Jump to content

పుట:సాక్షి పానుగంటి లక్ష్మీ నరసింహారావు.pdf/24

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

6

సాక్షి

పొట్టివాఁడు. ఆపాదశిరఃపర్యంత మసూయఁ గలవాడు. ఆదికవియైన నన్నయభట్టు మొదలు కొని యాధునిక కవియగు నన్నాసాహేబువఱకందఱను దూషించును. శ్లేషకవిత్వమందె రస మెక్కువ కలదని నమ్మకము కలవాఁడు. అన్ని విధముల కవిత్వములు చెప్పఁగలవాడు. ఇతఁడు నువ్వుగింజమీఁద నూఱుపద్యములు చెప్పినాఁడు. మూఁడు సంవత్సరములనుండి కంకణబంధ మొకటి వ్రాయుచున్నాఁడు. పెదవులు నల్లగ నుండుటచే నీతఁడు చుట్టగాలుచు నలవాటు కలవాఁడై యుండును. ఈతఁడు శూద్రుఁడు. ఈతఁ డాధునిక పద్ధతి ననుసరించి కవిత్వముఁ జెప్పుటకు బ్రయత్నించుచున్నాఁడు.

నాల్గవవాఁడు కోమటి. ఈతఁడు వాణిజ్యరహస్యము లెఱిఁగిన వాఁడు. కొంతకాలము క్రిందట వర్తకము బాహుళ్యముగఁ జేసిన వాఁడు. విశేషధన మార్జించినవాఁడు. ఇతఁడు మహైశ్వర్య దినములలో నున్నప్పుడు బయలుదేఱిన తామరతప్ప నిప్పు డీతనికి వెనుకట ధన మేమియు మిగులలేదు. డోకడా లవలీలగఁ గట్టఁగలవాఁడు. ఈతఁ డెక్కడకు బోయినను మూఁడు చేతులతోఁ బోవును. (తనకై రెండు చేతులు, తామరకైయిత్తడిచేయి) ఈతఁ డటికయంత తల గలవాఁడు. ఈతని పేరు బొఱ్ఱయ్య; ఈతఁడు మాయింటిగుమ్మమునఁ బట్టఁడు. తెలిసినయంశములు వ్రాఁతరూపకముగ మాకుఁ దెలియపఱచుచుండును. ఈతఁడు ప్రవేశపురుసుము నిచ్చెను.

నే నయిదవవాఁడను, నేనెవఁడనో నాకుఁ గొంత తెలియునుగాని నేనెవఁడనో మీకు స్పష్టీకరించుటకుఁ దగిన యాత్మజ్ఞానము కలవాఁడను గాను. నాసంగతి మీరు ముందు నావ్రాఁతలఁబట్టియే కనిపెట్టఁగలరు. నే నారామద్రావిడుఁడను. నాపేరు సాక్షి. మేము ప్రచురించు పత్రికకు నా పేరే యుంచితిని. వారమున కొకటి రెండు దళములఁ బంపెదము మీరు మీ పత్రికలో వాని నచ్చువేయింపఁ గోరెదము. ఎల్లకాలము మీకీశ్రమ మిచ్చువారము కాము. మా జంఘాలశాస్త్రి యెక్కడ నుండియో యెటులో యొక ముద్రాయంత్రమును, దాని పరికరములను నొడివేసి లాగుకొని వచ్చెదనని కోఁతలు గోయుచున్నాఁడు. అంతవఱకు మీపత్రికకుఁ బంపుదుము. మీకు మావలని ప్రతిఫల మేమియును లేదు. సరేకదా, మీ పత్రికా వ్యాపారము తిన్నగ నుండకుండునెడల మిమ్ములనుగూడ మాపత్రికలో నధిక్షేపించుచుందుము. పరీధావి సంవత్సర మాఖబహుళ చతుర్దశీ శివరాత్రి గురువారమునాఁడు లింగోద్భవ కాలమున నీసభ పుట్టినది.

మాది సత్యపురము. మా సాక్షి స్థానము తపాలకచేరి కెదురుగ.

ఇట్లు విన్నవించు

సభ్యులందఱిబదులు

సాక్షి.