పుట:భీమేశ్వరపురాణము.pdf/67

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తృతీయాశ్వాసము 47

భీమనాథమహాదేవు పెండ్లినాఁటి
దక్షిణాముఖమండపదర్శనమున. 24

తే. కార్తికీవేళ భీమశంకరునినగరఁ
దూఱు నెవ్వాఁడు చిచ్చఱ తోరణంబు
నతఁడు దూఱఁడు ప్రాణనిర్యాణవేళ
ఘోరయమపట్టనద్వారతోరణంబు. 25

తే. ద్వాదశక్షేత్రపుణ్యక్షేత్రములతోడ, రమ్యమగు సప్తగోదావరంబుతోడ
వరదభీమేశ్వరేశ్వరావాసమైన, దక్షవాటంబు కళ్యాణధామ మమరు. 26

తే. అప్పురంబు ప్రభావంబుఁ జెప్పనేల, తిరిగి పాఱంగ యోజనత్రితయభూమి
వాపికాకూపగర్తపల్వలతటాక, క్షేత్రజలములు భాగీరథీజలములు. 27

సీ. పంచాక్షరీమంత్రపారాయణంబులు, జపియించు శారికాసముదయములు
నీలకంఠస్తోత్రకోలాహలప్రౌఢి, జూపు నున్మత్తపుంస్కోకిలములు
శతరుద్రసచ్ఛృతి స్వాధ్యాయపాఠంబుఁ, బరిఢవించుఁ గిశోరబంభరములు
ప్రణవాక్షరాభ్యాసపరిపాటిఁ బాటించు, నానావిధంబుల నమిలిపిండు
తే. సప్త గోదావరంబు నిరర్ఘసహస్ర, సారణీసేకసాంతత్యసంప్రవృద్ధ
వివిధతరుగుల్మవల్లికావేలమైన, తత్పురోద్యానవీథికాంతంబునందు. 28

సీ. నిఖలపుణ్యక్షేత్రనివహంబునందును, నత్యంతమాశ్రయం బనఁగ నెగడి
యైంద్రసంపద కెల్ల నాధారభూతమై, దక్షునియజ్ఞంబు తానకమయి
ద్వాదశపుణ్యక్షేత్రములతో సంధిల్లి, భోగమోక్షవిహారభూమి యగుచు
నియమయాత్రామాత్రనిశ్శేషదోషాప, హరణం బొనర్ప సమర్థమగుచు
తే. సిద్ధనిర్మలనిరవధి శ్రీస్వయంభు, ధన్యభీమేశ్వరేశ్వరస్థాణులింగ
దైవతస్థితిసంభవస్థానమైన, దక్షవాటంబు వర్ణింపఁ దరమె మనకు. 29

క. దక్షిణకాశీనగరము, దక్షారామంబు భీమధామము ధన్య
త్కుక్షిక్షోణీమండల, రక్షామణి దానిఁ బొగడ బ్రహ్మకు వశమే. 30

సీ. భీమేశ్వరేశ్వర శ్రీమహాదేవుండు, హిమధామమౌళి విశ్వేశ్వరుండు
సప్తగోదావరసలిలప్రవాహంబు, సాక్షాత్కరించిన జహ్నుకన్య
తిరుచుట్టుమాలెలోఁ దిరమైనగణపతి, యేకాంతడుంఠివిఘ్నేశ్వరుండు
దక్షిణంబుననున్న దండపాణీశుఁ డూ, హింపంగ దండపాణీశ్వరుండు
తే. భైరవస్వామి శ్రీకాలభైరవుండు, నంది నందీశ్వరుం డేమి సందియంబు
దక్షవాటంబు కాళికాస్థలముగాదె, తీవ్రకరతేజ సత్యవతీతనూజ. 31

వ. మఱియు భీమేశ్వరమండలమునకు సీమాసంవిభాగంబు. 32