పుట:రాధికాసాంత్వనము (ముద్దుపళని).pdf/3

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సిసలైన శృంగారకావ్యమును…ఆద్యంతరతివిహారప్రధానంగా రచించవలెనంటే…యౌవనవతి సకలకలాప్రౌఢ—సర్వంకషరాసిక్యనిధానము వెలయాలు—ఒక్కతే తగుతుంది.

మగవారికి చేతకాదని…దోషాపాదనము లేశమున్నూ కాదు. కాని ఎంతఊహించి కథాదృశ్యమును చిత్రించినా మగవాడు—దీపము ఉండగా ఇల్లు చక్కబెట్టనీయలేడు—చీకటితప్పు కనుక. పింగళిసూరన్న స్వతంత్రించినా ననుకున్నా సుగాత్రిచేత ఎదురుబ్రతిమాలించడానికి…నాయికానాయకులను—వైదికదంపతులను—ఊరివెలుపలితోటలో చెట్లచాటున దాచివేయక తప్పిందికాదు.

పోనీ కవి అంతకన్న ఇంకా కొంచెంవిజృంభించినా…నాయికాసాలభంజిక ఊహాగానలయను ఊగవలసినదేకాని…అకృత్రిమచైతన్యస్పందితముకాదు. విద్యాదయితుడంతటివాడు…ఆడువారిసుఖానందం అనుగతంగా ప్రత్యక్షీకరించుకునేందుకు…భార్యను బ్రతిమాలి సెక్సు మార్చుకున్నాడని—కళాపూర్ణుడి జననవార్తకు పూర్వరంగం ప్రమాణము.

—కవిసార్వభౌమునితో కన్నెతనపు మురిపెములలో ప్రౌఢరికము చలాయించి దేశములు తిరిగి ‘కన్నడరాజ్యరమారమణు’ని రసికజీవనం ధన్యముచేసిన తెలుగువాణికి…తాళికోటలో నిలువనీడ తరిగిపోయింది. అష్టదిగ్గజాధిరూఢోత్సవవైభవము కలలలో మలగిపోయినా…మధుర తంజాపురసామంతనాయకులు కావ్యకన్యకజీవనసంధ్యకు అరిగాపులై నిలిచినారు. వయసుజిగివి పోయినా ఆమె అలవాటుచొప్పున ఎడనెడ వింతకై సేతలు మానినది కాదు!

ఆ తళుకులే…నవ్యసారస్వతానికి, రచనాలాలిత్యానికి, ఊతలై నిలిచిన…కావ్యచిత్రశోభలు.

—భోసల తుళజేంద్రుని కుమారుడు—ప్రతాపసింహుడు. తుళజరాజు వెనుకవారు కృష్ణరాయలు నమ్మిన మరాటాసామంత