పుట:హరవిలాసము.pdf/51

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

52 హరవిలాసము



తే. మాసములు దుఃఖపడె మధుమాధవములుఁ, జిన్నిమలయానిలంబులఁ జిన్నవోయె
మాట లేటికి వేయు నోమగలరాజ, విశ్వమున నీవు లేకున్న వెలితి వడియె. 89

తే. హృదయమున నుండి యెప్పుడు హృదయనాథ
ప్రియముఁ జెప్పెద ననుటెల్ల భేషజంబు
హృదయమున నుంట నిజమేని మదన యెట్లు
భస్మ మైతివి నే నెట్లు బ్రదుకుఁ గంటి. 90

వ. మన్మథ! మధురాలాపనిసర్గపండితంబు లగుగండుంగోయిలల నేలొకో భువనంబులకు రాయబారంబు పంపవు? ప్రణిపాతయాచితంబు లగుగాఢోపగూహనంబులు మఱచితే? యార్తవం బగుకుసుమప్రధానంబు నాయంగంబులం దిది నీవు రచియించినది కదా? దక్షిణేతరం బగుమదీయచరణంబు లాక్షారాగపరికర్మంబునకుం దగదొకో! పతంగమార్గంబున నింగలంబునం బడి భవదంకం బాశ్రయించెదఁగాక మదనుండు లేక రతీదేవి జీవించు ననునపవాదంబు లోర్వవచ్చునే? నీసుహృదీశ్వరుం డయినవసంతుం డెచ్చట నున్నవాఁడు? పటుక్రోధరేఖావటద్భ్రూభంగభీషణముఖుం డగులలాటలోచనులోచనంబు చిచ్చున నతండును వెచ్చి నిన్నుం గూడెనే యని యనేకప్రకారంబులం బలవింపఁ దత్పరిదేవనాక్షరంబులు బాణపాతంబులం బోలి తూఱనాటుటయు నెంతయు నొచ్చి యమ్మధుమాసం బక్కిసలయకోమలికిం బుట్టిన మహావ్యసనం బూరార్పం జేరవచ్చుటయు. 91

సీ. క్రొమ్మిడి కై పెక్కి కుసుమంబు లుమియుచు నవటుప్రదేశంబునందుఁ బొరల
జేవురించిన లేఁతచెక్కుటద్దంబులఁ దాటంకయుగళంబు తన్నియాడ
నాక్రోశపరిదేవనాక్షరవ్రాతంబు కంఠగద్గదికచేఁ గ్రక్కుపడఁగ
హరినీలములచాయ నక్షిగోళమ్ముల సొబగుగాఁ గన్నీటిసోన గురియ
తే. ముత్తియంబులు పేరులు ములిసిపడఁగ
హస్తముల వీఁగుఁ జనుదోయి యడఁచుకొనుచు
సంబెరం బిచ్చె రతిదేవి శంబరారి
కమలిన వసంతు నెదుట దుఃఖార్త యగుచు. 92

వ. ఇవ్విధంబున నారామ పేరామనియెదుట నెమ్మనంబునఁ బేరామనియై వర్తిల్లునార్తి సంబెరంబిచ్చి సొమ్మసిలంబోయి లేచి వసంతునిం గనుంగొని మాధవ! నీ చెలికానిం జూడు కపోతకర్బురం బైన భస్మం బైనవాఁడు! నీవు వచ్చుట యెఱుంగండు సుమ్మీ! ససురాసురం బైనజంబు బిసతంతుగుణం బైనశోదండంబునం గలగుండ్లు వెట్టు నిట్టి జగజెట్టియుం గలండే? యతిపరుషపవనసంపాతాహతం బైనదీపంబు