పుట:హరివంశము.pdf/262

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

214

హరివంశము

     కొన్ని చించి నలుదెసలం బాఱవైచి యన్నీచు కొంపయుఁ జిచ్చువైచి నీఱు చేసి
     యట కడచి మాలకరివాడ సొచ్చి యందు.20
క. గుణకుఁ డనుమాల్యకారుని, గుణవంతుని నెదురఁ గాంచి గోవిందుఁ డతి
     ప్రణయమున నడిగె సమ్య, గ్గుణబంధము లయిన సురభికుసుమచయంబుల్.21
వ. వాఁడును వినయసంభ్రమప్రమోదంబులు ముప్పిరిగొన నిప్పురుషులు ధరణికిం
     గ్రీడార్థం బరుగుదెంచిన సిద్ధులొండె యక్షులొండెం గావలయు నక్షతప్రభావు
     లన్యు లెవ్వ రనుచు నెదుర్కొని మ్రొక్కి యక్కజంబు లగు ప్రసూనదామం
     బులు సమర్పించి దేవరసొమ్ము దేవర కిచ్చుట యేమి చోద్యంబు లని వినయంబులు
     పలికినం గైకొని యప్పువ్వు లన్నకు వలయునన్ని యొసంగి వనజనయనుండు
     దానును.22
క. కొప్పునఁ దురిమియు నెంతయు, నొప్పుమిగుల నఱుత వైచియును బాహువులన్
     ముప్పిరిగొనంగఁ జుట్టియు, నప్పు డపూర్వంపులీల యలవడఁ దాల్చెన్.23
వ. ఇట్లు మాలాకారుని మాల్యంబులు మాంగల్యంబులుగా ననుగ్రహించి వానికి
     మెచ్చి యవ్విభుండు.24
మ. [1]నిను మత్సంశ్రయ యైనలక్ష్మి కరుణ న్వీక్షించి యుష్మదృహం
     బు ననంతోజ్జ్వలహేమరత్నతతి నాపూర్ణంబుఁ గావించు నీ
     తనయు ల్మన్మలు లోనుగా వరుస సంతానం బవిచ్ఛిన్నమై
     ధనవంతం బగు మత్ప్రసాదమునఁ దథ్యం బింత పుణ్యాత్మకా.25
వ. మదీయపూజావిధాయి వగుటం జేసి యక్షయం బగు మోక్షంబును భవదధీనం
     బయ్యెడు ననియె నప్పుష్పలావుండును దేవుం డిచ్చిన వరంబు మహాప్రసాదం బని
     వినయావనతశాలి యగు మౌళిం బరిగ్రహించె నవ్వసుదేవసూను లిద్దఱు నట
     రాజమార్గంబునం జనిచని.26

శ్రీకృష్ణుడు కుబ్జ యనుకంసదాసి ననుగ్రహించి సురూపం జేయుట

క. అనుపమసుగంధివిస్ఫుర, దనులేపనభాజనంబు హస్తంబునఁ గై
     కొని చనుదానిఁ జపలలో, చన నొక్కెడఁ గుబ్జఁ గనిరి సమదవయస్కన్.27
వ. కృష్ణుం డక్కామినిముసుంగు వుచ్చి వదనంబునం జూడ్కి నిలిపి యియ్యనులేపనం
     బెవ్వరికిం గొనిపోయెద వనిన నది వినయంబున నతని కి ట్లనియె.28
మ. కలపం బెవ్వరు గూర్చి తెచ్చినను నిక్కం బొల్లఁ [2]డెల్లప్పుడున్
     జలకంబాడి మదాగమంబు మదిలోన న్వార్చుఁ గంసుండు రా
     జెలమి న్నెచ్చిన[3]గట్టువా లిది యనన్ హృద్యక్రియావిద్యఁ బే
     శలనై యుండుదు నేను బోయెదఁ దదిచ్ఛాపూర్తి గావింపఁగన్.29

  1. విను
  2. బూలార్చుడున్
  3. గట్టివాకిది; గట్టువారివి.