పుట:హరివంశము.pdf/472

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

424

హరివంశము

మ. అనిలోఁ జంపక కాచి పోవిడిచినం బ్రాణంబులం బట్టి యా
     కనకక్ష్మాధర మెన్నఁడుం దిగుటకై గంపింతు రింద్రాదు ల
     య్యని నాచేతులఘాత కల్పు సరిసేయంజాల కిట్లున్న నె
     ట్లును బోదయ్యెఁ గడంకమై వలసె నాటోపం బెదం గైకొనన్.234

బాణాసురుఁడు సర్వసైన్యసమేతుం డై యనిరుద్ధుమీఁద యుద్ధంబునకు వచ్చుట

వ. లెండు రథంబు దెండని పరిజనంబులం బనిచి సమస్తసమరసమాయోగంబును
     యోజించి.235
సీ. వెలయంగ నాలుగువేల కిష్కువులవిస్తారంబు గల్గి యుదార మైన
     గడితంపుటెలుఁగుతో ల్గప్పిననొప్పారు బలుదేరు వేయుమావులు వహింప
     నెక్కి బర్హిధ్వజం బెత్తించి రక్తపతాక గ్రాలఁగఁ దనుత్రంబు దాల్చి
     గదలు గార్ముకములు ఖడ్గముల్ శక్తులు మొదలైన యాయుధంబులు గ్రమమున
తే. వెలుఁగ వేయుచేతులతోడ వేయు గిరణ, ములఁ దలిర్చువిభాకరుపోల్కి యమర
     నమరుకుంభాండసారథి యై కడంగె, సుచిరకాంక్షితసంగరోత్సుకత వెలయ.236
వ. సర్వసైన్యనాయకులును నిజస్వామిపూనిక కనురూపంబుగా నాటోపంబు దెచ్చు
     కొని యతనిముందటఁ గెలంకులను బింకంబులు మొలవ నడచి రిట్లు నడచి బలి
     సూనుం డయ్యదుసూను దవ్వులం గనియె నతండును బగతుబాహుసహస్రం
     బును బాణసంధానసామగ్రియు నగ్రేసరుల యుగ్రతయుఁ జీరికిం గొనక యడి
     దంబు జళిపించి యొడ్డనంబు దాటించి యడ్డంబు నిడుపును దాఁటుచు నెదురు
     నడిచె నవ్వీరుం గాంచి కలుషించి.237
చ. నరుఁడు విహీనసాధనుఁడు నా కెదురై లలిఁ ద్రుళ్లియాడఁ జె
     ల్లరె యిటు సూడఁగాఁ దగునె లాఘవ మేర్పడఁ బట్టుఁ డుక్కునం
     బొరిగొనుఁ డంచు యోధగణము న్బురికొల్పుచుఁ దాఁకి యేసె ని
     బ్బరముగఁ బెక్కుబాణముల బాణుఁ డుషాసతి ప్రాణవల్లభున్.238
క. చంపుదు నని మఱియును సై , రింపక తోమరగదాపరిఘశూలాదుల్
     గంపితభువనుం డగుచు ని, లింపరిపుఁడు పఱపె నబ్బలియుపై నాజిన్.239
శా. వానిం గైకొన కుగ్రచర్మచలనవ్యాఘాతము ల్సేయుచున్
     నానాసైన్యము లడ్డమై తొడర నున్మత్తాకృతిం గూల్చుచు
     న్మానోదగ్రుఁ డవార్యనిర్భరగతి న్ఖడ్గైకసాహాయ్యుఁ డై
     తా నద్దానవనాథుతేరు గదిసెం దద్బాంధవు ల్బెల్కుఱన్.240
తే. కదిసి రథ్యముల్ వేయింటిఁ గడమవడక
     యుండఁ జించి పెన్నెత్తుట నుర్వి నుంచి
     యుగ్రుఁ డై తనమీఁదను నుఱుకఁ దలఁచు
     నతనిఁ గనుఁగొని సైఁప కయ్యసురవిభుఁడు.241