విమర్శక స్వభావము
17
చును. ఒకప్పుడు శక్రధనుస్సౌందర్యముననో, కలకంఠ పంచమారావసౌభాగ్యముననో, ప్రభాతవాతపోతస్ఫుటిత పారిజాతసౌరభముననో చొక్కి, మఱిఁగి, కరఁగి, మైమఱచి మాయ మగును; అట్టి వేగుళ్లపూజరిని, అట్టి సర్వజగద్వ్యాప్తవ్యాపారపారీణునిఁ బట్టి కట్టిపెట్టి నీ వాతని హృదయమునఁ దూఱవలయును. అతని హృదయమున నున్న యనేక హృదయములఁ గాంచి బెదరక యాతని హృదయ మేదో కనుఁగొని పరిశీలింపవలయును. ఒకప్పుడాతని హృదయమేదో యాతఁ డెఱుఁగ కుండుచో దానిని నీవు కనిపెట్టఁగలిగినయెడల నోవిమర్శకుఁడా! నీవు కవికంటె ఘనుఁడవు కదా?
పరమార్థముగఁ గవిత్వ మనఁగ బహిరంతఃప్రకృతులను వాగ్దర్పణమునఁ జూపుట. అట్టిచో నోవిమర్శకుఁడా! నీకు బహిరంతఃప్రకృతి జ్ఞానము యథోచితముగ నుండనక్కఱ లేదా? సర్వదా తెఱచియున్నను జనసామాన్యమున కర్దము గాని చదువనయినరాని-యీబాహ్య ప్రకృతిమహోద్గ్రంథమును నీవు చదువకుండనే కవిగ్రంథవిమర్శనమునకుఁ బూనుకొనుట నీకు దోషము కాదా? సర్వదా మూసియున్న మఱియొకపుస్తక మింతకంటెఁ బెద్దదియుఁ జిత్ర మగునదియు నున్నది. దానిలోని యుపోద్ఘాతమయినఁ జూడకుండ నీవు కవితావిమర్శన మారంభించినచో నీవు మెదడుకలవాఁడ వనిపించుకొనఁగలవా? ఉభయ ప్రకృతిచిత్రపటమగు, కవితాపత్రమును నీవుఁ చేఁబూని యది మాతృకకు సరిపోయియున్నదో లేదో చూచి తీర్మానించు గొప్పపని నీదైయున్నదే? మనుజునిఁ జూచి యాతనిఁ బోలిన బొమ్మను వ్రాయవచ్చును గాని యాబొమ్మ యేవంకలో మాతృకకంటె భిన్నమైయున్నదో కనిపెట్టుట కష్టము గదా? విమర్శకుఁడా! నీపని కష్టయుక్తమే కాక ప్రమాద యుక్తమైనది గూడనగును. కవితాపటమును బ్రకృతితో సరిచూచునపుడు నీవు పొరపాటుచేఁ గాని తప్పుటూహచేఁ గాని బుద్ధిపూర్వకముగఁ గాని తప్పు నొప్పుగా, నొప్పు తప్పుగాఁ జేసినయెడల దైవముఖమును జూచి పలుకవలసిన నీకు- సరస్వతినిఁ జేత ధరించి సత్య మాడవలసిన నీకు- జనులకు యథార్థకవితాభిరుచిని గఱపవలసిన నీకు నెట్టి మహా దోషము సిద్ధించునో కొంచెమైన నాలోచించుకొంటివా? ప్రకృతి జ్ఞానము కలిగిన విమర్శకునికే యిట్టి ప్రమాద ముండఁగ నది లేని నీగతి యేదో యెవ్వఁడైనఁ జెప్పఁగలఁడా! కవి గట్టిన దేదో విడఁగొట్టుట విమర్శకునిపని యని చెప్పుదురు. “చచ్చు తేటగీతమైనఁ జెప్పుము. నేను జెప్పునఁ గొట్టించుకొందును” అని కవి విమర్శకుని నధిక్షేపించుట కలదు. ఇది తప్పు. విమర్శకునికిఁ గవితాశక్తి యుండవలసిన యావశ్యకత యెంతమాత్రమును లేదు, పప్పులో నుప్పెక్కుప" యని చెప్పఁగలవాఁడు పాచకుఁడు గావలయునా? రుచిగ్రహణ పారీణుఁడు భోజనప్రియుఁడైనఁ జాలదా? పడుకగదికి దొడ్డిగుమ్మములేని హేతువునను, పంచపాళిచూరు తలకుఁ దగులుటచేతను, దక్షిణపుఁ దెఱపి మూసియుండుట చేతను, గృహము సదుపాయముగ లేదని చెప్పఁగలవాఁడు, తాపి మూలమట్టము చేతఁబూని తా . నిల్లుగట్టువాఁడై యుండవలయునా? ఆరోగ్యాద్యంగనుఖపరిజ్ఞాని యయినఁజాలదా? గాయకునిపాటలో నపస్వరమును గని పెట్టఁగలవాఁడు ఖరహరప్రియరాగ మాలాపింపఁగలవాఁడై యుండవలయునా? గానానుభవరసికుఁడైనఁ జాలదా? అటులే అటులే-అదేమి! కొంపలు సమీపమునఁ గాలుచున్నవి. లెండు చెప్పవలసిన దింకఁ జాలగా నున్నది. మఱి యొకప్పుడు మాటలాడుకొనవచ్చును.
మేము తొందరగ లేచి తలుపు తాళమువేసి యాతావునకుఁ బరుగెత్తితిమి.