పుట:హరివంశము.pdf/362

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

314

హరివంశము

క. విలు విఱిగినఁ గాలుఁడు గ, ట్టలుకం దనతీవ్రదండ మతిరయమునఁ జె
     న్నలవడఁ గైకొని కవిసెం, బెలుచ నహితుమీఁద నఖిలభీషణరేఖన్.26
చ. దనుజుఁడుఁ జేతివి ల్విడిచి తా నొకఖడ్గము దాల్చి ప్రేతనా
     థున కెదురై కడంగుటయు దుర్గమదండకృపాణు లైన య
     య్యినసుత దైత్యపుంగవుల కిద్దఱకున్ సమరంబు ఘోరమై
     తనరెఁ గుతూహలైకభరితస్థితి నయ్యిరువాగుఁ జూడఁగన్.27
క. [1]కొండొకసేపునకుఁ గదిసి, దండధరుఁడు దనప్రచండదండమున శిరం
     బొండొండ వ్రేయుటయు ను, ద్దండతఁ జీరికిని గొనక దర్పోద్ధతుఁ డై.28
తే. అసురవరుఁడు నిస్త్రింశంబు నాయితముగఁ, బట్టి తత్కాంతికాళిమఁ బరఁగి దెసల
     నంధతమసంబుఁ బుట్టింప నర్కతనయు, తనువు వ్రేసె నందంద నెంతయును గినుక.29
చ. అడిదపు వ్రేటులం బఱియ లైన శరీరమునందు నెత్తురుల్
     సొడసొడ గ్రమ్మ నెమ్మనము సొమ్మలు పైకొన నూర్పు లొక్కమై
     నిడుదలు గాఁగ బ్రాణములు నిల్వక తల్లడిలంగ సంగరం
     బుడిగి కృతాంతుఁ డేఁగెఁ దనయూరికి సేన కలంగి పాఱఁగన్.30
వ. కైలాసనాథసఖుం డమ్మురాసురుం దొడరి పెనంగునెడ మాణిభద్రప్రముఖు లగు
     యక్షరాక్షసు లనేకు లతనికిం దలకడచి దానవుం దాఁక వివిధాయుధంబుల నా
     యోధనం బధికదారుణంబుగా నొనర్చిన నలిగి యతండు.31
మ. ప్రణుతం బై నిజచాపకౌశలము దీపస్ఫూర్తి శోభిల్లఁగా
     గుణనిర్ఘోషము సర్వపర్వతగుహాక్రోడంబుఁ బీడింప భీ
     షణబాణోఘముల విరోధిరథినీసంఘంబుపై నొక్కమై
     గణనాతీతముగా నిగుడ్చె జగము ల్గంపింప దోస్సంపదన్.32
క. ఆయంపపదువు పొదివినఁ, జేయార్పఁగ లేక ధనదసేనాగ్ర[2]సరుల్
     పాయఁబడి విభుని విడిచి ప, లాయనపరు లైరి మనసులందుఁ దలఁకుచున్.33
తే. దొరలు విచ్చిన నొంటి యై తిరుగనేర, కున్న కిన్నరనాథు నయ్యుగ్రదైత్యుఁ
     డేసిఁ జేతులతీటవో నేపు మిగుల, దారుణంబుగఁ గ్రొవ్వాఁడి నారసముల.34
చ. ఉరమున మూఁపున న్నుదుట నొక్కట కన్నులఁ జెక్కులం బరం
     పరలయి తత్ప్రయుక్తపటుబాణచయంబులు బెట్టు నాఁటినం
     దిరిగి కలంగి యెంతయును దీనత నర్థవిభుండు వోయె ము
     న్నరిగిన యాత్మభృత్యనివహంబులజాడన రాజతాద్రికిన్.35
వ. ఇవ్విధంబున మువ్వురు లోకపాలకులు నుక్కుదక్కిన దేవసైనికులు దేవేంద్రు
     దెస నిరాశు లై రా శతమన్యుండు విద్రుతసైన్యుం డయ్యును దైన్యంబు

  1. కొండుక
  2. చరుల్