4
సాక్షి
జోక్యము కలుగజేసికొనకుండుట. అతనిని సంఘము నుండి యొకవిధముగ బహిష్కరించి యాతనిని సంఘాగ్రహపాత్రునిఁ జేయుట. పది సంవత్సరముల కఠిన శిక్ష కంటెఁ బదిమంది సంఘమువలన నేరగానిఁగూర్చి చేయఁబడిన యనాదరణము నేరము నాపుటలో బలవత్తరమైనది.
రాజకీయదండనము గల యీ నేరములకే సంఘ దూషణము నేరము నడఁగించుటకుఁ గావలసివచ్చినప్పుడు రాజకీయదండనములేని మొదటఁజెప్పిననేరములకు - మనుజుల మాయాప్రచారములకు - సంఘదూషణ (Social Odium) మావశ్యకమైయుండదా? ముఖ్యముగ నుండును. ఉండక తప్పదు. ఇట్టి నేరములఁగూర్చియే మే మిఁక వ్రాయుచుందుము. నేరముల వెల్లడింతుము. వాని స్వభావముల విశదపఱతుము. వానివలన సంఘమునకుఁ గల్గు హానిని స్పష్టపఱతుము. వానియందు జనుల కసహ్యము గల్గునట్లు సేయుటకై ప్రయత్నింతుము. నేరములనే మేము నిందింతుము. కాని యట్టి నేరములకు లోనయిన వారిని నిందింపము. వారినిఁ దలపెట్టనైనఁ దలపెట్టము. మాకు వారితో లేశమును బనిలేదు. ఇంతియేగాక మత విషయములను గూర్చియు, నారోగ్య విషయములను గూర్చియుఁ, గవితాద్యభిరుచిప్రధానశాస్త్రములఁ గూర్చియు, సంఘదురాచారములఁ గూర్చియు, విద్యాభివృద్ధి సాధనముల గూర్చియు, జరిత్రాద్యంశముల గూర్చియు, రాజభక్త్యాదులఁ గూర్చియు, నావశ్యకములని మాకుఁ దోఁచిన యింకఁ గొన్ని యితరాంశములను గూర్చియు వ్రాయుచుందుము.
నేను, మఱినలుగురుఁ గలసి యొక చిన్న సంఘముగఁ జేరినాము. మీ రైదుగురుఁ జేరి, యిట్టి మహా కార్యము సేయఁగలరా? యని మీరడుగుదురేమో? ఉడుత లుదధిని బూడ్చినట్లు చేసెదము. తరువాత మాతో నెన్నికోఁతులు చేరునో, యెన్ని కొండమ్రుచ్చులు, నెలుగుబంట్లు కూడునో! ప్రయత్నమే మనుజునియధీనము. ఫలము దైవాధీనము కాదా?
మేము ప్రతిరాత్రియు నొకచోఁ జేరుదుము. ఇప్పటి వఱకు మాకు సొంత భవనము లేకుండుటచే నద్దెయింటిలోఁ జేరుదుము. మే మీదిగువ నుదాహరించిన నిబంధనలను జేసికొంటిమి.
1. సభ చేరఁగానే మన చక్రవర్తి గారికిఁ జక్రవర్తి గారికి వారి కుటుంబమునకు దీర్ఘాయురారోగ్యైశ్వర్యముల నిమ్మనియుఁ, బ్రజలకు వారియెడల నిరంతర రాజభక్తిని బ్రసాదింపవలయుననియు, మా సంఘము చిరకాలము జనోపయోగప్రదముగ నుండునట్లు కటాక్షింపు మనియు దైవమును బ్రార్థింపవలయును.
2. రాజకీయ విషయములను గూర్చి యెన్నఁడును ముచ్చటింపఁగూడదు వ్రాయఁగూడదు.
3. తప్పులనేగాని మనుష్యుల నిందింపఁదగదు. తప్పులను విశదీకరించుటయందు బాత్రము లావశ్యకము లగునెడల నట్టివి కల్పితములై యుండవలయును.
4. సభ జరుగుచున్నంత సేపు మత్తుద్రవ్యములను ముక్కునుండి గాని నోటి నుండి గాని లోనికిఁ జప్పుడగునటుల పోనీయఁగూడదు.