పుట:హరవిలాసము.pdf/56

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చతుర్థాశ్వాసము 57

వ. పార్వతియు బహుమానపురస్సరంబుగా నయ్యుర్వీసురవటునకు నతిథిపూజ యొనర్చిన నతండును గొండరాచూలి సేయుసత్కారం బంగీకరించి ముహూర్తమాత్రంబు విశ్రమించి మేలువడిచూపునం జూచి ప్రస్తావనోచితంబుగా ని ట్లనియె. 17

సీ. సలిలంబు త్రిషవణస్నానక్షమం బౌనె యంభోజపత్రదీర్ఘాయతాక్షి!
కుసుమంబులును నిధ్మకుశపల్లవంబులు సులభంబులై యున్నె సుందరాంగి!
సత్త్వంబు లన్యోన్యజాతివైరముఁ దక్కి శాంతి గైకొని యున్నె చంద్రవదన!
యనుదినంబును దేహయాత్ర కాయిత మౌనె నీవారపాకాది పూవుఁబోణి!
తే. శక్తికొలఁదిఁ దపశ్చర్య సంఘటింతె, ఫలముపై నాస నాగ్రహబంధ ముడిగి
తామ్రబింబోష్ఠి ధర్మసాధనములందు, నాద్య మగుసాధనంబు దేహంబ కాదె. 18

క. మగువా! నీ పెంచినలత, చిగురున ముకుళంబు నుల్లసిల్లెనె చెపుమా
పగడపుఁగెమ్మోవిపయి, న్నగ వుదయించినవిధంబునం బ్రస్ఫుటమై. 19

క. పంకజలోచన! కరద, ర్భాంకురములు మేసినట్టి యపరాధమునన్
రంకుమదపోతకంబుల, జంకింపవుగా తపఃప్రశాంతి వెలితిగాన్. 20

తే. అభ్రవీథిపరిచ్యుతం బైనయట్టి, యమరతటినీజలప్రవాహమ్ముకంటె
ధరణిధరరాజు నీచరిత్రంబుకతనఁ, బరమపావనుఁ డయ్యె నోపద్మనయన! 21

వ. సంబంధంబు సాప్తపదీనంబు గావున నింతతడవు నీతోడఁ గదిసి పలుకుచునికిం జేసి యే నాప్తుండఁ గావున నొక్కమాట యడిగిన బ్రాహ్మణజాతిస్వభావసులభంబైన చాపలంబుఁ జూచి హెచ్చు గుందాడం బని లేదు. రహస్యంబు గాకుండెనేనిం జెప్పుము. 22

సీ. ప్రథమప్రజానాథపావనకులమున బ్రభవించి తబల! ప్రపంచసార
సౌందర్యసంపద సడిసన్నదానవు నశ్వరం బైశ్వర్యనైపుణంబు
సౌఖ్యంబు నిరవధి సర్వసామగ్రి నీ యఱిచేతిభాగ్య మత్యాయతంబు
భాగ్యంబు నీ కేమి భ్రాంతి యైనది మనోరథ మేమి చెప్పుమా రాజవదన
తే. దుష్కరం బైనతప మిట్లు దొడరి చేసి, మేను డయ్యించుకొనఁగ నేమిటికి వచ్చెఁ
జిత్తము విచారమార్గంబుఁ జేరఁ దెచ్చి, తత్త్వముఁ దెలియఁజెప్పు చూతము మృగాక్షి. 23

వ. పితృగేహంబున నవమానంబు పుట్టదు గదా! పన్నగఫణారత్నంబుమీఁదఁ జెయిసాచువాఁడు గలండే. నిండుజవ్వనంబునకుం దగినవిభూషణంబులు తొలంగంబెట్టి వార్ధకోచితంబు లగువల్కలంబు లెట్టులు ధరించితివి? దేవలోకనివాసంబున కాసపడెదేని నది వృథాశ్రమంబు! నీ పుట్టినిల్లు దేవభూమియకదా? తగినవరునిం గామించి సమాధి వహించితి వేని నదియు నీకుం దగదు రత్నం బొరునిచే నన్వేషింపఁబడుఁ