పుట:హరివంశము.pdf/494

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

446

హరివంశము

వ. ప్రసన్నుండ వగు మనినఁ బరమేశ్వరుం డాపితామహుం జూచి నీ చెప్పినట్ల
     సేసెదఁ గయ్యంబు మానితి ననియె నప్పుడు గృష్ణుండును గదియ నేతేర నా
     హరియు హరుండు నొండొరులం గౌఁగిలించుకొని పరస్పరోపలాలనపరు లై రనంత
     రంబ పురాంతకుం డచ్చోటు వాసి యొండెడకుం జనియెఁ జతుర్ముఖుండును
     మార్కండేయాదిమునిప్రణీతంబు లగు శంకరనారాయణైక్యంబు లగు వాక్యం
     బులు [1]వాగ్ము లగుసిద్ధులు ప్రశంసింప వినుచు నిజలోకంబున కరిగె నంత.160

కుమారస్వామి శ్రీకృష్ణ బలరామప్రద్యుమ్నులతో యుద్ధంబు చేయుట

క. హరుఁ డరుగుఁగాక యసురే, శ్వరరక్షణ మింకఁ దొలఁగవచ్చునె నాకున్
     హరి నొడుతుఁబొడుతు మగఁటిమి, యరుదుగ నని కార్తికేయుఁ డనికిం దొడఁగెన్.161
వ. ఇట్లు కుంభాండసంప్రహితం బగు రథంబుతో నడరి యతండు.162
ఉ. దానవకోటి యుబ్బ వినతాసుతుమేనును గృష్ణుమేను ద
     త్సూనునిమేను ముష్టికనిషూదనుమేనును వాలురంపపెన్
     సోనల ముంచి సాంద్రతరశోణితధారలు ధాత్రి నించినం
     దా నొకచేఁతకున్ సమవధానము లేక మురారి ధీరతన్.163
వ. ఒక్కింత సైరించి శార్ఙ్గనిర్ముక్తశరంబు లాశరజన్ముపై నిగుడింప రౌహిణేయ
     రౌక్మిణీయులును సాయకసహస్రంబులం బరగించి రమ్మువ్వురు మూఁడగ్నుల తెఱం
     గున మహాతేజంబు సూపి మహాసేనుతేజంబు [2]మట్టుపడం బేర్చినం గోపించి
     కుమారుండు.164
చ. జగముల నేర్చునాఁటిరవిచాడ్పున దుస్సహచండదీప్తమై
     నెగడి సమస్తశాత్రవవినిర్మథనోత్సవసాధనంబునం
     బ్రగుణవిభూతిఁ బెం పెసఁగుబ్రహ్మశిరం బనుసాయకంబు న
     న్నగధరుమీఁద నేయ గగనంబున నిండె సురార్తనాదముల్.165
మ. హరి యాలోన సమాహితాత్ముఁ డయి సర్వాస్త్రావమర్దక్రియా
     పరుపోపక్రమ మైన చక్రము నతిస్పర్ధం బ్రయోగింపఁ ద
     త్పరితాపంబున షణ్ముఖాంబకము విధ్వస్తప్రభాజాల మై
     పరమక్లీబత నొందె మేఘపటలప్రచ్ఛన్నసూర్యాకృతిన్.166
తే. బ్రహ్మశిర మివ్విధంబునఁ బ్రతిహతప్ర, భావ మగుటయు నగ్నిసంభవుఁడు మఱియుఁ
     దనకుఁ బ్రియసాధనంబయి తనరుశక్తి, వైచెఁ దడయక హరిఁగూల్చువాంఛఁ బేర్చి.167
మ. చలదుల్కావళిమాడ్కి సంక్షయశిఖజ్వాలాకరాళాకృతిన్
     గలఘంటాతతి మ్రోయ దిగ్గగనభాగం బెల్ల నొక్కింతయై
     వెలుఁగన్ వచ్చుతదస్త్రమున్ సురలు సంవీక్షించి విభ్రాంతిమై
     జలజాతాక్షుదెస న్నిరాశు లయి చేష్టల్ దక్కి రత్యంతమున్.168

  1. వాఙ్మయు లగు
  2. పట్టుపడం