పుట:హరివంశము.pdf/363

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉత్తరభాగము - ఆ. 4.

315

     నొందక మందరప్రమాణం బగు నైరావణంబు నయ్యరాతిబలంబుపైఁ గొలిపి కలహ
     కలనాక్షమంబును నక్షయతూణీరంబును నగు బాణాసనంబు కొని మౌర్వీవిరావ
     విజృంభణంబు దంభోళధ్వనితంబుపోలికం ద్రైలోక్యాకంపనం బొనరింప నకం
     పితరభసంబునం బగఱమొనలమీఁదఁ గడంగినం గని నరకాసురుండు.36
మ. ఇటర మ్మే నిదె యున్నవాఁడ నని గంధేభంబు గంధేభముం
     బటురోషంబునఁ దాఁకుభంగి భుజదర్పం బేర్పడం దాఁకి ది
     క్తటముల్ వ్రయ్యఁగ నార్చి కార్ముకగుణాఘాతధ్వనుల్ [1]సర్వసం
     కటదుర్వ్యాప్తిఁ జెలంగి శాతశరముల్ గ్రందంగ మై గ్రుచ్చినన్.37
సీ. అఖిలగాత్రములు రక్తాక్తంబు లై నొవ్వు దనికినఁ గినిసి శతక్రతుండు
     విశిఖాష్టకంబున విద్వేషి నొంచి డెబ్బదిబాణముల రథబంధనంబు
     నెడలించి కేతువు నేకాస్త్రమునఁ ద్రుంచి సారథిఁ దొమ్మిదిసాయకముల
     సమయించి హయములఁ జతురంబకంబులఁ గూల్చి విల్లొక్కటఁ గూల నఱికె
తే. విరథుఁడు హతాయుధుండు నై సురవిరోధి, యుగ్రఖడ్గంబు గొని వీఁక నుఱికియుఱక
     వ్రేసె నైరావతముల వెస బలారి, యురము నుద్దామహతి వ్రచ్చియుబ్బి యార్చె.38
మ. కరవాలక్షతి స్రుక్కి యేనుఁ గొఱలంగాఁ దాను గ్రొవ్వేది ని
     ర్భరవక్షస్సృతరక్తసిక్తుఁ డగుచుం బై పైని నిశ్వాసముల్
     పరఁగ న్మూర్ఛలు పైకొనంగ దివిషత్పాలుండు వే తూలి సం
     గరరంగంబు దొలంగిపోయె రిపుసంఘం బార్వ నెందేనియున్.39

నరకుఁడు దేవలోకం బాక్రమించి యదితికుండలంబు లపహరించి యచ్చరలఁ జెఱగొనుట

క. అమరేంద్రుఁ దోలి భూసుతుఁ, డమరావతి సొచ్చి యరిది యగు తన విజయం
     బమరభవనంబు లన్నిటఁ, గ్రమమునఁ జాటింపఁ బనిచెఁ గడుమోదమునన్.40
వ. వాసవసింహాసనం బెక్కి యూర్వశి రావించి భావం [2]బనురాగతరళంబుగా
     నత్తరళనయనతోడ.41
మ. వరుణుం దోలితి నర్థపుం జదిపితిన్ వైవస్వతున్ గెల్చితిన్
     హరిఁ బోఁ జోఁపితి నేన యీశ్వరుఁడ సర్వామర్త్యసిద్ధోరగా
     సురగంధర్వవియచ్చరాదులకు మెచ్చు ల్మీఱ నీ వింక న
     న్నరవిందానన సత్కరింపుము [3]మనోజానీకసంక్రీడలన్.42
చ. అనుటయు నమ్మృగాక్షి యిది యట్టిగ యంతటివాఁడ వైన నీ
     పెను [4]పసదే తలంప రిపుభేదన సంయమికోటి భక్తితో
     నిను నఖిలాధ్వరంబులను నిత్యసమర్చితుఁ [5]జేసిరేని నే
     నును ముద మొప్పఁ గైకొని వినూత్నవిహారరసాబ్ధిఁ దేల్చెదన్.43

  1. పర్వ
  2. బున సంతసంబునొంది యనురాగతరళంబుగా
  3. మనోజ్ఞానేక
  4. పెనుపరుదే
  5. జేసెనేని