పుట:హరివంశము.pdf/463

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉత్తరభాగము - ఆ. 7.

415

     నిందఱం గలయం గనుంగొను మనిన నయ్యంగన యంతరంగం బలరఁ గ్రమం
     బున నాలోకించి.142
సీ. దేవతలను బూర్వదేవతలను జూచి దేవయోనుల నెల్లఁ దెలియఁ జూచి
     విహగేశ్వరులఁ జూచి యహినాయకులఁ జూచి మనుజసంఘముఁ జూచి మనుజపతులు
     జూచి యాదవకోటిఁ జూచుచో నప్పుడు హరిఁ జూచి పోలిక తెరువు గాంచి
     ప్రద్యుమ్నుఁ జూచి సంభ్రాంతయై యల్లన యనిరుద్ధుఁ జూచి యత్యాదరమున
తే. విగతసంశయ మగుమాడ్కి వేఱొకటికిఁ, బోక యాకూతకౌతుకాద్భుతవిలోక
     తారకం బయి నిలుకడదగులఁ దగిలి, మనసు దోడ్తోడ మన్మధోన్మాద మొంద.143
తే. బిగియఁ జనుదోయి యొత్తినపేరురంబు, నలరుమోవితీ పానినయాననంబుఁ
     దనియఁ గురులు దెమల్చియాడినకరంబుఁ, దరుణి మెచ్చుచు నెమ్మోముఁదమ్మి యలర.144
క. నను మఱపి యెందువోయితి, గనుఁగొంటిమ పట్టువడితి కైతవ మిటుసే
     సినఁ బోనిత్తుమె యనుచును, దనమదిఁ బలుకుగతిఁ గొంతతడ వీక్షించెన్.145
వ. చిత్రరేఖయుఁ దదీయభావం బుపలక్షించి.146
మ.అనిరుద్ధాకృతిమీఁదఁ జిక్కువడి యయ్యబ్జాక్షిచూ పంగముల్
     ఘనరోమాంచమునం దలిర్చెఁ బ్రియు నిక్కం బిట్లు గన్నట్లు గై
     కొని పూర్వానుభవంబు తియ్య [1]మగుకోర్కుల్ చిత్రరూపంబుపై
     మునుఁగం బాఱుట దెల్పెడున్ వివశతాముగ్ధంబులై భావముల్.147
వ. కావున నిమ్మత్తకాశిని నున్మత్తదశ వొందకుండం దేర్చి తడయక దీని మనోరథంబు
     దీర్చెద నని తలంచి యల్ల నగుచు ని ట్లనియె.148
సీ. కన్యాపురంబునఁ గనకసౌధంబుపై నిద్ర నేమఱి యున్న నిన్నుఁ గదిసి
     తన చెయ్దములు సూపి మనము మ్రుచ్చిలి కొని యరిగిన మ్రుచ్చు నబ్జాయతాక్షి
     నీనేర్పు సులువుగా నెఱిఁగితి నేర్పడఁ బోయెద నెచ్చట నేయనువున
     నున్నను బలిమియు నోపికయును నీవు మెచ్చఁగఁ దెచ్చెదఁ దెచ్చి నీకుఁ
తే. జేయలంతిగా నిచ్చెదఁ జెలఁగి నీవు, నీకటాక్షపాతంబున నెఱయఁగంటి
     భోగలలితశృంగార మైపొసఁగుగృహమునందుఁ ద్రోచి నీవలచినయట్లు సేయు.149
వ. అన విని ససంభ్రమంబుగా నయ్యబల చిత్రరేఖం జూచి చిత్రరూపం బంగుళిపల్ల
     వంబున నిరూపించుచు.150
క. నీకౌశల మే మని చెలి, యా కొనియాడుదు మదీయమగుమదికిం జి
     త్రాకృతి మును గలఁ గలసిన, యాకారం బెంత సేసె నంతియ చేసెన్.151
క. ఏపుణ్యవంశమునవాఁ, డేపురుషశ్రేష్ఠుఁ డాతఁ డేగుణముల ను
     ద్దీపితుఁ డతఁ డెయ్యెదిపే, రేపగిడిం జెల్లెఁ జెపుమ యింతయుఁ దెలియన్.152
వ. అనిన విని చిత్రరేఖ యసురరాజపుత్రి కి ట్లనియె.153

  1. మునఁ గోర్కుల్