పుట:హరవిలాసము.pdf/52

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తృతీయాశ్వాసము 53

నుంబోలె నీపరమమిత్రుండు క్రమ్మఱిలండు సుమ్మీ! నాపాపంబునం జేసి విధి వెలిగాఁ గ్రొన్ననవిలుకానిం గొనిపోయె. నీవును బరమమిత్రుండవు గావున నన్నును నగ్నిముఖంబున నీసఖుం గూర్పం బాడి. “శశితోడంగూడఁ గౌముదియు మేఘంబుతోడంగూడ మెఱుంగు” ననుట సకలసమ్మతంబు. కుసుమశరుశరీరభసితచూర్ణంబు శరీరంబునందాల్చి నామేను విభావసునందు వ్రేల్చెదం గిసలయతల్పంబులకు నిట మున్ను సహాయుండ వగు నీకుఁ జితి పేర్పంజాలవచ్చెనే యని పల్కి శోకావేశంబున వెండియు. 93

సీ. హస్తయుగ్మము మోడ్చి ప్రార్థించి పలికెదఁ దమ్ముఁడా నా కిమ్ముఁ దగఁ జితాగ్ని
మందమందంబుగా మలయానిలంబులు వెరవుతో మండంగ విసరుఁగాతఁ
బరలోకతృప్తికై బంధు లిద్దఱకును ధర్మోదకం బిండు తమ్మితేనె
సహకారమంజరీచరుపిండకబళంబు పెట్టుడు మాకునై పికము ముట్టఁ
తే. దేనె పెట్టుండు కస్తూరి దీర్చి యచటఁ, జేర గొజ్జంగపూనీటఁ జెంబు లిడుఁడు
నన్ను వలరాజుఁ దలఁచి మన్ననఁ దలిర్పఁ, దగ సమర్పణ చేయుఁడు దంపతులకు. 94

వ. అని తెంపు సేసి యగ్నిప్రవేశంబున కాయితంబై యున్నసమయంబున రతి నుద్దేశించి యాకాశవాణి యోమన్మథపత్నీ! సాహసంబు వలవ దుడుగుము. నీకుం జేరువన మేలు గాఁగలయది నీ మగఁడు కందర్పుండు భుజాదర్పంబునం గన్నుం గానక కనకగర్భుని సమావిర్భూతమనోవికారునిం జేసి తనకుమారిక యం దతనికిఁ గాఁగాని తలంపుఁ బుట్టించె. కన్నియం గవసిన తనయన్యాయంబునకుం దాన రోసి సరసీరుహాసనుం డీసునం బుట్టించినవాఁడు కుసుమశరుండుకదా! యద్దురాత్ముండు హరకోపానలంబున భస్మం బగుం గావుత మని శపించిన నది కారణంబుగాఁ బద్యుమ్నున కిద్దురవస్థ తటస్థించె. 95

ఉ. ఎప్పుడు పెండ్లియాడుఁ బరమేశ్వరుఁ డద్రితనూజ వేడ్కతో
నప్పుడు లబ్ధసౌఖ్యుఁ డయి యంబికప్రార్థన నాసదాశివుం
డెప్పటియట్ల సర్వభువనైకధనుర్ధరునిం బ్రియుం బ్రియం
బొప్పఁగ నిచ్చు నీకు మది నొండు తలుపకు నమ్ము మాత్మలోన్. 96

వ. అని యదృశ్యరూపం బైనభూతంబు రతీదేవిమరణవ్యవసాయబుద్ది మందీభవింపం జేసెఁ గుసుమాయుధబంధుం డగువసంతుండును నావృత్తాంతంబునకు సంతసించి యక్కాంత నూరార్చె నాశాపాంతం బవలంబించి శంబరారిపత్నియు గౌరీకళ్యాణకాలమ్ముం బ్రతీక్షించుచు విరహక్షీణం బైనశరీరంబు రక్షించుకొనుచుండె నంత. 97