పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/325

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

318

శ్రీవేంకటాచలమాహాత్మ్యము


తే.

పూలు మంత్రాక్షతలు పండ్లు పొలఁతి కిచ్చి
దీవన లొసంగి వోయిరి వేగ పెండ్లి
యగునటంచును వకుళను నపుడు వేఱ
వనితగానుంట గనుఁగొని మనమునందు.

55


క.

ధరణీదేవి రయంబునఁ
బెరిమను దోడ్తెచ్చి రత్నపీఠమునందుం
గరమర్థి నునిచి వకుళను
గురుతరవినయంబు నడిగెఁ గూర్మి యెసంగన్.

56


సీ.

అమ్మ నీ వెవ్వరికై వచ్చితివి యిట్టు
        లెందుండి వచ్చి విటకు నెలమి
వచియింపు మనఁగ నవ్వకుళమాలిక యిట్టు
        లనియె నోయమ్మ శేషాద్రి నుండి
వచ్చిత ననఁగ నెవ్వరిదాన వని ధర
        ణీదేవి యడుగఁగా నిక్క మేను
ధర వేంకటేశుని దాననై యుందు నా
        స్వామి పంపించఁగ వచ్చి తిచటఁ


తే.

జేరినానని వకుళ మచ్చికను బల్క
విని మహీపతిసతి యేమి పనికి నీవు
వచ్చినావని యడుగఁగ వకుళ యేను
బెండ్లిపెత్తనముగననెఁ బేర్మిఁ దనర.

57


క.

అని పల్కిన వకుళనుఁ గనుఁ
గొని ధరణీదేవి యెవరికొఱ కిప్పుడు పె
త్తన మిచటఁ జేయవచ్చితి
వని యడుగఁగ వకుళ యిట్టు లనియె ముదమునన్.

58