పుట:రాధికాసాంత్వనము (ముద్దుపళని).pdf/8

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

౧౧


ప్రబంధము నాలుగు ఆశ్వాసములుగా పెరగడం కోసం…ముద్దుపళని, రాధ చేత… చంద్రోపాలంభనాదికములు, ఛాందసకార్యములు చేయించింది. అంతమాత్రమే!—ప్రత్యేక కల్పనాలంకృతములు కావు ఆ భాగములు: విశేష చమత్కారములున్నూ లేవు…

—కాని, రాధను చిత్రించడంలో ముద్దుపళని శిల్పసౌభాగ్యమంతా వినియోగపడింది. రాధ…నందునికన్నా చాలా చిన్నది. గేహే గేహే జంగమా హేమవల్లులు మెరసిపోయిన వ్రేపల్లెవాడలోనే…ఆమెను మించిన అందాలరాసులు లేనందువల్ల…గోపకిశోరునికి ఆమె అనంగసర్వస్వరూపమవటంలో విశేషం ఏమిలేదు. వివాహిత; కాని, మోట—గొల్లమగనితో కాపురం చేయకపోవడం—నందాదులు హర్షించి ఊరుకున్నారంటే…సామాన్యకుటుంబధోరణిలో కళంకమైనా…అది వారిరసజ్జతను రెట్టిస్తూ, లోకైకశృంగారవీరశేఖరుడైన కృష్ణునికి పెంపుడుకులముగా ఉండగల తాహతుకు ప్రతిపత్తి కల్పిస్తున్నది.

కృష్ణుడు…రాధకు సర్వమున్నూ, కృష్ణుని చిన్నిభార్య కనుక ఇళను ఎంతో కూరిమితో పెంచి …ఆతనికి తగినయిల్లాలుగా తయారుచేసింది. తన అనుభవమంతా వినియోగించి. —శృంగారించి గదిలోకి పంపింది. ఇక అక్కడనుంచీ …ఆమె ప్రవృత్తి సాఫుగా మారిపోతుంది. అంతకుముందు, ఇళ తన శిష్యురాలు. నవ్వులాటకు సవతి అని పరిహాసం చేసినా…మనసులో బాధపడవలసిన అవసరం లేకపోయింది—వ్యధ ప్రత్యక్షంగా అనుభూతం కాందువల్ల.

—పడకటింటి గదితలుపు గడియ పడగానే…రాధగుండెల్లో రాయిపడ్డది. దంపతులిరువురూ ఏకాంతాన అనుభవించే సుఖమును తలచుకొన్న కొలదీ…మతిపోతూన్నది. తనకు లేదని ఒకమూలచింత: తనవాడు—మరొక్కతెతో—ఇళ అయినప్పటికీ—తనకు ఖాయములైస భోగములు పొందుతున్నాడని…అంతకుమించిన వేదన. తెల్లవార్లూ ఎలావేగించిందో…పొద్దు పొడవకముందే—ఇక నిలువలేక