పుట:హరివంశము.pdf/263

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పూర్వభాగము - ఆ. 9.

215

వ. నిన్నుం బొడగని నామనంబు ప్రియం బందిన నింతయుం జెప్పితి దడయరా దిది
     జననాథుమజ్జనసమయం బనినం బురుషోత్తముండు.30
తే. ఏము పరదేశిమల్లుల మీనృపాలు, రాష్ట్రమును రాజ్యమును జూచి రమ్యమైన
     వింటిపండువు గొనియాడువేడ్క నిట్టు, లరుగుదెంచినారము సరోజాయతాక్షి.31
వ. నిన్ను నీవ పొగడుకొంటి మాకు నూరక మెచ్చవచ్చునె నీచేతిగందం బిచ్చినం
     బూసికొని మఱి మెచ్చెదము మెచ్చి పోయి రాజరంగంబున మెఱసి నీవారమై
     యుండుట యొప్పదె యనిన నవ్వుచుం గుబ్జ యబ్జనాభుం జూచి మేలుగాక
     యట్లైన నిదె కైకొను మని యయ్యంగరాగంబు ననురాగంబుతో నిచ్చినం గొని
     యతం డగ్రజునకుం దొలుత సమర్పించి తానును వలసినవన్నువ[1] యలందికొని
     యనులిప్తశేషంబు తోడిదారకుల కిచ్చె నంత.32
శా. స్థూలస్థానకముల్ భుజాగ్రముల సంశోభిల్ల వక్షస్స్థల
     వ్యాలేపం బతిసాంద్రమై మెఱయ ఫాలాంతర్లలామంబులున్
     మేలీలల్ [2]వదనంబు లిద్దఱును సమ్మిశ్రేంద్రచాపద్యుతి
     శ్రీలం గ్రాలు[3]సితాసితాభ్రములపేర్మిం బొంది రుత్సేకమున్.33
వ. అప్పు డకుబ్జప్రభావుం డగు నప్పురాణకుబ్జుం డాకుబ్జరూపత్వం బపనయింపం
     దలంచి.34
క. తనచరణాగ్రంబున న, వ్వనితపదాగ్రములు దొక్కి వలనొప్పఁగ నొ
     య్యన [4]జుట్టవ్రేలదానివ, దన మింపుగ నెత్తె సంచితస్మిత మలరన్.35
వ. ఇ ట్లెత్తుటయు.36
తే. వంకయొత్తినమన్మథువాలురమ్ముఁ, బోలెఁ జక్కనై యెలమేను పొలుపు మిగిలెఁ
     గుబ్జ కసదునెన్నడుమును గురుకుచద్వ, యంబుఁ జదరపు వెన్నును నభినవముగ.37
క. తనుఁ దాన చూచి యయ్యం, గన యద్భుతకౌతుకములు గడలుకొనంగా
     వనరుహలోచను వదనము, గనుఁగొనెఁ జిఱునవ్వుతోడి గరువపుఁ జూడ్కిన్.38
వ. తనమనంబున నక్కుమారుమీఁదఁ దళుకొత్తు చిత్తజోన్మేషంబు బయలుపఱిచి
     నాకు నుపకారంబు చేసిన యిట్టి మహిమగలవాఁడవు నాయింటికి విజయంబు చేసి
     నన్నుం గృతార్థం జేయవలదె యూరక త్రోచిపోవం జూచిన నేను బోనిచ్చు
     దానం గా నని మెల్లన నిజపాణిపల్లవంబున నతనికరంబు దెమల్చిన.39
క. పని చాలఁ గలదు కమలా, నన క్రమ్మఱ వత్తు నీవు నాసొ మ్మని య
     వ్వనిత విడిపించుకొని తా, నును బలుఁడును నగుచు నతిమనోహరలీలన్.40
వ. మనంబులం బొంగారుకడంకయు బింకంబును జేష్టితంబుల నంకురింపనీక యెల్ల
     విధంబులం గొల్లతనంబ తెల్లం బై తోఁపఁ దెంపుతోడి కినుక నకంపితగమను లై

  1. వన్నియ
  2. వసనంబువన్నె నవ (పూ. ము.)
  3. చరా
  4. జుత్తి