పుట:హంసవింశతి.pdf/54

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ii


బ్రయోగించిరి. (రామాభ్యుదయము. 2-41). ప్రస్తుత పద్యమున 'వెత' కేమి ప్రసక్తియో సందర్భము చూడవలెను. వల్లపుఁడను వాఁడు రతిసేనయను వేశ్యను గూడుటకుఁ దహతహపడుచున్నాఁడు. స్నానముచేసి, "కన్నర రానున్న మిన్ను గన్నన్నకు" = చంద్రునకు నివేదించి, సన్నబియ్యపుటన్నము భుజించినాఁడు. విటులకుఁ జంద్రోదయము 'కన్నర' - పీడ. ఇక్కడ మన్మథప్రసక్తికిఁ దావు లేదు. కనుక, రానున్నవాఁడు మిన్నుగన్నయ్యయే, చంద్రుఁడే. "కన్నర రా నున్న మిన్నుగన్నయ్య" అను పాఠము సరియైనదని నాతలఁపు.

చమత్కార కవిత్వప్రియులగు శాస్త్రిగారు హంసవింశతి కృతి నభిమానించి, నిండుమనస్సుతో నోర్పుతో సరిచేసి ప్రకటించిరి. వారి కృషి నిస్సంశయముగాఁ జాల దొడ్డది. నేఁడు నాకుఁ జాల నక్కఱకువచ్చినది.

దొరకినంతవఱకు దొరగారి పాఠములను బట్టికొని నడచితిని, 150 ఏండ్ల క్రితము దొరగారి పండితులకుఁ గొఱుకుడు వడని పద్యములు, పదములు, మద్రాసు, బందరు గ్రంథ ప్రకాశకుల పరిష్కర్తలకుఁ గొఱుకుడు వడని పద్యములు, పదములు మిగిలినవి-నేఁటికిని మిగిలియే యున్నవి. అట్టివానిని సవరించు పనికిఁ బూనుకొన లేదు, ఇప్పటి కింతమాత్రము చేయఁగలిగితిని. తప్పులున్న మన్నింప వేఁడుచున్నాను.

నాకీ అవకాశము కల్పించిన ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమి సారథి శ్రీ దేవులపల్లి రామానుజరావుగారికి, రథి డా||బెజవాడ గోపాలరెడ్డిగారికిఁ గృతజ్ఞతాభివందనము లర్పించుచున్నాను.

– సి. వి. సుబ్బన్న శతావధాని

★ ★ ★