విమర్శక స్వభావము
15
జంఘా - (వికటముగ నవ్వి) నీ వేడ్చుచున్న తెలివితక్కువ నిర్భాగ్యపు టల్లరిచిల్లరి యవకతవక యాసమ్మ యోసమ్మ యారిగ చొప్ప యలుకుగుడ్డకవిత్వము నేఁ జెప్పలేక మానివేయలేదు. గడియసేపు ఛందోగ్రంథ మేదైనఁ జూచితినేని నీపేలపిండి వట్టిగడ్డి కల్లబొల్లి కాకి కూఁత కవిత్వము నాకవిత్వము చుట్టు ముమ్మారు త్రిప్పిత్రిప్పి దిగదుడుచుటకైనను బనికి రాకుండఁ జేయఁగలను. ఆl ఆ సమర్థత లేక యూరకుండ లేదు. గడియకుఁ గావడిగ్రంథములు చెప్పగలను. నాకవితాధారముందు గంగాధారను బిల్లకాల్వ క్రిందఁ జేయఁగలను. ఆకాశము తూటుపడినట్లు-
వాణీ-ఏది! మగవాఁడ వైనయెడల నొక్కమత్తేభముఁ జెప్పుము. ఒక్కచచ్చుతేటగీతి చెప్పుము. అంతవఱ కెందులకు? మూఁడు ముక్కలు గద్యము చెప్పుము. ముచ్చెమటలు పట్టి చావునకు సిద్ధమయ్యెదవో లేదో! ఆ! కుక్కకూఁత నక్కకూఁత యనుకొంటివేమి? దూరపుఁ గల్లవార్తల సోదు లనుకొంటివేమి? డబ్బిచ్చువారియెదుట డుర్రుమని డమరుకము వాయించుట యనుకొంటివేమి? ఒట్టపెట్టనివారిపై నెనిమిదవ యట్టపుఁ బారాయణ మనుకొంటివేమి? లోకువపందలయొద్ద లొట్టాబట్టీయ" మనుకొంటివేమి? చెప్పుము. చెప్పకపోయినయెడల బ్రాహ్మణుఁడవు కావు.
జంఘా-నేనే కవిత్వము చెప్పునెడల నీదేవీస్తోత్రపుఁ గాగితములు, నీపాడునాటకములు చిల్లర దుకాణములలోఁ బొట్లముల క్రింద, దీపావళిఁ బువ్వత్తుల గొట్టములక్రింద, నాసుపత్రిలోఁ “బలాస్త్రి" పట్టులక్రింద నుపయోగపడునట్లు చేయనా? నేను గవిని గాను. కాఁదలఁచుకొనలేదు. నేను విమర్శకుఁడను. నన్నేమని చూచుచున్నావో? కవుల గ్రంథముల కగ్గిపుల్లను. కవులముంగిటి మొండిచేయిని. కవులపాలిటి తుపాకిపిక్కను. నోరు మెదుపుసరికి నోటిమీఁద నీడ్చికొట్టెదను. కవికి విమర్శకుఁ డెట్టివాడో యెఱుఁగుదువా? హె, హె, హె?'
వాణీ-అప్రతిష్ఠ నాచంద్రతారకముగ సాఁగఁదీయుటలోఁ గవి కందినవాఁ డిఁకఁ బుట్టవలయును. నీవు చత్తువు. నేను జత్తును. కాని “ జంఘాలజలదఝంఝామారుత మని జంఘాలకంఠనాళకృంతన ' మని నేను జెప్పఁబోవు గ్రంథములు బ్రహ్మపునస్సృష్టివఱకు నిల్చియుండవా?
జంఘా- వాణీదాసవదన ధూధూకార!" మనియు "వాణీదాసవల్లకాడీయ" మనియు వానిపై నేను జేయు విమర్శనములు పునస్సృష్టిలోఁ గూడ నిల్చునని నమ్ముము. నీవు నానెత్తిమీఁది కెగిరిన యెడల నీ పితామహ ప్రపితామహుల నెత్తిమీఁదికి నే నెగురఁగలను. జాగ్రత్త.
వాణీ-నీవు మాతండ్రిని, మా తాతను దలపెట్టిన నే నూరకుందునా? మీ మేనత్త - తురకవాని యుపాఖ్యానము లోకవిదిత మయినది కాదా?
జంఘా-నీయక్క బంకోలుకంటెనా?
అని లేచి యిద్దఱుఁ కలియఁబడిరి. కాల్చి కుండలోఁ బడవేసిన సీమటపాకాయ పెట్టెవలె టప టప ఢమఢమాంతర్గత చుర చుర తుసు తుసు విరావారభటీ సంప్రదాయమునఁ దుదకు బల్లక్రిందకుఁ బడిన వీరు చిత్రవిచిత్ర శబ్దప్రతిసృష్టి నైపుణ్యమునఁ బ్రకాశించిరి. నేనును, నన్యభిక్షాదీక్షాపరిపూర్తి చేసికొని యప్పుడే వేంచేసిన కాలాచార్యులుఁ