పుట:సాక్షి పానుగంటి లక్ష్మీ నరసింహారావు.pdf/34

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

16

సాక్షి

గలసి యాబల్లనెత్తి వారిరువురకుఁ గదనరంగమును విశాల మొనర్చితిమి. కొంతసేపటికి వారే సిగ్గుపడి లేచి తలలు వంచుకొని కూరుచుండిరి. అప్పుడు నేను వారితో నిటు లంటిని.

కవీ! నీ వెఱ్ఱపంచెఁ జూచి బెదరువాఁ డవనియు, నుచితమగు లజ్జగలవాఁడ వనియు, జంఘాలశాస్త్రీ! పద్యముల కర్థము తెలిపిన యెడలఁ గవితావిమర్శనమున నీకుఁ దగుమాత్రపు నైపుణ్యము గల దనియు, మీయిద్దఱుఁగూర్చి నేను సువర్ణలేఖాపత్రికకు వ్రాసినమాట మీరిప్పుడు కల్ల యొనర్చితిరి. నీవు కవివి కావు. అతఁడు విమర్శకుఁడు కాఁడు. కవితావిమర్శ శాస్త్ర విమర్శవాదములో మీ రేడుతరముల వఱకుఁ బైకిఁ బంపిన శాపబాణములఘాతములు దగిలి “యిట్టి తుచ్చు, లిట్టి వంశనాశకులు మనకులమున నేల దాపరించిరో?" యని మీ పితామహ ప్రపితామహాదులు విగతజీవులెట్టు లేడ్వఁదగునో యట్టు లేడ్చుచుందురు. "ఏ పొరపాటుచేతనో, యే పని తొందరచేతనో, యేశ్రమముచేఁ గలిగిన విసుఁగుదలచేతనో, యేముదిమితనపు బద్ధకముచేతనో యిట్టి కవివిమర్శకుల సృష్టించి మానవజాతి కంతకు నపయశస్సును గూర్చినవాఁడ నయితిగదా? " యని బ్రహ్మదేవు నెనిమిది కన్నుల నేకధారగ నేడ్చునట్లు చేయుటకు మీరు చాలియున్నారు. కుక్కలు పులివిస్తరాకుల పాఁతఱయొద్ద రసోపేతవస్తుపరిశీలనవాదమునఁ దమ్ము దాము గఱచుకొని పీఁకుకొనునుగాని చచ్చిన తమ తాత ముత్తాతల తోఁక వెండ్రుకల నెక్కలాఁగఁగలవా? కవీ! నీకుఁ గవిత్వము లేకపోయిన నేమి మునిఁగిపోయెను! సృష్టికిఁ బరమాసహ్యకరమై బహు లజ్జాకరమైన మీ బ్రదుకువలనఁ బ్రయోజన మేమి? వాణీదాసా! ఈ నడుమ “సువర్ణలేఖా" పత్రికలో ముద్రింపఁబడిన " కవి” యను వ్యాసము నామూలాగ్రముగఁ జదువుకొని తదంతర్వర్ణితములగు శక్తులలో దేనినైన నీవు కలిగియుండునెడల నీవు కవి వనుకొనుము. జంఘాల శాస్త్రి! విమర్శకుఁ డెట్లుండవలయునో సంగ్రహముగఁ జెప్పెద వినుము.

కవి, తన్నుఁదా నెట్లు కవితా వ్యాపారమున మఱచునో విమర్శన వ్యాపారమున నిన్ను నీ వట్లు మఱవవలయును. అనఁగ గవిగాని కవి వారు కాని-నీకుఁ గాని నీసంబంధులకుఁ గాని తత్సంబంధులకుఁ గాని యొనర్చిన యుపకారాపకారములను నీమనస్సునుండి తుడిచి వేయవలయును. నేర్చుకొనఁ దలఁచినది నేర్చుకొనుటకంటె మఱవఁదలఁచినది మఱచుట మనుజునకు సర్వధా కష్టతర మని యెంచఁదగును. కవి ప్రవర్తనములోని దోషాదోషములను గూర్చి నీవు విశేషముగఁ దలపెట్టఁ దగిన యావశ్యకత లేదు. ఆతని ప్రవర్తన మాతనికవిత్వమున కెట్టిమార్పు లెట్టివిలక్షణ విలాసములు కలిగించెనో యవిమాత్రమే నీవు చెప్పవలయును గాని తత్కవితాసాధుతాసాధుతా నిర్ణయ కార్యమునఁ దత్ర్పవర్తనము నీకే మాత్రము తోడుపడఁగూడదు. అడ్డు రాఁగూడదు.

అందఱహృదయములఁ దూఱువాఁడు కవియైయుండ నీవు కవి హృదయమునఁ దూఱువాఁడవు. ఒకచో నన్నవస్త్రములకుఁ గఱవై వట్టి ముష్టిచిప్ప చేతఁ బుచ్చుకొని పైయాకు లెగిరిన కుటీరమునొద్ద నతఁడు కూలఁబడి యేడ్చుచుండును. ఉత్తరక్షణమున దాసదాసీజన పరివృతుఁడై రత్నఖచిత కిరీటాంగదధారియై బంగారు సింహాసనమున గూరుచుండి ప్రజాపాలన మొనర్చుచుండును. తదుత్తరనిమేషమునఁ బొత్తులలో మూత్రాద్యవలిప్తగాత్రుఁడై వ్రేలు నోటఁబడక వెక్కి వెక్కి యేడ్చుచుండును. తరువాత నంతలోఁ బరమదుర్నిరీక్ష్యబ్రహ్మతేజః ప్రాంచితుఁడైన పరమహంసయై జగన్మిథ్యాతత్త్వమును బోధిం