పుట:రాధికాసాంత్వనము (ముద్దుపళని).pdf/9

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

౧౨

—వెళ్లి తలుపు తట్టి…లోపలికి చొరవ చేసుకుని జొరబడి, కసి—ససిగా—తీర్చుకున్నది…

…కుంభకుడు కూతుర్ని అల్లుడినీ తీసుకపోవడానికి వచ్చినప్పుడు రాధను కూడా సమ్మతి అడిగినాడు. అత్తా—అల్లుడిపరిచయం అందరూ ఎరుగున్నదేకదూ? …కాని ఆమె ఏలా పంపగలదు? —మరి పంపకనూ విధి లేదు. అందుచేత మనోగతభావములను పైకి తొణకనీయకుండా చాలాసరదాగా మాటాడి సంతోషముగా సరేనన్నది. ఇక తరువాత…ఆమె అవస్థ…

—కృష్ణుడు మిథిలనుండి బెదురుతూనేవచ్చాడు…విడిచి వెళ్లినందుకు రాధ ఎంతగా దండిస్తుందో అని.. కాని ఆమె తయారీలో రాటుదేరినవాడే గనుక అనునయించలేకపోతానా అని భరోసా మాత్రం ఉన్నది. అయినా ఏమవుతుందోననే భయం ఆదుర్దా, లేకపోలేదు.

కంటబడగానే…ఎన్ని నిష్ఠురములాడింది!…ఎన్నిరకాల దెప్పిపొడిచింది?…ఎంతకోపము తెప్పించుకుని బుసలుకొట్టింది. అయినప్పటికీ, లయవిడవకుండా—మూర్ఛనలో తొట్రువలు గమకించే మహాగాయకుడి గీతాలాపనలాగు, అంత కసురుతున్నా…వెల్లివిరిసిన అనురాగం, అపేక్ష—అంతర్వాహినిగా ద్యోతకమౌతూనే ఉన్నవి. నాథుని అలయించి—అలరించడం… కులపాలికల సామాన్యశృంగారధర్మమైనా ఇన్ని పోకడలు—ఎత్తులు, వాళ్లకు చేతనవుతవా? తుల్యానుభవయోగ్యత ఉన్న సరసనాయకితప్ప…మరొకరు కథారసపోషణము— ఇంతప్రౌఢిమతో చేయనేర్పరులయేవారా?

ముద్దుపళని వారాంగన అని…సనాతనులు ఆమెను తత్కర్తృకములనూ…అకారణవైరంతో కృత్రిమంగా ఈర్షించవచ్చును.