పుట:హరివంశము.pdf/473

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉత్తరభాగము - ఆ. 7.

425

క. శరముద్గరకుంత[1]గదా, పరిఘపరసుతోమరములు పై పై నొదువన్
     బరపి తిరోహితుఁ జేసెను, విరోధి మడిసె నని విబుధవిద్విషు లార్వన్.242
వ. ఇవ్విధంబున ననిరుద్ధు నిరోధించి యయ్యంతరంబున నతండు దివ్యశక్తి యొక్కటి
     యతని పయిం బ్రయోగించిన.243
క. ఎనిమదిఘంటలు మ్రోయఁగ, నినదీప్తులు మాయ నుల్క కెనయగుసరణిన్
     జనుదెంచుచున్నతత్సా, ధన మానృపసుతుఁడు సూచి తలఁకనిబుద్ధిన్.244
చ. వెరవునఁ బట్టి క్రమ్మఱఁగ విద్విషుమీఁదన బిట్టువైవఁ బే
     రురముఁ బగిల్చి వీపున మహోద్ధతి వెల్వడి యుర్వి సొచ్చెఁ జె
     చ్చెర నది దైత్యభర్త గతచేతనుఁడై ధ్వజయష్టి యూఁతగా
     నిరవఱి మ్రొగ్గఁ జూచి దొర లెల్లఁ గలంగిరి నెమ్మనంబులన్.245
వ. కుంభాండుం డొయ్య నతనిం దేర్చి యి ట్లనియె.246
మ. పగవాఁ డల్పుఁడు గాఁడు సంగరవిధిం బల్పోకలం బోయినాఁ
     డు గణింపం డెదిరిం దృణంబునకు నాటోపంబు దీపింప నీ
     జగ మెల్లం బయిఁబడ్డ నోర్చుఁ గడునిశ్శంకాకృతిం జూచితే
     తెగువం గ్రాలెడు వీనిశౌర్యము బలోద్రేకంబు నక్షోభ్యముల్.247
శా. చేయం బోలినవెల్లఁ జేసితిమి దోశ్శిక్షావిశేషోద్ధతుల్
     మాయం డేగతి నందు వీని బలిమిన్ మాయింపరా దేటికిన్
     వేయు న్నన్నును నిన్నుఁ గాచుకొను ముద్వేగం బపేక్షించినం
     జేయున్ లోక మితండు వీతదనుజశ్రీకంబుగా వ్రేల్మిడిన్.248
క. అని ప్రెగ్గడ దెలిపిన న, ద్దనుజేంద్రుడు దెలిసి యపుడు దర్పితు నిమ్మూ
     ఢునిఁ బాముఁ బొదువుగరుడం,డనఁ బొదువుదుఁ జూడుఁ డనుచు నాక్షణమ తగన్.249
వ. గంధర్వనగరంబుచాడ్పునఁ జూడం జూడ నదృశ్యదేహుం డై.250
క. తనుఁ గానక నలుదెసలన్, గనుఁగొను ప్రద్యుమ్నతనయుఁ గౌక్షేయకఖే
     లనదీప్తుదీప్తమధ్యం, దినరవిసమతేజు నుగ్రతేజుఁడు కినుకన్.251

బాణాసురుఁడు అనిరుద్ధుని నాగపాశబద్ధునిఁ చేసి పడద్రోయుట

వ. కృష్ణోరగముఖంబు లగు శిలీముఖంబుల ముఖప్రముఖాఖిలాంగంబుల నావేష్టితుం
     జేసి త్రోచినం గదలనేరక యతండు మేఘవలయపరివృతం బగు మైనాకపర్వతంబు
     పగిది నుండెఁ దాదృశం బగు తదీయదశాంతరంబు దశకంఠసుతవిశిఖవివశుం
     డగు దశరథనందనుచందంబు దలఁపించె నిట్లు నిమేషమాత్రంబున ననిమిషేంద్ర
     సమాను నమ్మానధను నవమానించి దానవేశ్వరుం డమాత్యునిం జూచి. 252
క. కుంభాండ దుష్టయౌవన, జృంభితుఁ డగు దాయ మనకుఁ జిక్కెఁ దన దురా
     రంభమునకుఁ దగ నిపు డసి, శుంభుతుఁ డగుఁగాక వీఁడు సొలయక యింకన్.253

  1. కులిశ