పుట:హంసవింశతి.pdf/53

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

i

లను దొలఁగించి, తద్రచనయకాఁ బూరించి యలంకరించిరి. ఒట్టుమొత్తముమీఁదఁ జాల గొప్పపనిచేసిరి. కనుక, “మణౌవజ్రసముత్కీర్ణే సూత్రస్యేవాస్తి మే గతిః" అని నేను సంబరపడి కనులు మూసికొని వావిళ్లవారి క్రొత్తప్రతి ననుసరింపఁ జూచితిని. కాని, “గోషుపేషు" శబ్దము నాకనులు తెఱపించినది. పూర్వముద్రణమున “సంపఁగివిరి.... పాగ, శిరీషపు గోషుపేషు” (4-86} కలవు, నూత్న ముద్రణమున “పాగ"కడ “పాయపోసులు" చేరినవి. పాయపోసులు = ముచ్చెలు. 'గోషుపేషు' తొలఁగించి వీనినిఁజేర్చిరి. మన నిఘంటువులలో 'గోషుపేషు' కనఁబడదు. బ్రౌన్‌దొరగారు అరబ్బీ హిందుస్తానీ పదముల పట్టికలో దీనియర్ధము వివరించిరి. “గోషుపేషు=పాగామీఁద సొగసుగా కట్టుకోబడ్డ వస్త్రము." దవతు, హుశారు, సుపాణి శబ్దములు కవి ప్రయుక్తములే. అయినను నిట్టివి తొలఁగింపఁ బడినవి. పంచమాశ్వాసము నందలి 285 వ పద్యమున "తోడుబోతుల రవంబు" “సివంబు"గా మార్పఁబడినది, తోడుబోతులనగా సహచరులని శాస్త్రిగారు తలఁచిరి. కాదు. మాంత్రికులు, సాహిత్య అకాడెమి ప్రకటించిన “పదబంధ పారిజాతము"న తోడుబోతు చేయు=మంత్రాలద్వారా ఎదుటివారికి కీడు గలిగించు ఆభిచారికక్రియ చేయు అని యున్నది. ఇది రాయలసీమవాడుక అనియు నున్నది. ఇంకొకటి మాత్రము చూపింతును.

క. పన్నీట జలక మొనరిచి
   కన్నురి రానున్న మిన్నగన్నన్నకు మున్
   మున్నొసఁగి సన్నబియ్యపు
   టన్నము మితభుక్తిచేసి యమితోత్సుకుఁడై .
                                            పూర్వప్రతి. (5-139)
క. పన్నీట జలక మొనరిచి
   కన్నెఱి సిరియన్నుమిన్న గన్నన్నకు
                                            నూత్నప్రతి. (5-139)

శాస్త్రిగారు కన్నెఱి=కంటికాహ్లాదకరమైన సౌందర్యముగల, సిరియన్ను మిన్న గన్నన్న = మన్మథుఁడు అని వివరించిరి. అది కన్నురికాదు, కన్నెఱి కాదు. కన్నర (ఱ). ఈ కవి తాతగారు 'కన్నర' శబ్దమును 'వెత' అను నర్థమునఁ