పుట:హరివంశము.pdf/150

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

102

హరివంశము


కుండె నట్లు సర్వపదేశ్వరుం డై యసురేశ్వరుం డయ్యసురవంశంబు ప్రశంసనం
బొనర్ప దర్పవిభంబున శోభిల్లి.

157

కాలనేమి విష్ణుదేవునిమీఁద యుద్ధసన్నద్ధుఁడై పోవుట

చ.

క్షమయును ధర్మమున్ శ్రుతము సత్యము లక్ష్మియు నాఁగ నెందుఁ బెం
పమరెడు విష్ణుసంశ్రితము లైదుతెఱంగులు దన్నుఁ జేరమిన్
సమధికరోషతన్ సకలసైన్యసమేతముగాఁ బరాక్రమో
ద్యమ మెసఁగం గడంగెఁ గమలాక్షునిమీఁద జయాభిలాషియై.

158


వ.

అప్పుడు.

159


తే.

దైత్యవంశనాశము మదిఁ దలఁచుచున్న, యాదిదేవుని విష్ణు ననంతుఁ గాంచి
కలఁగు డెందముతోడ నక్కాలనేమి, యిట్లనియె నతఁ డాదిగా నెల్ల వినఁగ.

160


సీ.

ఏకార్ణవంబునం దెవ్వఁడు మామధుకైటభు లనువారి గీటడంచె
దితిజవంశమునకుఁ [1]దేవయైన హిరణ్యకశిపు నెవ్వఁడు నఖాగ్రములఁ జీరె
ననిమిషారణి యైనయదితిగర్భంబున [2]ననలాభుఁడై యెవ్వఁ డవతరించె
బలియుఁడై యెవ్వఁడు బలిఁ గట్టి తనమూఁడువిక్రమంబుల లోక మాక్రమించె


తే.

నసురకామినీనేత్రతోయములు గురిసి, యంబుదద్యుతిఁ త్రిదశసస్యంబుఁ బ్రోచు
నెవ్వఁ డవ్విష్ణుఁ డతఁడు నాకిచటనబ్బెఁ, బగయడంగింప [3]గనుటెట్టి భాగ్యఫలమొ.

161


మ.

ఘనకల్పాంతపతంగబింబసమచక్రం బాజిఁ బ్రే రేచుచుం
దునిమేం బల్వుర సస్మదన్వయుల నీదోర్దర్సధుర్యుండు నేఁ
డును దైత్యాబ్ధులఁ గ్రోల నౌర్వశిఖియాటోపంబునం బేర్చునీ
తనియయ్యస్త్రమ యింతకంటెను నిమిత్తం బెద్ది వైరాప్తికిన్.

162


క.

జాత్యంతరములఁ బొందుచుఁ, గృత్యం బొకఁ డెఱుఁగఁ డితఁడు గీర్వాణగణ
ప్రీత్యర్థము దైర్యాన్వయ, మృత్యువ యై యెసఁగు నొప్పమికి మితి గలదే.

163


వ.

వైకుంఠుం డనంతుండు విష్ణుం డను పేళ్లు గలిగించుకొనుటెల్ల నదియకాదె కావున
నియ్యపరాధంబు లన్నింటికి ఫలం బనుభవింపఁ గలవాఁ డై నాబారిం బడియె
ని న్నారాయణు వధియించి పూర్వులఋణంబు నీఁగెదం గా దేని మత్సాయకదళిత
దేహుం డై యుత్సాహంబు విడిచి యితండు నన్ను శరణంబుసొచ్చి ప్రణమిల్లెడు
నదియును మహనీయంబగు నని పలుకుచుం గలహార్థి యై కదియు నెడఁ దద్భాషి
తంబు లాకర్ణించి గోకర్ణశయనుండు నయనారవిందంబులు మందస్మితవికాసంబున
నుద్వృత్తంబులుగా నాసద్వృత్తవిహీనుం జూచి యి ట్లని యె.

164
  1. దెప్ప
  2. ననుజాతుఁ డై
  3. పుణ్యఫలము గంటి