పుట:హరివంశము.pdf/361

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉత్తరభాగము - ఆ. 4.

313

     వెలువడు కయ్య మి మ్మని సవేగ సముద్ధత సింహనాద సం
     కలితము గాఁగఁ బిల్చుటయు గ్రక్కున వెల్వడియెన్ మహేంద్రుఁడున్.17
వ. అట్టియెడ.18
శా. అంభోదద్విరదంబుపైఁ బ్రబలవజ్రాభీలహస్తంబుతో
     గంభీరోన్నతరూపభీమపటురేఖం గ్రాలువీరాగ్రణిన్
     జంభారిం గని చీరికింగొనక యస్త్రవ్రాతపాతోగ్రసం
     రంభుం డై దనుజుండు దాఁకెఁ గడకం ద్రైలోక్యమున్ ఘూర్ణిలన్.19
క. ధరణీతనూజుఁ డేయఁగఁ, బురవరుఁడు గులిశనిహతి బోరన నమ్ముల్
     పరిహృతములు సేయఁగ న, య్యిరువుర వెరవులు సమగ్రహేలం బయ్యెన్.20
క. యమవరుణకిన్నరేశులుఁ, దమతమసైన్యములతోడఁ దద్దయు వెసఁ ద
     త్సమయమునఁ గూడుకొని ర, య్యమరాధిపు నఖిలసురసమాజసమేతున్.21
వ. హయగ్రీవ[1]నిశుంభమురాభిధాను లగు దానవనాయకులు మువ్వురు నరకునకుం
     బాసట యై వాసవసహాయు లగు నమ్మువ్వురు లోకపాలురం దలపడి రట్టి కోల్తలం
     బేర్చి సర్వాదిత్యులు నశేషదైత్యులం దాఁకినఁ గయ్యంబు కడింది యై చెల్లె
     నందు రెండు దెఱంగులవారు నొండొరువులఁ దూపుల నరికియుఁ జాపంబులు
     ద్రుంచియుఁ దూణంబులు వ్రచ్చియుఁ గృపాణంబులు నుఱుమాడియుఁ గంకటం
     బులు సించియు నెఱుఁకులు నొంచియు వాహనంబులు వికలంబులు సేసియు
     దేహంబులు తూలించియు నాభీలవిక్రమంబున విజృంభింప నమ్మహాసమ్మర్దంబున.22

హయగ్రీవ నిశుంభ మురాసురులతోఁ బోరి వరుణ యమ కుబేరులు పాఱిపోవుట

సీ. అంబుధీశ్వరుఁడు హయగ్రీవు నుగ్రబాణపరంపరాహననమున నొంప
     నాతఁ డాతని ననేకాంబకంబులఁ జరపీడితుఁ గావించి బెట్టిదంపు
     భల్ల మొక్కట వెస విల్లు ద్రుంచుటయును వరుణుఁడు ఘోరదుర్వారభుజగ
     పాశంబు లమరారిపైఁ బ్రయోగించిన నవి ప్రచండాకృతిఁ గవియుదేర
తే. నసుర యంతంతఁ బట్టి యత్యద్భుతముగ, మగుడ వైచి యంతన సమున్మాదలీలఁ
     బృథుగదాదండమున శిరోభిద యొనర్పఁ, దూలి నెత్తురు గ్రక్కుచు నేల కొఱగె.23
వ. పశ్చిమదిశాధీశుండు నిశ్చేతనుం డైన యట్లుండి యాలోనన గ్రక్కున నంకిలిదేఱి
     మీఱినభయంబునఁ గయ్యంబున నిలువ లేక యెక్కడయేనియు గాడుపడిపోయె
     దైతేయుం డెగువం దదీయసైన్యంబు దైన్యంబునఁ జెల్లాచెద రై పఱచె నప్పుడు.24
తే. పంచవింశతిశరముల నొంచె నంత, కుని [2]నిశుంభుఁడు జముఁ డుగ్రధనువు దాల్చి
     యేసె నొకవాలుఁదూఁపున నింద్రవైరి, నతఁడు వెసం ద్రుంచె నతని శరాసనంబు25

  1. సుందానుసుంద
  2. సునందుండు