పుట:హరివంశము.pdf/190

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

142

హరివంశము


క.

హరి పరిపాలన సేయఁగఁ, బరమోత్సుకవృత్తి నున్న పశుకోటికి ని
ర్భరవిస్మయావహములై, యురుతరముగ నుద్భవించె నుపసర్గంబుల్.

42


వ.

అమ్మహాదోషంబువలన.

43


చ.

వడఁకుచు రోమకోటి నిలువంబడి మేనులు దూలఁ గన్నులం
దుడుగక బాష్పముల్ వడియుచుండఁ దలల్ దిగవైచి నోరఁద్రే
గుడు దొరుఁగంగ నెంతయును గ్రుస్సి ఖురంబులు వ్రస్సి పుర్వు లు
గ్గడుపుగ గాఱఁ దద్దయును గాఱియఁబొందె వ్రజంబునం బసుల్.

44


క.

[1]కడలను నెత్తురుఁ బాఱం, దొడఁగెం గొన్ని యతిసారదుస్తరబాధన్
బడి ప్రేవులు సిక్కఁ దునిసి, పడకుండునె యనఁగ నెత్తువదె నెల్లెడలన్.

45


ఆ.

[2]నరిడిపుప్పు కప్పనావురు గడుపూఁద, యదురుఁద్రిక్క యనఁగ నడరి మఱియుఁ
దెవుళు లెన్నియేనిఁ దవిలి యెంతయు మహో, గ్రంబులయ్యెఁ బశుగణంబునందు.

46


వ.

అంతయు నుపలక్షించి వయోవృద్ధు లగుగోపాలురు మంత్రంబుల నౌషధంబుల
నగ్నికర్మాదులం దత్ప్రతికారం బుపక్ర మించి యవియన్నియు నిష్ఫలంబులయినం
జేష్టలు దక్కి నిలిచిరి యమునాతీరకాననంబులం జరియించు ప్రాణులు మృగ
పక్షిసర్పాదులు సూక్ష్మజంతువులులోనుగా వివిధవ్యాధిపీడితంబు లై మృతకల్పం
బులు నగుచువచ్చె నట్లు దొడఁగిన యుపద్రవంబు లంత నిలువక గోపప్రకరం
బులయందునుం బ్రవేశించిన.

47


సీ.

జ్వరవేగమునఁ దూలి పొరలిరి కొందఱు సందుసందులు సొచ్చి చదిసి పడిరి
కొందఱు వెస రోమకూపంబు లన్నియు నవిసి నెత్తురు గాఱ నవయవములు
చీములు గట్టంగ శీర్ణంబులై దంతములు గదలంగ నెములు వొగులఁగఁ
గంఠజిహ్వాధరఘ్రాణకర్ణంబులు పొక్కులై యేర్పఁగ నొక్కఁడైన


ఆ.

ద్రావఁ [3]దడవ లేక తలచీర లెఱుఁగర, యార్తులైరి కొంద ఱంతవట్టు
గోపమందిరములు కుష్ఠదుర్గంధమ, యంబు లయ్యె వికృతి యగ్గలింప.

48


క.

నరగోమృగనివహంబులఁ, గరుణము లగురోగవేగకలితాక్రోశ
స్వరములు పెక్కయ్యె దిగం, తరముల నెచ్చోట యమునదరివిపినములన్.

49


వ.

యశోదానందగోపులుం గ్రమంబున రోగార్తి నొందిరి రోహిణియును దదవస్థన
పొందె నట్లు జననీజనకులు లోనుగా సకలబంధువు లధికక్లేశంబులం దూలుట
యాలోకించి బాలుండయ్యును మహాబుద్ధిశీలుండు గావున దామోదరుండు
రామునితో విచారించి యయ్యుపసర్గంబునకుఁ బ్రతికారం బన్నెలవు విడిచి
పోవుట దక్క నొం డుపాయంబు లే దని క్రోశమాత్రం బంతరంబుగాఁ గతిపయ

  1. కడలును నెత్తురు వాఱఁగఁ
  2. నరిడెతిప్పు కప్పనావురు గడుపులు, హదరుదిక్క (పూ. ము.)
  3. దడియు