే సడలంగ దేహసం
     స్తంభము గాఢ మయ్యెఁ బ్రమథప్రవరుల్ వెఱఁగంది చూడఁగన్.150

శివుఁడు శ్రీకృష్ణునితో యుద్ధంబు సేయక తొలంగిపోవుట

వ. బాణాసురుం డద్దేవుం గదిసి యొయ్యన ప్రబోధించిన నొక్కింత దెలిసి యప్పర
     మేశ్వరుండు యోగదృష్టి. నాలోకించి యాలోకస్థితికర్తకుం దా నొసంగిన వరం
     బును నతనికిం దొల్లి ద్వారావతీపురంబునఁ బ్రత్యక్షం బై మేలొనర్చి యాడిన
     మాటయుం దలంచి యుత్తరం బెయ్యదియుం బలుకక యేమియుం జేయనేరక
     యూరకుండె న ట్లున్న యాఖండపరశుం గనుంగొని.151
తే. పాంచజన్యఘోషంబునఁ బదిదెసలును, నినిచె గోవిందుఁ డదియెల్లఁ గని సహింప
     కడరి ప్రమథవీరావలి యచ్యుతాత్మ, జనుఁ బొదవె ననేకాస్త్రశస్త్రతతుల.152
వ. దానవులును బ్రవృద్ధం బగు మాయాయుద్ధంబున నతనిం జిక్కుపఱుపం దొడం
     గినం గినుక నమ్మకరకేతనుండు సేనాస్తంభన యగు సమ్మోహనవిద్య నయ్యందఱం
     గొంతవడి నిద్రాసక్తులం గావించి యసురులం బెక్కండ్ర నొక్కట విగతాసులం
     జేసె నంత.153
క. అందంద యావులింపఁగ, నిందుధరునివదనమున ననేకాగ్నిశిఖా
     సందోహంబులు వెలువడి, కందుగ దశదిశలుఁ బొదివి కాల్పఁగఁ దొడఁగెన్.154
వ. అట్టి దారుణత్వంబునకు నఖిలభూతంబులు భీతిభ్రాంతంబు లయ్యె భూదేవి తల్ల
     డిల్లి పితామహుపాలికింబోయి దేవా మహాదేవవాసుదేవసంగరభరం బోర్వ
     లేక దిగంబడియెడికొలఁదికి వచ్చితి నకాలప్రళయంబునం జరాచరంబులుం బొలియు
     నేకార్ణవంబును నయ్యెడు నింతియ యింతకు మిక్కిలి విన్నవింప నేర నఖిల
     విధాతవు నీవ యెఱుంగు దనినం జతురాననుండు.155
తే. ఒకముహూర్తంబు సైరింపు మువిద నీకుఁ, జులుకనగునట్లు సేసెదఁ దలఁకుమాను
     మనుచుఁ గ్రమ్మనఁ జనుదెంచి యభవుఁ గాంచి, యొక్కభక్తిభావంబున మ్రోల నిలిచి.156
వ. ఇ ట్లని విన్నపంబు సేసె.157
చ. అసురు లవశ్యవధ్యు లని యాదిన కాదె మహేశ! యేను ద
     ద్వ్యసనము నిర్ణయించితి భవత్కృప యేటికి నిట్టు వీరిపై
     నెసఁగెడుఁ గృష్ణుతోడఁ దగునే పెనఁగంగ నొకింత బుద్ధిలోఁ
     బసరిడిచూడుమా హరియు భర్గుఁడు నా నొక్కడో విభిన్నులో?158
క. నీవ నిను నెఱుఁగకుండిన, నేవారికిఁ దెలుపవచ్చు నిటు సకలక్షో
     భావహ మగునీయుగ్రపు, భావమునకుఁ జాల వ్రేఁగుపడినవి జగముల్.159