పుట:సాక్షి పానుగంటి లక్ష్మీ నరసింహారావు.pdf/23

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సాక్షి సంఘనిర్మాణము

5

5. వాదములలోఁ దిట్టుకొనఁగూడదు. చేయిచేయి కలుపుకొనఁగూడదు. కలుపుకొనుట యనివార్యమైనప్పుడు న్యాయసభల కెక్కఁగూడదు.

మాసంఘములోని సభ్యులెవరో వారి స్వభావము లెట్టివో మీకుఁ దెలిసికొనఁ గుతూహల ముండునెడల నీ దిగువ -జదువుకొనుఁడు.

మాలో మొదటివాఁడు కాలాచార్యులు. ఇతఁడు శ్రీవైష్ణవుఁడు. సపాదుఁడయ్యు నిష్పాదుఁడు. ఈతనితల పెద్దది. గుండ్రని కన్నులుండుటచే, ముక్కు కొంచెము వెనుకాడుటచే, మొగము గుండ్రముగ నుండుటచే నీతఁడు నరులలో 'Bull Dog' జాతీలోనివాఁడు. ఈతఁడు మాటలాడిన మొఱిగినట్లుండును. ఈతఁడు పొట్టివాఁడు. లంబోదరుఁడు. తారుకంటె నల్లనివాఁడు. ప్రాణమందలి తీపిచే నేకాంతయు నీతని వలచుటకు సాహసింపకపోవుటచేతఁ గాఁబోలు బ్రహ్మచారిగ నున్నాఁడు. సత్ప్రవర్తనము కలవాఁడు. ఈతఁడు వేదవేదాంగములను, ద్రిమత శ్రీభాష్యములను, గీతా భాష్యములను జదివినాఁడు. మతసంప్రదాయములన్నియు బాగుగ నెఱుఁగును. కుండలముల ధరింపవలయు నను కుతూహలము గలవాఁడు. అఖండ ధారణాశక్తి కలవాఁడు. వాక్చాకచక్యము లేనివాఁడు. ధారాళమయిన యంతఃకరణము కలవాఁడు. పొడుము, పొత్తిలోఁ జేర్చి రొండిలోఁ బెట్టిన యెడల నలవాటగునేమో యనుభయము గలవాఁడు. తనకుఁ దెలిసిన యేయంశమును గూర్చియైనఁ బట్టుదలగ వాదించువాఁడు. యథార్థవాది. కోపరహితుఁడు. ఈతఁడు ప్రవేశపురుసు మీయలేని హేతువున వెట్టిసభ్యుఁడుగఁ జేరినవాఁడు.

రెండవవాఁడు జంఘాలశాస్త్రి. ఈతఁ. డారడుగుల యెత్తుగలవాఁడు. విశాలమైన నుదురు, దీర్ఘనేత్రములు, లొడితెఁడు ముక్కును గలవాఁడు. కాలినడకనే యాసేతుహిమాచలపర్యంత దేశ మంతయుఁ దిరిగినవాఁడు. అనేక సంస్థానములఁ జూచినవాఁడు. జమీందారుల యాచించి వా రీయకుండునెడలఁ జెడమడ దిట్టినవాఁడు. ఏ సంస్థాన పూర్వ చరిత్రయేమో, యేప్రభువున కేయే లోపములున్నవో యెఱిఁగినవాడు. దేవస్థానములన్నిటిని సేవించి వానివాని పూర్వోత్తరములన్నియుఁ దెలిసిన వాఁడు. వినువాఁడుండు నెడల గథలఁజెప్పుటలో విసుగువిరామములేని వాఁడు. వాచాలుఁడు. వాదములలోఁ గఱ్ఱజారిపోయినఁ గలియఁబడఁగలిగినవాఁడు. గార్దభగాత్రము కలవాఁడేకాని గానకళానుభవ మెక్కువ గలవాఁడు, అనేక జాతీయములఁ జెప్పఁగలవాఁడు. అర్థ మెవ్వడైనఁ జెప్పినయెడల నెట్టిపద్యములోఁగాని, యెట్టిశ్లోకములోఁగాని యౌచిత్యవిషయమునఁ దప్పుఁబట్టగలవాఁడు. చీపురుకట్టయే యాయుధముగఁ గలవాఁడై హ్రీం హ్రాం కార సహితుఁడై యనేక కాంతల గడగడ లాడించినవాఁడు. అన్ని యంశముల నింతయో యంతయో తెలిసినవాఁడు. ఈతనితలలో, విప్రవినోదిగాని సంచిలోవలె నొకసాలగ్రామము, నొక యుల్లిపాయ, యొకచిలుకబుఱ్ఱ, యొకతేలు, నొకరాధాకృష్ణుని విగ్రహము, నొక బొమ్మజెముఁడుమట్ట, యొకపుస్తకము, నొక పొగాకు చుట్ట మొదలగునవి చేర్చినవాఁడు. ఈతఁడు ప్రవేశపురుసు మిచ్చినాఁడు.

మూఁడవవాఁడు వాణీదాసుఁడు. ఇతఁడు కవి. ఎడమచేయి వాటము గలవాఁడు. అడ్డతలవాఁడు. సంతపశువువలె నెఱ్ఱబట్టఁ జూచి బెదరువాఁడు. అంటురోగము కలవానివలె నెవ్వరిదరిఁ జేరఁడు. గ్రుడ్ల గూబవలెఁ జీఁకటి నపేక్షించును. ఎక్కడఁగూర్చుండిన నక్కడనే పొమ్మను వఱకుఁ బరధ్యానముగఁ గూర్చుండియుండును; మిగుల సోమరి.