పుట:హరవిలాసము.pdf/62

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చతుర్ధాశ్వాసము 63

గూర్ధ్వాధరస్థానంబు లాక్రమించి త్రివిక్రమావతారంబున విరాడ్రూపంబు వహించినవిష్వక్సేను ననుకరించెదవు. నీకు నితరపర్వతంబులకును సాటియే. ఇది యిట్లుండనిమ్ము మేము వచ్చినకార్యంబు సావధానుండ వయి యాకర్ణింపుము. 62

సీ. ఏవేల్పులకు లేనియీశ్వరశబ్దంబుఁ దాల్చు నెవ్వఁడు సుధాధాముతోడ
నవనిప్రధానంబు లైనయంగంబుల సవరించు నెవ్వాఁడు సకలజగము
నేకతంబున వసియించి యెవ్వనిఁ గంద్రు యోగీశ్వరేశ్వరుల్ యోగదృష్టి
నెవ్వనిపదము సూక్ష్మేక్షబుధులు పునరావృత్తిశూన్యక మండ్రు తెలిసి
తే. యతఁడు శంభుండు విశ్వలోకైకసాక్షి, యడుఁగఁ బుత్తెంచినాఁడు నీయనుఁగుఁగూఁతు
నిమ్ము పెండిలిపెద్దల మేము మీకుఁ, దుహినగిరిరాజ! భాగ్యవంతుండ వైతి. 63

సీ. త్రైలోక్యమునకుఁ జంద్రకళాధరుఁడు తండ్రి తల్లి యాౌఁగాక యీతలిరుఁబోఁడి
హరునకు మ్రొక్కి యనంతరం బమరు లీకుటిలకుంతలకు మ్రొక్కుదురు గాక
యీతలోదరి నిచ్చి హితబాంధవంబున నగుదుగాక గురుండ వఖిలపతికి
నీరాజబింబాస్య కారణంబుగ నద్రికులము దేవకులంబుఁ గలియుఁగాక
తే. తగినవరునకుఁ గన్యకాదాన మిచ్చు, నంతకంటెను మతిభాగ్య మన్య మేది
తల్లిదండ్రుల కఖిలభూధరవరేణ్య!, సకలయజ్ఞాంగసముదాయజన్మభవన! 64

తే. దాతివఁట నీవు మేము సంధాతలమఁట, గారవపుఁ బెండ్లికూఁతురు గౌరియంట
శంభుడఁట పెండ్లికొడు కిది సంప్రదాయ, మభినుతింపఁగఁ దగుఁ బర్వతాగ్రగణ్య! 65

మ. అని దేవర్షి బహుప్రకారమధురవ్యాహారసందర్భముం
బసిగొంచుండఁగఁ దండ్రిపార్శ్వమున సద్భావంబు లజ్జాభరం
బును మౌగ్ధ్యంబును దోఁప నమ్రవదనాంభోజాత యై యల్లన
ల్లన లెక్కించుచు నుండెఁ బాణి నవలీలాపద్మపత్రంబులన్. 66

తే. భూమిధరరాజు సంపూర్ణకాముఁ డయ్యె
ముదముతో మేనకాదేవి మొగము సూచి
కన్యకాదానవేళలఁ గలదు చనవు
క్షితి గృహస్థులకంటె సద్గేహినులకు. 67

వ. అనంతరంబ తనకూర్మికన్యం జూచి హిమవంతుండు. 68

సీ. రావమ్మ తల్లి! సర్వజగచ్ఛరణ్యున కమృతాంశుమౌళికి నైతి భిక్ష
యర్థులై వచ్చినా రాదిమబ్రహ్మలు ఘనపుణ్యరాసులు గగనమునులు
పరమపతివ్రతాపరిషచ్ఛిరోమణి యదె యరుంధతి త్రిలోక్యేకవినుత
నీవు కారణముగ నెఱయంగ సిద్ధించె భాగ్యంబు గృహమేధి ఫలము నాకు